మంకీపాక్స్‌పై ఆందోళన వద్దు.. నిర్లక్యం చేయొద్దు!

26 Jul, 2022 02:48 IST|Sakshi

జ్వరం వచ్చి శరీరంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి 

ఇది గాలి ద్వారా వ్యాపించదు 

రోగితో దీర్ఘకాలం ఉండే వాళ్లకు వ్యాపించే అవకాశం 

దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది  

ఇక నుంచి గాంధీలోనే నిర్ధారణ పరీక్షలు 

మంకీపాక్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ కె.శంకర్‌ వెల్లడి

నల్లకుంట (హైదరాబాద్‌): మంకీపాక్స్‌ గురించి ప్ర­జ­లు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్, మంకీపాక్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ కె.శంకర్‌ అన్నారు. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందదని, రోగితో దీర్ఘకాలం దగ్గరగా ఉండే వాళ్లకు ఇది వ్యాపించే అవకాశముందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

దేశంలో మంకీపాక్స్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కామారెడ్డిలో మంకీపాక్స్‌ అనుమానిత కేసు బయటపడడంతో నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల మొదటి వారంలో కువైట్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి కామారెడ్డిలో స్వగ్రామానికి వెళ్లిన వ్యక్తి ఈ నెల 20న జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు.

ఆ వ్యక్తికి ట్రావెల్‌ హిస్టరీ ఉండడంతో అక్కడి వైద్యులు కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. బాధితుడికి మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉండడంతో జిల్లా ఆస్పత్రి వైద్యులు, ఆదివారం హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రికి పంపారు. బాధితుడి చేతులు, కాళ్లు, మెడ, ఛాతీపై దద్దుర్లు కనిపించడంతో వైద్యులు మంకీపాక్స్‌ అనుమానిత కేసుగా నమోదు చేసుకుని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

అతని నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణేలోని ఎన్‌ఐవీ ల్యాబ్‌కు పంపాం. రిపోర్టులు మంగళవారం సాయంత్రం వరకు రావొచ్చు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. మంకీపాక్స్‌ నిర్ధారణ అయితే అతను 25 రోజులపాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాల్సి ఉంటుంది. అలాగే రోగి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబసభ్యులను 21 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతాం’అని శంకర్‌ చెప్పారు. 

రెండు రోజుల్లో గాంధీకి డీఎన్‌ఏ ఎక్సాక్షన్‌ మిషన్‌ 
1980 వరకు స్మాల్‌పాక్స్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లలో 90 శాతం మంకీపాక్స్‌ వచ్చే అవకాశాల నుంచి రక్షణ ఉంటుందని డా.శంకర్‌ చెప్పారు. నిర్ధారణ పరీక్షల కోసం మరో రెండు రోజుల్లో గాంధీ మె­డికల్‌ కాలేజీ నోడల్‌ కేంద్రంలో డీఎన్‌ఏ ఎక్సాక్షన్‌ మిషన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. పరీక్షలకు సంబంధించిన కిట్స్‌ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలిస్తే.. గతంలో స్మాల్‌పాక్స్‌ కేసులకు వాడిన యాంటీ వైరల్‌ డ్రగ్స్, ఇమ్యునోగ్లోబులిన్‌ డ్రగ్స్‌ మంకీపాక్స్‌ రోగులకు వాడతామని చెప్పారు. ఈ డ్రగ్స్‌ గత 40 ఏళ్లుగా వాడటం లేదని, ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి వస్తే ఆ యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ వాడతామన్నారు.

నిర్లక్ష్యం చేస్తే ముప్పు 
మంకీపాక్స్‌ వైరస్‌ సోకితే నిర్లక్ష్యం చేయవద్దని డా.శంకర్‌ సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందడంలో నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తుల ద్వారా న్యుమోనియా వచ్చే అవకాశముందన్నారు. తద్వారా మెదడుపై ప్రభావం చూపి ఫిట్స్‌ వచ్చే చాన్స్‌ ఉందన్నారు. రెండో దశలో ప్రాణాలు కూడా పోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఎవరికైనా జ్వరం వచ్చి శరీరంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. మంకీపాక్స్‌ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్సలేమీ లేవని, చికెన్‌పాక్స్‌ మాదిరిగానే చికిత్సలు అందిస్తామని తెలిపారు.  

మరిన్ని వార్తలు