కాళ్లు పట్టుకుంటా..మా నాన్నను బతికించండి 

14 May, 2021 04:28 IST|Sakshi

నాన్న చనిపోయేలా ఉన్నారు ప్లీజ్‌ సార్‌ 

ఐసీయూలో ఒక బెడ్‌ ఉంది.. దయచేసి నాన్నను తీసుకెళ్లండి 

గంటన్నర పాటు సూపరింటెండెంట్, సిబ్బందిని వేడుకున్న యువతి 

బెడ్‌ ఖాళీ లేదని చేతులెత్తేసిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

తుది శ్వాస విడిచిన యువతి తండ్రి 

ప్రైవేటు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య తల్లి 

హిమాయత్‌నగర్‌: ‘సార్‌.. మా నాన్న చనిపోయేలా ఉన్నాడు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయి. వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్‌ చేయాలని సిస్టర్‌ చెప్పారు. నేను ఐసీయూలోకి వెళ్లి చూసొచ్చాను ఒక బెడ్‌ ఖాళీగా ఉంది సార్‌. ఇంతకుముందే ఒకరు చనిపోయారంట. దయచేసి మా నాన్నను ఆ బెడ్‌ మీదకు తీసుకెళ్లండి సార్‌.. ప్లీజ్‌ సార్‌ గాలి ఆడట్లేదని నాన్న అంటున్నాడు.. నాకు ఏడుపు ఆగట్లేదు. సార్‌.. సార్‌.. ప్లీజ్‌ సార్‌ మీరు ఒక్కసారి వచ్చి నాన్నను చూడండి సార్‌. ఐసీయూకు తీసుకెళ్తేనే మా నాన్న బతుకుతాడు సార్‌.. లేదంటే చచ్చిపోతాడు సార్‌’అంటూ గంటన్నర పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్, నర్సుల కాళ్లావేళ్లా పడింది 18 ఏళ్ల సంజన అనే యువతి.

ఆ అమ్మాయి వేదనను చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. అందరూ ఆ యువతికి సాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం బెడ్‌ లేదని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఈ హృదయ విదారక ఘటన కింగ్‌కోఠి ఆస్పత్రిలో గురువారం జరిగింది. తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ గుండెలో బాధ తన్నుకొస్తున్నా.. కంటి నుంచి అశ్రువులు ధారలా ప్రవహిస్తున్నా.. ‘మీ కాళ్లు పట్టుకుంటా సార్‌.. నాన్నను బతికించండి’అంటూ ఆస్పత్రిలో ప్రతి ఒక్కరిని బతిమిలాడింది. 


ఖాళీ ఉన్నా ఇవ్వలేదు.. 
సైదాబాద్‌కు చెందిన జగదీశ్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో కింగ్‌కోఠి ఆస్పత్రిలో చేర్పించారు తన కుమార్తె సంజన, కుమారుడు హనుమ. జగదీశ్‌ భార్యకు కూడా కరోనా సోకడంతో ఇంటి వద్దే చికిత్స తీసుకుంటోంది. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జగదీశ్‌కు ఆక్సిజన్‌ పల్స్‌ 80 నుంచి 70కి పడిపోయింది. దీంతో డ్యూటీలో ఉన్న నర్సు వచ్చి అర్జెంటుగా జగదీశ్‌ను ఐసీయూకు మార్చాలని సూచించింది. అయితే ఐసీయూలో బెడ్‌ ఖాళీ లేదేమోనని సంజనకు చెప్పింది. వెంటనే సంజన ఐసీయూ వార్డుల వద్దకు వెళ్లింది. ఓ ఐసీయూ వార్డులో అంతకుముందే ఓ వ్యక్తి చనిపోవడంతో ఒక బెడ్‌ ఖాళీ అయిందని అక్కడున్న సిబ్బంది సంజనకు చెప్పారు. ఆ వెంటనే వచ్చి సిబ్బందికి చెబితే ఎవరూ పట్టించుకోలేదు.  

కాళ్లా వేళ్లా పడ్డా ఫలితం లేదు.. 
ఆస్పత్రిలో తెల్లకోటు వేసుకుని కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి తన తండ్రిని బతికించాలని గంటన్నర పాటు ప్రాధేయపడింది సంజన. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కాళ్లు పట్టుకుంటా సార్‌ అంటూ విన్నవించుకుంది. అక్కడున్న మీడియా ప్రతినిధుల దగ్గరకు వెళ్లి.. ‘అన్నా.. సాయం చేయండి, మా నాన్న చనిపోయేలా ఉన్నాడు. మీరు చెబితే బెడ్‌ ఇస్తారు’అంటూ చేతులు పట్టుకుని వేడుకుంది. ఆ అమ్మాయి ఆవేదన, ఆక్రందనకు అక్కడున్న ప్రతి ఒక్కరు కంట నీరుపెట్టారు. చివరకు బెడ్‌ దొరకలేదన్న ఆవేదనతో గంటన్నర తర్వాత తిరిగి తండ్రి వద్దకు వెళ్లగా.. సంజనను చివరిసారిగా చూసి తండ్రి తనువు చాలించాడు. అంతే ఆస్పత్రి ప్రాంగణం సంజన రోదనతో దద్దరిల్లింది. ‘ఏ ఒక్కరూ నాకు సాయం చేయలేకపోయారు. మీరందరూ ఉన్నా లేకున్నా ఒక్కటే’అంటూ రోదించింది. 

చావు బతుకుల మధ్య తల్లి.. 
తండ్రిని కోల్పోయిన అర గంటకే తల్లికి సీరియస్‌ అని సంజనకు ఫోన్‌ వచ్చింది. దీంతో వెంటనే తండ్రి భౌతికకాయాన్ని ఆస్పత్రిలోనే ఉంచి తల్లి వద్దకు పరిగెత్తింది అమ్మాయి. ఇంట్లో ఉన్న తల్లిని కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించింది. ఇప్పుడు తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సంజన తెలిపింది. ‘మా నాన్నను బతికించుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఏ ఒక్కరూ సాయం చేయలేదు. కనీసం అమ్మను అయినా బతికించుకుందామనే ఆశతో ప్రైవేటు ఆస్పత్రికి వచ్చా’అంటూ బోరున విలపించింది. 

వేరే వ్యక్తి అంతకన్నా సీరియస్‌గా ఉన్నాడు 
జగదీశ్‌ను ఐసీయూకు మారుద్దామని అనుకున్నాం. ఈలోపు వేరే రోగి జగదీశ్‌ కన్నా సీరియస్‌గా ఉన్నాడు. అందుకే జగదీశ్‌ను ఐసీయూలోకి మార్చలేకపోయాం. అందరినీ కాపాడాలనే తపన ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. వేరే రోగికి సీరియస్‌ కాకపోతే జగదీశ్‌ను ఐసీయూలోకి కచ్చితంగా మార్చేవాళ్లం.  
 – డాక్టర్‌ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్, కింగ్‌ కోఠి ఆస్పత్రి 

మరిన్ని వార్తలు