కన్నీటి గాథ: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా ఆ నాన్న అనాథే

28 Nov, 2021 09:59 IST|Sakshi

సాక్షి,డోర్నకల్‌(వరంగల్‌): ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టగానే ఆ నాన్న చాలా సంతోషపడ్డాడు. తన రెక్కలను ముక్కలు చేసుకుని మరీ పిల్లలకు ఏ కష్టమూ రానీయకుండా ప్రేమతో పెంచి పెద్దచేశాడు. ఉన్నత చదువులు చదివించాడు. పెళ్లిళ్లు చేసి వారందరినీ ఇంటివారిని చేశాడు. పిల్లల అభివృద్ధిని ఆకాంక్షించాడు తప్పా మరే స్వార్థమూ ఆలోచించలేదు. పిల్లలే ఆస్తిపాస్తులుగా భావించాడు. ఈ క్రమంలోనే భార్య, ఓ కూతురు మృతిచెందారు. తన పిల్లలు కలకాలం బాగుండాలని సింగరేణి ఉద్యోగానికి కూడా స్వచ్ఛంద విరమణ తీసుకుని కుమారుడికి ఉద్యోగం ఇప్పించాడు.

ఉన్నదంతా పిల్లలకే..
ఉన్న ఆస్తిపాస్తులన్నీ పిల్లలకు ఇచ్చేశాడు. ఇప్పుడు వృద్ధాప్యం మీదపడింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఒక్కడు అంత మందిని పోషించినా ఏ రోజూ ఇబ్బంది పడని ఆ నాన్నను వారు అనాథ చేశారు. కుమారుడు, కూతుర్లు ఇంటినుంచి గెంటేశారు. నా అనుకున్న వారు కూడా దగ్గరకు రానీయడం లేదు. దీంతో ఇప్పుడు అనాథ నాన్నగా సమాజం ముందు నిలబడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సీరోలు కాంపెల్లికి చెందిన సలవాది ఇమ్మానియల్‌ (75) కొత్తగూడెం సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం చేశాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమార్తెలకు, కుమారుడికి పెళ్లిళ్లు చేశాడు. అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం భార్య, ఓ కుమార్తె మృతిచెందారు.

తను స్వచ్ఛంద పదవీ విరమణ పొంది తన ఉద్యోగాన్ని కుమారుడికి ఇప్పించగా కుమారుడు ఉద్యోగం చేస్తూ ప్రసుతంతం కొత్తగూడెంలోని రుద్రంపూర్‌లో ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. ఇమ్మానియల్‌ వృద్ధుడు కావడంతో తన పనులు తాను చేసుకోవడం ఇబ్బందిగా ఉంది. దీంతో కుమారుడు, కుమార్తెలు ఇంట్లో ఉంచుకోకుండా బయటకు వెళ్లగొట్టారు. దీంతో కేసముద్రంలోని బంధువుల ఇంటికి వెళ్లగా శుక్రవారం ద్విచక్రవాహనంపై తీసుకువచ్చి డోర్నకల్‌లో వదిలిపెట్టారు. దీనస్థితిలో రోడ్డుపక్కన ఉన్న వృద్ధుడిని ఆశ కార్యకర్తలు వి.నిర్మల, సువర్ణ గమనించి పోలీసులకు సమాచారం అందించి స్థానిక బాలుర ప్రభుత్వ హాస్టల్‌కు తరలించారు.

సీడీపీఓ ఎల్లమ్మ, అంగన్‌వాడీ కార్యకర్త వాణి, కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాలిటీ ఇన్‌చార్జ్‌ ఎల్లావుల హరికృష్ణ హాస్టల్‌లో ఇమ్మానియల్‌తో మాట్లాడారు. ఇమ్మానియల్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడగా వారు ఇమ్మానియల్‌ను తీసుకెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో సీడీపీఓ సూచన మేరకు కాంగ్రెస్‌ నాయకులు హరికృష్ణ ఆటోలో సికింద్రాబాద్‌తండాకు తీసుకెళ్లి అక్కడి ఆదరణ అనాథాశ్రమంలో చేర్పించారు. 

చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి..

మరిన్ని వార్తలు