సీఐతో మహిళా ఎస్‌ఐ ప్రేమ వ్యవహారం.. సీపీ సంచలన నిర్ణయం

4 Jan, 2023 09:57 IST|Sakshi

వరంగల్‌ క్రైం: మహిళా ఎస్‌ఐ పెళ్లయి నెలరోజులైంది. కానీ, అంతకుముందు ఉన్న పరిచయం కారణంగా ఓ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి ‘హద్దులు’వీురింది. వీరి ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో బట్టబయలైంది. అదేవిధంగా లైంగిక వేధింపులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతిని మరో ఎస్‌ఐ.. పట్టించుకోకుండా రాజీపడాలి్సందిగా ఉచిత సలహా ఇచ్చా డు. వీరి చర్యలను సహించని సీపీ రంగనాథ్‌ మంగళవారం ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. కమిషనరేట్‌ పరిధిలో ఇక ఏమి జరిగినా కఠిన చర్యలు తప్పవన్న సంకేతం ఇచ్చారు. వచ్చిన నెలరోజుల్లోనే దిద్దుబాటు చర్యలకు దిగడంతో నిబంధనలు అతిక్రమించే పోలీసుల్లో భయం పట్టుకుంది.

క్రమశిక్షణకు మారుపేరు పోలీస్‌ శాఖ. కానీ కొంతమంది అధికారులు హద్దు మీరి ప్రవర్తించడం ఆ శాఖకు తలవంపులు తెచ్చిపెడుతోంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ రాయల వెంకటేశ్వర్లు, దామెర సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హరిప్రియలు హద్దు మీరి ప్రవర్తించడంతో ఇరువురిని సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్‌ పరిధిలో సంచలనం కలిగించింది. ఎస్‌ఐ హరిప్రియకు ఇటీవల పెళ్లయ్యింది. కానీ.. ఇన్‌స్పెక్టర్‌ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై హరిప్రియ మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఫోన్‌లో వాట్సాప్‌ చాటింగ్‌ గమనించాడు. దీని ఆధారంగా సీపీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో విచారణ చేపట్టిన సీపీ.. వాస్తవమని తేలడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. 

రాజీ కుదుర్చుకోండని ఉచిత సలహా..
సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.పున్నంచందర్‌ ఓ యువతి ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనపై వేటు పడింది. స్టేషన్‌ పరిధిలో ఉండే ఓ యువతి కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్పందించాలి్సన ఎస్సై పున్నంచందర్‌ నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతోపాటు రాజీ పడాలని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన అధికారులు సీపీకి నివేదిక సమర్పించారు. దీంతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నెల రోజుల్లో ఐదుగురిపై వేటు..
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా డిసెంబర్‌ 3న బాధ్యతలు స్వీకరించిన సీపీ రంగనాథ్‌.. నెల రోజుల్లోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురిపై వేటు వేయడం కమిషనరేట్‌లో కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ దొంగతనం విషయంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా దొంగ పరారయ్యాడు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్‌ మోహన్‌ నాయక్‌పై సస్పెన్షన్‌ వేటు పడగా, అడ్మిన్‌ ఎస్సై సంపత్‌ను ఏఆర్‌కు అటాచ్డ్‌ చేశారు. తాజాగా ముగ్గురిని సస్పెండ్‌ చేశారు.

గతంలోనూ ప్రేమాయణాలు..
కమిషనరేట్‌లోని పోలీస్‌ అధికారుల ప్రేమాయణాలు కొత్తేమి కాదు. మహబూబాబాద్‌ జిల్లాలో పనిచేస్తున్న ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు సీబీసీఐడీలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌పై సుబేదారి పోలీసులు అక్రమాస్తులు, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. సీబీ సీఐడీ ఇన్‌స్పెక్టర్, రవి, తన మహిళా సహోద్యోగి అయిన ఇన్‌స్పెక్టర్‌తో కలిసి హనుమకొండలోని రాంనగర్‌లోని ఆమె ఇంట్లో ఉండగా భర్త అయిన మహబూబాబాద్‌ సీఐ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్, మహిళా ఇన్‌స్పెక్టర్‌  వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.

గీసుకొండ మండలంలో సంబరాలు
గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌ రాయల వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్‌ వేటు పడిందన్న సమాచారంతో గీసుకొండ మండలం మణుగొండ, కొమ్మాలగ్రామాల్లో యువకులు బాణసంచా కాల్చి సీపీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  
 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు