ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ సిటీస్‌ కేటగిరీలో మరో 7 ‘స్వచ్ఛ’ అవార్డులు

26 Nov, 2022 03:00 IST|Sakshi

ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ సిటీస్‌ కేటగిరీలో లభ్యం 

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటన 

మంత్రి కేటీఆర్‌ హర్షం.. రూ.2 కోట్ల చొప్పున ప్రోత్సాహకం ప్రకటన  

ఇప్పటివరకు రాష్ట్రంలోని 26 పట్టణాలకు అవార్డులు

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించిన స్వచ్ఛ అవార్డుల జాబితాలో తెలంగాణలోని ఏడు పట్టణాలకు చోటు దక్కింది. ఇప్పటికే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌ విభాగంలో 16 అవార్డులు రాగా, ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) విభాగంలో మరో మూడు అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రదానం చేసింది. తాజాగా కాగజ్‌నగర్, జనగామ, ఆమన్‌గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట, గ్రేటర్‌ వరంగల్‌ పురపాలికలకు ఫాస్టెస్ట్‌ మూవింగ్‌ సిటీస్‌ (వేగంగా ఎదుగుతున్న నగరాలు) కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దీంతో తెలంగాణ మొత్తం 26 అవార్డులను సాధించినట్లయింది. 

4,355 పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే 
స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్‌ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు నిర్వహించింది. పారిశుధ్యం, మున్సిపల్‌ ఘన..ద్రవ వ్యర్థాల నిర్వహణ, అవగాహనపై దేశ వ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహించారు. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, ఉమ్మి రహిత వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్‌ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు.. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, ద్రవ..వ్యర్ధాల నిర్వహణ, ప్రజల అవగాహన, సిటిజెన్స్‌ ఎంగేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్‌ తదితర అంశాలు పరిశీలించారు. అనంతరం అవార్డులు ప్రకటించారు.  

తక్కువ మున్సిపాలిటీలు.. ఎక్కువ అవార్డులు: కేటీఆర్‌ 
రాష్ట్రానికి మరిన్ని స్వచ్ఛ అవార్డులు దక్కడంపై పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో అటు పల్లెలు, ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డులు దక్కుతున్నాయని చెప్పారు.

తక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ఉన్నప్పటికీ అత్యధిక అవార్డులు దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. తెలంగాణ అద్భుత, వినూత్న కార్యక్రమాలను యావత్‌ దేశం ఆదర్శంగా తీసుకుంటోందని అన్నారు. ఈ అవార్డులు రావడంలో పురపాలక శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర వహించారంటూ వారిని అభినందించారు. అవార్డులు సాధించిన పురపాలికల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచి్చన పట్టణాలకు రూ.2 కోట్ల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహక నిధులను ప్రకటించారు.

ఇదీ చదవండి: Hyderabad: జనవరిలో నూతన భవనంలోకి యూఎస్‌ కాన్సులేట్‌

>
మరిన్ని వార్తలు