ఊహలు వద్దు... ఆశకు పోవద్దు 

11 Jan, 2023 02:32 IST|Sakshi

నిర్వహణ ఖర్చులను కచి్చతంగా చూపెట్టండి 

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దులో జీతాలు చూపించొద్దు 

వచ్చే ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందో ప్రత్యేక ప్రొఫార్మాలో ఇవ్వండి 

2023–24 బడ్జెట్‌ వివరాల కోసం ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఆర్థిక సంవత్సరానికి (2023–24) గానూ బడ్జెట్‌ తయారీ కోసం అన్ని శాఖలు ఈనెల 12లోగా ప్రభుత్వానికి పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈనెల 12 కల్లా ప్రభుత్వ విభాగాధిపతులకు వివరాలు వస్తే వాటికి అవసరమైతే మార్పులు చేర్పులు చేసి ఈనెల 13 కల్లా ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకు సూచించింది.

ఈ మేరకు 2023–24 బడ్జెట్‌ ప్రతిపాదనలు, 2022–23 సవరించిన బడ్జెట్‌ అంచనాలను రూపొందించేందుకు గాను మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్‌ ప్రతిపాదనలు పకడ్బందీగా పంపాలని, ఊహాజనిత అంచనాలు, లెక్కకు మిక్కిలి ప్రతిపాదనలు పంపవద్దని సూచించారు. 

ప్రత్యేక అంశాలతో ఉత్తర్వులు 
శాఖల వారీగా పంపాల్సిన బడ్జెట్‌ వివరాలతో పాటు ఏయే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో కొన్ని సూచనలు చేశారు. వాటి ప్రకారం... ప్రతి శాఖ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆయా శాఖల పరిధిలోని ఉద్యోగుల జీతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు (310–312)లో చూపించకూడదు. అలా చూపించినట్టు గుర్తిస్తే సదరు అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసు కుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ప్రతి శాఖకు సంబంధించిన ఖర్చులను విడివిడిగా చూపించవద్దని, అన్ని ఖర్చులను ఒకేచో ట చూపించాలని కూడా పేర్కొన్నారు. ఇక, శాఖల నిర్వహణ, ఆఫీసు ఖర్చులు, వాహనాలు, అద్దెలు, నీరు, విద్యుత్‌ ఖర్చులు, స్టేషనరీ, ఔట్‌సోర్సింగ్‌ సరీ్వసులు, సంక్షేమ, సబ్సిడీ పథకాలకు సంబంధించిన ఖర్చులను జాగ్రత్తగా చూపెట్టాలని తెలిపారు.

ప్రతి శాఖ పరిధిలో 2023–24లో జాయిన్‌ అయ్యే కొత్త ఉద్యోగుల వివరాలను (ఖాళీగా ఉన్న, కొత్తగా మంజూరైన పోస్టులు కాకుండా) కూడా ప్రత్యేక ఫార్మాట్‌లో పంపాలని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇక ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా ప్రత్యేక ఫార్మాట్‌లో పంపాలని ఆర్థిక శాఖ తెలిపింది. గత పదేళ్ల నుంచి రెవెన్యూ కింద చూపెట్టినా రాని పన్నుల వివరాలను కూడా కోరింది.   

మరిన్ని వార్తలు