Father's Day: తల్లి దూరమైన పిల్లలు.. అమ్మ కూడా... నాన్నే!

19 Jun, 2022 07:56 IST|Sakshi

భార్య దూరమైనా పిల్లలే లోకంగా జీవనం

‘మరో’ ఆలోచన చేయని తండ్రులెందరో...

నేడు ‘ఫాదర్స్‌ డే

జీవితంతో విడదీయలేని బంధం నాన్న. కుటుంబ పెద్దగా ఎన్నో బాధ్యతలు మోస్తాడు.  పిల్లల ఉన్నతికి పరితపిస్తూ ఎంత కష్టమైనా సంతోషంగా చేస్తాడు. అయితే, ఈ బాధ్యతల్లో తల్లి పాత్ర కూడా మరువలేనిది. కానీ తల్లి దూరమైన పిల్లల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. కొందరు పిల్లల పోషణ బాధ్యతల కోసం మరో వివాహం చేసుకుంటున్నా...మరికొందరు మాత్రం ‘మరో’ ఆలోచన లేకుండా పిల్లలే సర్వస్వంగా జీవనం సాగిస్తున్నారు. పిల్లల పెంపకం, పోషణపై దృష్టి సారిస్తూనే బతుకు బాధ్యతలు మోస్తున్న కొందరు  ‘నాన్న’ల కథనాలు నేడు ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా...  


నిరూప్‌కు టిఫిన్‌ తినిపిస్తున్న శ్రీనివాస్‌

 అన్నీ తానే
వేంసూరు : వేంసూరు మండలం మర్లపాడుకు చెందిన అర్చేపల్లి శ్రీనివాస్‌ ఆర్‌ఎంపీ గా, భార్య సుజాత హెచ్‌ఎంగా పనిచేస్తూ ఆనందంగా జీవించేవారు. 2021 ఏప్రిల్‌ 28 సుజాత కరోనాతో మృతి చెందడంతో కొడుకు నిరూప్‌కు శ్రీనివాస్‌ అమ్మానాన్న తనే అయ్యాడు. ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్‌ చేస్తూనే కొడుకును అమ్మలా లాలిస్తూ.. నాన్నలా ప్రేమిస్తున్న ఆయన ‘తల్లి లేని లోటు తీర్చలేకున్నా ఆ బాధ తెలియకుండా అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నాను’ అని తెలిపారు.


హేమకు జడ వేస్తున్న తండ్రి సురేష్‌

హోటల్‌ పని.. పిల్లల ఆలనాపాలన
బోనకల్‌ : వైరాకు చెందిన సురేష్‌ – మరి యమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జెస్సీ, హేమ ఉన్నారు. హోటళ్లలో వంటలు చేస్తూ సురేష్‌ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, మూడేళ్ల క్రితం డెంగీ జ్వరంతో మరియమ్మ మృతి చెందింది. అప్పటికి పిల్లలు చిన్న వారే కావడంతో వారి ఆలనాపాలన అన్నీ సురేష్‌ చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన బోనకల్‌లోని హోటల్‌ పనిచేస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో వారిని బడికి తయారుచేసి పంపడం కష్టంగా ఉన్నా.. ఇష్టంగా, ప్రేమతో చేస్తున్నారు.. జెస్సీ 8వ తరగతి, హేమ 5వ తరగతి చదువుతుండగా, పెద్ద కుమార్తెను వైరా గురుకుల పాఠశాలలో చేర్పించాడు.

చిన్న కుమార్తె హేమను మాత్రం తన వద్దే ఉంచుకుని చదివిస్తున్నాడు. తల్లి లేని వాళ్లం అనే ఆలోచన పిల్లల మనస్సులోకి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నానని సురేష్‌ చెబుతున్నాడు. ఉదయం లేవగానే కుమార్తెకు జడ వేయడం మొదలు వంట చేసి తినిపించి స్కూల్‌కు పంపించాక తాను హోటల్‌లో పనికి వెళ్తున్నట్లు తెలిపారు. ఎంత కష్టమైనా సరే పిల్లలను ఉన్నత చదువులను చదివించడమే తన లక్ష్యమని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు 


సత్యసాయిబాబుతో కుమార్తెలు సుప్రియ, శ్రీలక్ష్మి

నాన్నే ధైర్యం..
సత్తుపల్లి టౌన్‌ : సత్తుపల్లికి చెందిన నండూరి సత్యసాయిబాబు – లలిత దంపతులకు కుమార్తెలు సుప్రియ, శ్రీలక్ష్మి ఉన్నారు. లలిత గతేడాది కరోనాతో మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి తండ్రే తమకు అమ్మ ప్రేమ కూడా పంచుతూ.. స్నేహితుడిలా, గైడ్‌లా ప్రోత్సాహం అందిస్తూ ధైర్యాన్ని నింపుతున్నాడని సుప్రియ, లక్ష్మి చెబుతున్నారు. ఇంట్లో పిండివంటలు చేసి షాపుల్లో విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించే సత్యసాయిబాబు... పిల్లలను కష్టపడి చదివించారు. ప్రస్తుతం సుప్రియ హైదరాబాద్‌లో అకౌంట్‌ స్పెషలిస్ట్‌గా, శ్రీలక్ష్మి సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. 


ఇద్దరు కుమారులతో ముస్తఫా 

అమ్మలేని బాధ తెలియకుండా..
ఖమ్మం గాంధీచౌక్‌ : కన్న కొడుకులకు అమ్మ లేని లోటు తీరుస్తున్నారు మహ్మద్‌ ముస్తఫా. ఖమ్మం త్రీటౌన్‌ శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ముస్తఫా – జువేదా దంపతులకు ఇద్దరు కుమారులు రోషన్, రిఫా ఉన్నారు. జువేదా కేన్సర్‌ కారణంగా గత ఏడాది మరణించారు. అప్పటి నుంచి కొడుకుల ఆలనాపాలనా పూర్తిగా ముస్తఫా చూస్తున్నారు. రోషన్‌ పదో తరగతి, రిఫా తొమ్మిది తరగతి చదువుతుండగా, ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ముస్తఫా తన ఉద్యోగ బాధ్యతలను చూసుకుంటూనే కొడుకులకు అవసరమైన ఏర్పాట్లు చేసి పాఠశాలకు పంపిస్తారు. వారిని ప్రయోజకులకు తీర్చిదిద్దమే తన లక్ష్యమని ముస్తఫా అంటున్నారు.


పిల్లలతో వెంకటేశ్వర్లు 

ఆ లోటు లేకుండా...
ఖమ్మం గాంధీచౌక్‌ : ముదిగొండ మండలం ధనియాలగూడెంకు చెందిన చెరుకుపల్లి వెంకటేశ్వర్లు – నిర్మల దంపతులకు ఆరేళ్లు, ఐదేళ్ల కుమార్తెలు సాహితి, లహరితో పాటు ఏడాదిన్నర కుమారుడు హర్ష ఉన్నారు. ఇంటి వద్దేచిన్న కిరాణం నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. ఏడాది కిత్రం కరోనాతో నిర్మల కన్నుమూసింది. అప్పటి నుంచి తన తల్లి సహకారంతో పిల్లల పోషణ బాధ్యతలు వెంకటేశ్వర్లు చూస్తుండగా ఆయన తల్లి కూడా పక్షవాతంతో మంచాన పడింది. అప్పటి నుంచి అన్నీ సిద్ధం చేసి చిన్నారులను స్కూల్‌కు పంపించాక తన కిరాణం నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు పిల్లలే ప్రాణంగా జీవిస్తున్నాడు. పిల్లలకు వంట చేయడం మొదలు అన్ని పనులు చేస్తూ ఆయనను గ్రామస్తుల మన్ననలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును పలకరించగా ‘నా పిల్లలే నాకు ప్రాణం.. కొందరు వారికి దద్తత ఇవ్వాలని అడిగినా అందుకు నేను అంగీకరించలేదు. మరో ఆలోచన కూడా లేదు.’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు