మాయదారి రోగం: రెండేళ్ల క్రితం తండ్రి.. నేడు తల్లి..

9 Nov, 2021 12:15 IST|Sakshi
చిన్నారులు వర్షిత్, వైష్ణవి

సాక్షి, చండూరు(నల్లగొండ): అభం శుభం తెలియని వయసులో పెద్ద కష్టమే వచ్చింది. అమ్మానాన్న నీడలో హాయిగా ఉండాల్సిన చిన్నారులపై విధి కన్నెర్రజేసింది. రెండేళ్ల తేడాతో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అభాగ్యులు నేడు విధి వంచితులుగా మిగిలారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని బోడంగపర్తి గ్రామానికి చెందిన బొమ్మరగాని రాజు (32), యాదమ్మ (30) దంపతులకు వర్షిత్‌(10), వైష్ణవి(8) సంతానం.

కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. స్థానికంగా వర్షిత్‌ 5వ తరగతి, వైష్ణవి 3వ తరగతి చదువుతున్నారు. సొంత భూమి లేకపోయినా పూరి గుడిసెలోనే ఉన్నంతలో హాయిగా జీవనం సాగిస్తున్నా రు. కాగా, రెండేళ్ల క్రితం మాయదారి రోగం బారిన పడి రాజు మృతిచెందాడు. దీంతో యాదమ్మపైనే కుటుంబ భారం పడింది. మనోధైర్యం కోల్పోకుండా కూలీ పనులు చేస్తూ పిల్లల ఆలనా పాలన చూస్తోంది.

కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడిన యాదమ్మ కూడా సోమవారం కన్నుమూయడంతో ఆ చిన్నారులకు నా అనేవారు లేకుండా పోయారు. దీంతో గ్రామస్తులే ఆమె దహనసంస్కారాలు నిర్వహించారు. అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవా లని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.  చిన్నారులకు టీఆర్‌ఎస్‌ గ్రామ నాయకులు కట్కూరి సత్తయ్య, గుర్రం వెంకట్‌రెడ్డి, ము త్తయ్య, వెంకన్న, సురేష్, నరేష్, రామలింగం, శ్రీను, మహేష్‌ రూ. 10వేల ఆర్థికసాయం అందజేశారు.   

మరిన్ని వార్తలు