ఫ్యాటీ లివర్‌.. పారా హుషార్‌...

15 Apr, 2021 12:30 IST|Sakshi

కరోనాతో మారిన పరిస్థితులు, జీవనశైలుల కారణంగా శారీరక శ్రమ  ఆహారపు అలవాట్లలో తీవ్రమైన మార్పుల వల్ల కొన్ని  అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. వాటిలో ఒకటి ఫ్యాటీ లివర్‌. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఫ్యాటీ లివర్‌ సమస్య బాగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చెందిన వైద్యులు సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ డా. జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న విశేషాలు, సూచనల సమాహారం...

కీలకం...కాలేయం..
మానవ శరీరంలోని అతిపెద్ద అంతర్గత అవయవం కాలేయం. ఈ ఒక్క అవయవం మన ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపిస్తుంది.  కుడివైపు దిగువన పక్కటెముకల కిందుగా ఉండే ఈ అవయవం...అనేక ప్రధాన విధులు నిర్వర్తిస్తుంది. శరీరంలో తయారయే హానికారక రసాయనాలను తొలగించడంతో పాటు బైల్‌ అనే లిక్విడ్‌ను అది తయారు చేస్తుంది. అలాగే ఆహారంలోని కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది. అవసరమైనప్పుడు వెంటనే శక్తిని అందించేందుకు వీలుగా గ్లూకోజ్‌ నిల్వలను ఉంచుతుంది. ఇన్ని కీలక విధులు నిర్వర్తిస్తున్నా వైద్య పరమైన జాగ్రత్తల విషయంలో దీన్ని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటాం. అలాంటి నిర్లక్ష్యాల వల్ల వచ్చే సమస్యల్లో ఫ్యాటీ లివర్‌ ఒకటి. 

ఆల్కహాలిక్‌/నాన్‌ ఆల్కహాలిక్‌లకూ...
హాని కలిగించే స్థాయిలో ఆల్కహాల్‌ సేవించేవారిలో ఎక్కువగా ఫ్యాటీ లివర్‌ సమస్య కనిపిస్తుంది.  అయితే ఫ్యాటీ లివర్‌ సమస్య నాన్‌ ఆల్కహాలిక్‌ లకూ వస్తుంది.  ఎవరికైతే బాడీ ఇండెక్స్‌ మాస్‌ ఎక్కువగా ఉంటుందో అలాగే సరైన శారీరక శ్రమ లేని వారిలో కూడా ఇది కనిపిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే తగిన విధమైన చికిత్స అందించకపోతే అది ఫైబ్రోసిస్‌కి దారి తీస్తుంది. తద్వారా ఇది కాలేయాన్ని మచ్చలు పడేలా చేస్తుంది. మరింత ముదిరితే ఇది సిర్రోసిస్‌ అనే పరిస్థితికి  దారి తీసి ఆరోగ్యాన్ని కోలుకోలేని విధంగా దిగజారుస్తుంది.  ఈ సమస్య ఉన్నవారిలో చాలా మంది అది ఉన్నట్టుగా తెలియదు. లక్షణాలు ఉన్నప్పటికీ... దాన్ని గుర్తించలేం. అయితే అన్నీ కనిపించాలని కూడా లేదు. క్రమబద్ధమైన రక్త పరీక్షల ద్వారా దాన్ని ముందస్తుగానే గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. 

లక్షణాలు...

  • స్వల్పంగా నొప్పి లేదా  కుడివైపు పొట్ట ప్రాంతంలో నిండుగా ఉన్నట్టు అనిపించడం.
  • ఎఎస్‌టి, ఎఎల్‌టి వంటి లివర్‌ ఎంజైమ్స్‌ స్థాయిల్లో పెరుగుదల
  • ఇన్సులిన్‌ స్థాయిలు బాగా పెరగడం
  • ట్రైగ్లిజరైడ్స్‌ స్థాయిల పెరుగుదల

నాన్‌ ఆల్కహాలిక్‌లో ఫ్యాటీ లివర్‌ పెరిగితే.. స్టీటోహెపటైటిస్‌ అనే పరిస్థితికి దారి తీస్తుంది. ఇది ఫ్యాటీ లివర్‌ తర్వాత దశ. అధికంగా కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయ మంట వస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి. 

  • ఆకలి మందగించడం
  • వాంతి లేదా వికారంగా ఉండడం
  • పొట్టలో భరించలేని నొప్పి
  • చర్మం, కళ్లు పచ్చ బడడం 
  • కడుపులో ఇబ్బంది (ద్రవాలు పేరుకుపోవడం వల్ల)

ఆరోగ్యకరమైన రీతిలో శరీరపు బరువు మెయిన్‌టెయిన్‌ చేసే వారిలో కూడా నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కూడా ఫ్యాటీ లీవర్‌కు కారణమవుతుంది. అలాగే ఆరోగ్యకరమైన రీతిలో బాడీ మాస్‌ ఇండెక్స్‌ మెయిన్‌టెయిన్‌ చేసేవారిలో కూడా మొత్తంగా ఆరోగ్యాన్ని మెయిన్‌టెయిన్‌ చేయడం ముఖ్యం. శరీరపు బరువు తగ్గితే లివర్‌ ఫ్యాట్‌ కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆహారపు క్రమశిక్షణ ద్వారా  వ్యాయామం ద్వారా దీన్ని సాధించవచ్చు. 

ఫ్యాటీ లివర్‌ రాకుండా...

  • ప్రతి రోజూ ఏదో ఒక రకమైన వ్యాయామం చేయడం అనేది లివర్‌ ఫ్యాట్‌ని నివారించేందుకు ఉత్తమ మార్గం. వ్యాయామం, రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌ లు లివర్‌ సెల్స్‌లో పేరుకున్న కొవ్వుల్ని తగ్గించగలవు. రోజులో కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక రకమైన శారీరక శ్రమ చేసినట్లయితే లివర్‌లోని కొవ్వు నిల్వలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. 
  • అలాగే రిఫైన్డ్‌ కార్బొహైడ్రేట్స్‌ అతిగా తీసుకోవడం ప్రస్తుతం యువతో బాగా పెరిగింది. ఈ రిఫైన్డ్‌ కార్బొహైడ్రేట్స్‌ లివర్‌లో ఫ్యాట్‌ని పెంచుతాయి. అధిక బరువున్న వారు, ఇన్సులిన్‌ నిరోధకత ఉన్నవారు ఇవి తీసుకుంటే అది మరింతగా లివర్‌ని డ్యామేజ్‌ చేస్తుంది. వీటిని  తగ్గిస్తే ఆ మేరకు ఫ్యాటీ లివర్‌ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. 
  • తీయని ద్రవపదార్ధాలు కూడా కాలేయంపై ప్రభావం చూపుతాయి. సోడా తదితర  గ్యాస్‌ నింపిన పానీయాలు పెద్ద పరిమాణంలో ఫ్రక్టోజ్‌ను కలిగి ఉంటాయి. ఫ్రక్టోజ్‌ను ఎక్కువగా తీసుకుంటే అది కాలేయం చుట్టూ కొవ్వు పేరుకునేలా చేస్తుంది. ఈ పరిస్థితి పెద్దలతో పాటు చిన్నారుల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. 

 ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండడం అనేది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా శరీరంలోని ప్రతి అవయవం పనితీరును గమనిస్తూ దాని ఆరోగ్యంగా ఉంచేందుకు వీలుగా ప్రతి వ్యక్తి మంచి ఆహారం/నిద్ర అలవాట్లతో తమ దినచర్యను దీర్చిదిద్దుకోవడం అవసరం. 
డా.జగన్‌మోహన్‌రెడ్డి, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి, కొండాపూర్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు