చింత లేని చివరి మజిలీ!

28 Jul, 2020 08:38 IST|Sakshi
లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని ప్రారంభిస్తున్న సీపీ అంజనీకుమార్‌

పేదలకు ఉచితంగా‘లాస్ట్‌ రైడ్‌’ వాహనం 

మృతదేహాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాటు 

‘ఫీడ్‌ ద నీడీ’ సహకారం

కోవిడ్‌ మృతదేహాలు సైతం శ్మశాన వాటికలకు.. 

వాహనాన్ని ప్రారంభించిన సిటీ కొత్వాల్‌

సాక్షి, సిటీబ్యూరో: మన మహానగరంలోబతకడమంటేనే ఖరీదుతో కూడుకున్న పని. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సిటీలో చావుతో పాటు మృతదేహాన్ని తరలించడం కూడాభరించలేనంత ఖరీదుగా మారింది. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన ఫీడ్‌ ద నీడీసంస్థ పేదల మృతదేహాలను ఉచితంగా శ్మశాన వాటికలకు తరలించడానికి ముందుకువచ్చింది. ఈ సేవల్ని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం ప్రారంభించారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో అదనపు సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్, డీసీపీ (ట్రాఫిక్‌) ఎల్‌ఎస్‌ చౌహాన్‌లతో కలిసి కొత్వాల్‌ ఈ ‘లాస్ట్‌ రైడ్‌’ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటలో ఉంటాయి. వీటిని వినియోగించుకోవాలనుకునే వారు 79954 04040, 84998 43545 నంబర్లలో సంప్రదించాలి.

సాధారణ మరణం, ఆస్పత్రిలో చనిపోయిన రోగుల మృతదేహాలతో పాటు కోవిడ్‌ మృతులను తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి వాహనంలోనూ డ్రైవర్‌తో పాటు సహాయకుడు ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారికి పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వీప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లు అందించారు. ప్రతి మృతదేహం తరలింపు తర్వాత వాహనాన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా శానిటైజ్‌ చేయనున్నారు. ఎవరైనా తమ వారి అంతిమ సంస్కారాలకు డబ్బు వెచ్చించే పరిస్థితుల్లో లేకపోతే ఆ బాధ్యతల్నీ ఫీడ్‌ ద నీడీ తీసుకోనుంది. ఈ సంస్థకు మృతదేహాల తరలింపు వాహనాన్ని సిలికాన్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ సంస్థ అధినేత శ్యామ్‌ సమకూర్చారు. నగరానికి చెందిన పది మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఓ బృందంగా ఏర్పడి ఫీడ్‌ ద నీడీ సంస్థను నిర్వహిస్తున్నారు.  

మరికొన్ని సంస్థలు ముందుకు రావాలి.. 
నగరంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వాహనాలు, సేవలు మరిన్ని అవసరం అవుతాయి. ఇందుకోసం ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలకు సహకరించడానికి పోలీసు విభాగం సిద్ధంగా ఉంది. సేవలు అందించే ఆసక్తి ఉన్న సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ను సంప్రదించాలి. వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.– అంజనీకుమార్, సిటీ కొత్వాల్‌ 

: వివరాలకు :79954 04040 ,84998 43545 

మరిన్ని వార్తలు