ఉప్పుడు బియ్యం బంద్‌

15 Apr, 2022 01:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా యాసంగిలో పండిన ధాన్యాన్ని ముడిబియ్యంగానే (రా రైస్‌) ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా యాసంగిలో పండిన ధాన్యాన్ని లెవీ కింద ఉప్పుడు బియ్యంగా (పారాబాయిల్డ్‌ రైస్‌) ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నప్పటికీ, ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో దానికి ఫుల్‌స్టాప్‌ పడనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, ఎన్ని లేఖలు రాసినా, ఆందోళనలు చేసినా ఉప్పుడు బియ్యాన్ని సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పడే భారాన్ని భరించి యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ స్థానంలో ముడిబియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీంతో మిల్లర్లు ఉప్పుడు బియ్యానికి స్వస్తి చెప్పి, కేవలం ముడిబియ్యం మిల్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2,470 ముడి బియ్యం మిల్లులు ఉండగా, 970 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉన్నాయి. అయితే బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల్లో ముడిబియ్యం మిల్లింగ్‌ చేసే అవకాశం కూడా ఉంది.

వానాకాలంలో అలా.. 
ఇప్పటివరకు ఉన్న పద్ధతి ప్రకారం.. వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో వచ్చే ధాన్యాన్ని రైతులు తమ ఆహార అవసరాలకు మినహాయించుకోగా మిగతా దానిని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్‌కు పంపించి ముడిబియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది.  

యాసంగిలో ఇప్పటివరకు.. 
యాసంగి (రబీ)లో వచ్చే ధాన్యంలో కూడా తన అవసరాలకు పోను 80 నుంచి 90 శాతం ధాన్యాన్ని రైతు కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తాడు. ఆ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైస్‌ మిల్లులకు పంపించి, ఉప్పుడు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది.  

ముడిబియ్యంగా మారిస్తే అదనంగా 17 కిలోల నూకలు 
ప్రస్తుతం యాసంగి పంట కోతలకు వస్తుండటం, కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకోబోమనడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎఫ్‌సీఐకి ముడి బియ్యాన్నే పంపించాలని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. యాసంగి ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్‌ చేసి ముడిబియ్యంగా మారిస్తే క్వింటాలుకు అదనంగా 17 కిలోల వరకు నూకలు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెద్దమొత్తంలో నూక ఉన్న బియ్యాన్ని కేంద్రం తీసుకోదు. కాబట్టి ఆ మేరకు బియ్యాన్ని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుంది. ఈ భారాన్ని ఎలా భరించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించనుంది.  

ఇప్పటివరకు ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారమే.. 
ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం.. క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే ఏ సీజన్‌లో అయినా 67 కిలోల బియ్యం రావాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి ఇచ్చే 67 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యంగా పరిగణనలోకి తీసుకొని కనీస మద్దతు ధర కింద రూ.1,960 రాష్ట్రానికి చెల్లిస్తుంది. అయితే ఈ 67 కిలోల బియ్యంలో 17 కిలోల (25 శాతం) వరకు నూకలు ఉన్నా ఎఫ్‌సీఐ అంగీకరించి, క్వింటాలు ధాన్యంగానే లెక్క కట్టి డబ్బులు చెల్లిస్తుంది. ఇప్పటివరకు ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన నేపథ్యంలో ఎఫ్‌సీఐ నిబంధనల మేరకే అంతా సాగింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2 వేల కోట్ల భారం! 
ప్రస్తుతం ఉప్పుడు బియ్యం బదులు ముడిబియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి రావడంతో ఈ లెక్కలు మారబోతున్నాయి. యాసంగిలో తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బియ్యం మొదళ్లు విరిగి నూకల శాతం రెట్టింపు అవుతుంది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటే, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాల్లో కొంత తక్కువగా ఉంటుంది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మార్చడం వల్ల క్వింటాలు ధాన్యంపై సగటున మరో 17 కిలోల వరకు నూకలు పెరుగుతాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని ప్రయోగాత్మకంగా మిల్లింగ్‌ చేసి, ఎంత మేరకు నూకలు వస్తాయో చూసి, ఎంత భారం పడుతుందో అంచనా వేయడంతో పాటు తక్కువ భారంతో గట్టెక్కేందుకు ఏం చేయాలో సీఎస్‌ కమిటీ నివేదించనుంది.  

ఎఫ్‌సీఐకి రెండు మార్గాల్లో.. 
క్వింటాల్‌ ధాన్యానికి 67 కిలోల ముడిబియ్యం ఇచ్చేలా రైస్‌మిల్లర్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని, అదనంగా సగటున 17 కిలోల వరకు వచ్చే నూకలకు సంబంధించిన మొత్తాన్ని మిల్లర్లకే ఇవ్వాలనేది ఒక ఆప్షన్‌. అప్పుడు నూకలతో సంబంధం లేకుండా మిల్లర్లు 67 కిలోల బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగిస్తారు. ఇక రెండో ప్రత్యామ్నాయంలో క్వింటాల్‌ ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే, 67 కిలోలకు బదులు ఎన్ని కిలోల బియ్యం, నూకలు కలిపి ప్రభుత్వానికి ఇస్తారనే దానిపై ఒప్పందం కుదుర్చుకోవలసి ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగిస్తుంది. ఈ అంశంపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్పాయి.  

43 ఎల్‌ఎంటీ బియ్యం అప్పగించాలి
రాష్ట్రంలో ఈ యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో తిండిగింజలు, విత్తన ధాన్యం, ప్రైవేటుగా విక్రయించే ధాన్యం పోను 65 లక్షల మెట్రిక్‌ టన్నుల(ఎల్‌ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుంది. దీన్ని మిల్లింగ్‌ చేస్తే వచ్చే 43 ఎల్‌ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ కింద అప్పగించాల్సి ఉంటుంది.  

ఉప్పుడు బియ్యం అంటే...
యాసంగి సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసేటప్పుడు బియ్యం చివరన విరిగిపోతుంది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు దశాబ్దాల క్రితమే ఉప్పుడు బియ్యం విధానం అమలులోకి వచ్చింది. ధాన్యాన్ని నానబెట్టి, నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉడకబెట్టి, ఆరబోసి ఆ తర్వాత మిల్లింగ్‌ చేస్తే వచ్చేది ఉప్పుడు బియ్యం. ఇందుకోసం ప్రత్యేకంగా యంత్రాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 

ముడి బియ్యం అంటే... 
పండిన పంటను సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్‌ చేస్తే వచ్చే బియ్యమే ముడి బియ్యం. వానాకాలంలో పండే ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లోనే మిల్లింగ్‌ చేస్తారు. యాసంగి ధాన్యాన్ని సాధారణ పద్ధతుల్లో మిల్లింగ్‌ చేస్తే (ముడి బియ్యంగా మారిస్తే) నూకల శాతం ఎక్కువగా వస్తుంది. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యంగా మార్చి ఇస్తోంది. అయితే ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ లేకపోవడంతో ముడి బియ్యం మాత్రమే సేకరిస్తామని కేంద్రం చెబుతోంది.

ఇదీ కొనుగోలు విధానం.. 
రైతు పంట కోసి తేమ 17 శాతానికి తగ్గేవరకు ఎండబెట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తాడు. అక్కడ రైతు పట్టా పాసు పుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణం ఆధారంగా ఎకరాకు 28 క్వింటాళ్ల లోపు దిగుబడి కింద లెక్కలేసి కొనుగోలు చేస్తారు. రైతు విక్రయించిన ధాన్యం డబ్బులు వారం రోజుల్లో బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఇక కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని అధికారులు మిల్లులకు తరలిస్తారు. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి క్వింటాల్‌కి 67 కిలోల బియ్యం (సీఎంఆర్‌) చొప్పున ఎఫ్‌సీఐ గోడౌన్లకు తరలిస్తారు. ఇందులో ప్రజాపంపిణీ వ్యవస్థకు అవసరమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టిపెట్టుకొని, మిగతా బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది.
   

మరిన్ని వార్తలు