భార్య మృతి, టెంట్‌ నీడలో నలుగురు ఆడపిల్లతో తండ్రి

17 Mar, 2021 17:30 IST|Sakshi
బిడ్డలతో తండ్రి గంగారాం

తల్లి మృతితో పిల్లల విలవిల

టెంట్‌ నీడలో తండ్రి, నలుగురు చిన్నారులు

సాయంకోసం ఎదురుచూపులు 

సాక్షి, కోరుట్ల: ఎంత మంది వెన్నంటి ఉన్నా.. అమ్మకు సాటి రారు. అమ్మలేని లోటు తీర్చలేనిది. పదేళ్లు దాటని నలుగురు ఆడపిల్లలు అమ్మను కోల్పోతే ఆ పరిస్థితి మరింత దయనీయం. నాన్న ఉన్నా..అమ్మ లేని లోటు పూడ్చలేని దుస్థితి. అద్దె ఇంట్లో కర్మలు చేయడానికి ఒప్పుకోని పరిస్థితిలో విధి లేక నాన్న, నలుగురు చిన్నారులు మండు టెండలో టెంట్‌ నీడలో వారం రోజులుగా కాలం గడుపుతున్నారు. అమ్మ కోసం ఏడుస్తూ విలవిల్లాడుతున్న నలుగురు ఆడపిల్లలకు సర్దిచెప్పలేక ఆ తండ్రి పడుతున్న వేదన పలువురిని కలిచివేస్తోంది. 

పేద కుటుంబం..
కోరుట్ల పట్టణంలోని పటేల్‌రోడ్డుకు చెందిన గొల్లపల్లి గంగారాం(48)–మమత(45) దంపతులు రజక వృత్తి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వైష్ణవి(10), అనిత(7), అమూల్య(5), దుర్గ(3) సంతానం. నలుగురు ఆడపిల్లలతో మమత కులవృత్తి చేస్తూ, గంగారాం ఓషాపులో ఇస్త్రీ పనికి వెళుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వైష్ణవి,అనితలు 5, 3వ తరగతులు చదువుతుండగా మిగతా ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో మార్చి 1వ తేదీన మమత తీవ్ర అనారోగ్యం పాలు కాగా..ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ తరువాత మార్చి 7వ తేదీన మమత మృతిచెందింది. దీంతో పదేళ్లలోపు నలుగురు ఆడపిల్లలు అమ్మ లేక విలవిల్లాడుతూ, నాన్న ఓదార్పుతో సేదదీరడం లేదు.

టెంట్‌ నీడలో..
మమత మృతిచెందడంతో అంత్యక్రియల అనంతరం కార్యక్రమాల నిర్వహణకు ఇంటిని అద్దెకు ఇచ్చిన వారు ఒప్పుకోకపోవడంతో గంగారాం తన పిల్లలతోపాటు దగ్గరలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో స్థానికులు ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో టెంట్‌ వేసుకుని ఉంటున్నారు. వారం రోజులుగా అదేటెంట్‌లో ఎండకు, చలికి ఇబ్బందులు పడుతూ నలుగురు పిల్లలతో కాలం వెల్లదీస్తున్నాడు. పనికోసం గంగారాం బయటకు వెళ్లాల్సి రావడంతో నలుగురు చిన్నారులను పట్టించుకునే వారు కరువయ్యారు. చిన్నారులు అమ్మ ఏదని అడిగితే..ఏమి చెప్పలేక కలత చెందుతున్నాడు. ప్రభుత్వపరంగా ఆడపిల్లలను ఆదుకోవాలని దాతలు తమకు వీలైనంత సాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. 

మరిన్ని వార్తలు