నాడు తల్లి.. నిన్న తండ్రి మృతి

3 Aug, 2020 11:31 IST|Sakshi
వృద్ధురాలు నానమ్మతో పిల్లలు

అనాథలైన చిన్నారులు

ఆదుకోవాలని వేడుకోలు...

ఖానాపూర్‌: చిన్నతనంలోనే అనారోగ్యంతో తల్లి.. శనివారం తండ్రి మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మిగిలారు. ఉన్న నానమ్మ సైతం వికలాంగురాలు కావడంతో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మండలంలోని సత్తన్‌పల్లి గ్రామానికి చెందిన ఇరవేని కొమురయ్య, పద్మలకు ముగ్గురు సంతానం. అనారోగ్యంతో పద్మ 15ఏళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఇద్దరు కుమారులు, కూతుర్ని తండ్రే అన్నీ తానై చూసుకుంటున్నాడు. అయితే రెండేళ్ల క్రితం తండ్రి కొమురయ్య కాలుకు తీవ్ర గాయమై అనారోగ్యం బారిన పడ్డాడు.

చికిత్స కోసం అప్పులు చేసి నిజామాబాద్, హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినా నయం కాలేదు. ఏడాదిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. తండ్రిని బతికించుకునేందు కూతురు సైతం చదువు మానేసి తండ్రికి సపర్యాలు చేసింది. ఇటీవ  ల అనారోగ్యం పూర్తిగా క్షిణించడంతో కొమురయ్య (40) శనివారం మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు, మిత్రులు చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. కుమారులు సాయి(11) 9వ తరగతి పూర్తి చేయగా,  మనోజ్‌(12) పదో తరగతి పూర్తి చేశాడు. కూతురు మల్లేశ్వరి(15) పదో తరగతి వరకు చదివి తండ్రి కోసం మానేసింది. ప్రస్తుతం వీరు నానమ్మ వద్దే ఉంటున్నారు. ఉండేందుకు ఇళ్లు తప్ప ఎలాంటి ఆధారం లేదు. నానమ్మ సైతం వికలాంగురాలు కావడంతో ఏమిచేయని పరిస్థితి. దీంతో ముగ్గురు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చేస్తున్నారు. ఎవరైనా దాతలు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు