పద్దు.. పొడిచేనా?

2 Nov, 2020 01:30 IST|Sakshi

రాష్ట్ర బడ్జెట్‌పై మధ్యంతర సమీక్షకు ఆర్థిక శాఖ కసరత్తు

ఈ ఏడాది ప్రతిపాదనల్లో సమకూరేది 25% వరకు తక్కువే.. 

రాబోయే నెలల్లో పన్ను ఆదాయం రూ.40 వేల కోట్లు వచ్చే చాన్స్‌

రుణాలు, ఇతర రాబడులు కలిపినా ఇంకో రూ.25 వేల కోట్లు..

మార్చి నాటికి మొత్తం రూ.1.30 లక్షల కోట్లు సమకూరుతుందని అంచనా

ఈ మేరకు శాఖల వారీ ప్రతిపాదనలు, రాబడులు, ఖర్చుల వివరాల సేకరణ 

సీఎం ఆదేశాలతో త్వరలోనే అన్ని శాఖలకు నోట్‌

ఆయా శాఖల సమాచారం మేరకు ప్రతిపాదనల సర్దుబాటు!  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలపై మధ్యంతర సమీక్షకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆశించిన మేరకు ఈ ఏడాది రాబడులు రాని కార ణంగా బడ్జెట్‌ను సమీక్షించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో శాఖల వారీగా అంచనాలు, రాబడులు,ఖర్చులు, తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చు పద్దులపై అంచనాలను సవరిం చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. తొలి ఆరు నెలల ఆర్థిక పరిస్థితులు, రాబోయే 6 నెలల అంచనాలను విశ్లేషి స్తున్న ఆర్థిక శాఖ అధికారులు.. 2020–21 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో 15–20% రాబడి రాకపోవచ్చన్న అంచనాలతో శాఖల వారీ సవరణ ప్రతిపాదనలను రూపొం దించే పనిలో పడ్డారు. ఈ మేరకు త్వరలోనే అన్ని శాఖలకు నోట్‌ పంపి ఆయా శాఖల కచ్చిత ప్రతి పాదనలకు అనుగుణంగా సవరించిన అంచనాల బడ్జెట్‌ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు.

రూ.1.30 లక్షల కోట్ల వరకు..
వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1,76,393 కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసింది. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌ ప్రతిపాదించిన దానికి కొంచెం అటుఇటుగా రాబడులు, ఖర్చులు ఉంటాయి. ఇంతకుముందు మూడేళ్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే 2019–20లో 96 శాతం, 2018–19లో 75 శాతం, 2017–18లో 79 శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. ఈసారి కరోనా ప్రభావంతో ఇది మరికొంత తగ్గి 75 శాతానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. తొలి ఆరు నెలల్లో వచ్చిన రూ.63,970 కోట్లకు తోడు మరో 70 వేల కోట్లు కలిపి రూ.1.30 లక్షల కోట్లు రావచ్చని భావిస్తోంది. ఇందులో రూ.40 వేల కోట్లకు పైగా పన్ను ఆదాయం, రూ.20 వేల కోట్ల వరకు రుణాలు, మరో రూ.5 వేల కోట్లకు పైగా ఇతర ఆదాయం కలిపి ఆ మేరకు సమకూరుతుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇటు గత మూడేళ్ల రాబడులు పరిశీలించినా చివరి ఆరు నెలల ఆదాయం రూ.70 వేల కోట్లు దాటలేదు.

ఖర్చులు కూడా ఆ మేరకు..
ఆదాయ పరిస్థితి అలా ఉంటే.. రానున్న ఆరు నెలల్లో ప్రభుత్వం రూ.60 వేల కోట్ల వరకు అనివార్య చెల్లింపులు జరపాల్సి ఉంది. ఇందులో రెవెన్యూ ఖర్చు రూ.25 వేల కోట్లు, అప్పుల వడ్డీ లేకుండా రూ.7 వేల కోట్లు, ఉద్యోగుల జీతాలకు రూ.14 వేల కోట్లు, పింఛన్లకు రూ.8 వేల కోట్లు, సబ్సిడీల కింద రూ.6 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. ఇందులో సబ్సిడీ ఖర్చులు తగ్గించుకున్నా రూ.3 వేల నుంచి 4 వేల కోట్లే మిగులుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేతిలో పెద్దగా నిధులు మిగిలే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లోనే బడ్జెట్‌ అంచనాలను సవరించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. 

ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా? 
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు గణనీయంగా పెంచుకోవాలని ఆర్థిక శాఖ ప్రభుత్వానికి సూచిస్తోంది. ఇందులో భూముల అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధపడితే రూ.10–15 వేల కోట్లు అదనంగా వచ్చే అవకాశముంది. ఇక ఆరేళ్లుగా ప్రభుత్వం ప్రజలపై పన్ను భారం వేయలేదు. కొంతమేరకు పన్నులు పెంచడం, భూముల మార్కెట్‌ విలువలను సవరించి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవడం ద్వారా నిధుల వెసులుబాటు కలగనుంది. మరి, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది.. రాబడులు పెంచుకునే దిశలో ముందుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరిస్తారా..? వచ్చిన ఆదాయంతో సరిపెట్టుకుని ప్రభుత్వ శాఖల అదనపు ఖర్చులను తగ్గించుకునే దిశలో బడ్జెట్‌ అంచనాలను సవరిస్తారా అన్నది భవిష్యత్‌ అవసరాలను తేల్చనున్నాయి. 
 

మరిన్ని వార్తలు