మహిళల కన్నా పురుషులే అధికం..

16 Jan, 2021 08:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితా విడుదలైంది. జనవరి 15 నాటికి రాష్ట్రంలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ వివరాలు వెల్లడించారు. జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం పురుష ఓటర్లు 1,51,61,714 కాగా, మహిళా ఓటర్లు 1,50,02,227 మంది ఉన్నారు. అంటే మహిళల కన్నా పురుష ఓటర్లు 1,59,487 మంది అధికంగా ఉన్నారు. మొత్తం ఓట్లలో సర్వీస్‌ ఓటర్లు 13,703 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఇతర ఓటర్ల (థర్డ్‌ జండర్‌ ) సంఖ్య 1,628గా పేర్కొన్నారు. గత నవంబర్‌ 16న ప్రకటించిన ముసాయిదా (డ్రాఫ్ట్‌) ఓటర్ల జాబితాలో 3,00,55,327 ఓటర్లుండగా, కొత్తగా 2,82,497 ఓటర్లు జాబితాలో చేరారు. డబుల్‌ ఓట్లు, తొలగించినవి కలుపుకొని మొత్తం 1,72,255 ఓట్ల తొలగించాక రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,01,65,569గా నమోదైంది. దీంతో పాటు రాష్ట్రంలో మొత్తం పోలింగ్‌ బూత్‌ల సంఖ్య 34,708గా ఉన్నట్లు సీఈవో ప్రకటించారు. చదవండి: ఓటర్లు.. ఆమే నిర్ణేత

20–49 ఏళ్ల లోపు ఓటర్లే 2,15,27,426 మంది... 
రాష్ట్రంలో వయస్సు వారీగా చూస్తే అత్యధికంగా 20 నుంచి 49 ఏళ్లలోపు వారు 2,15,27,426 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓట్లలో దాదాపు మూడో వంతు శాతం ఉన్నారు. వీరిలో 20–29ఏళ్ల మధ్యలోని వారు 62,57,483 మంది, 30–39 ఏళ్ల లోపు 89,28,827 మంది, 40–49 ఏళ్ల లోపు 63,41,116 మంది ఉన్నారు. నవయువ(18–19 ఏళ్ల వారు) ఓటర్లు 1,09,733 మంది ఉండగా, 50–59 ఏళ్ల మధ్యలో 42,31,789 మంది, 60–69 మధ్యలో 25,91,067 మంది, 70–79 మధ్యలో 12,87,859 ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారు 4,17,695 మంది ఉన్నారు.  

20 జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ ... 
రాష్ట్రంలో మొత్తం 20 జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 68,628 అధికంగా ఉన్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో 26,443 మంది, నిర్మల్‌ జిల్లాలో 22,601 మంది మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు