ఆర్థిక పరిస్థితి బాలేదు

29 Jan, 2021 04:14 IST|Sakshi

సంక్షేమ పథకాలు, ఉద్యోగుల వేతనాలకు 89.86 శాతం నిధుల వ్యయం 

తలసరి ఆదాయం పెరిగినా,విద్య, వైద్య, జీవన ప్రమాణాల్లో తక్కువే 

ఈ ఏడాదిలోనే మిషన్‌ భగీరథ,కాకతీయ అప్పుల చెల్లింపులు 

వేతన సవరణ సంఘం విశ్లేషణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని మాజీ ఐఏఎస్‌ చిత్తరంజన్‌ బిస్వాల్‌ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) అభిప్రాయపడింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ప్రజలు భారీ ఆశలతో ఉన్నారని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడంతో ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగుల వేతన సవరణ సిఫార్సులు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఆర్థిక స్థితి, ఉద్యోగుల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని సమతూకం పాటించామని వెల్లడించింది. ఆదాయంలో సంక్షేమ పథకాలు, వేతనాలు/పెన్షన్ల రూపంలో దాదాపు 89.86 శాతం నిధులు ఖర్చు అవుతున్నాయని వివరించింది.

ఇక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కష్టమని పేర్కొంది. ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన రాష్ట్రాలకు ఎల్లప్పుడూ ఆర్థిక వనరులు కల్పించుకోవడం కష్టమని వ్యాఖ్యానించింది. రాష్ట్ర్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలనే ఉద్దేశంలో అప్పులు ఎక్కువవుతున్నాయని, రుణాల చెల్లింపులు, వాటి వడ్డీలు ఏటా పెరుగుతున్నాయని పేర్కొంది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనుల కోసం తీసుకున్న అప్పుల చెల్లింపులు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

గత పీఆర్‌సీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ కంటే ఎక్కువ మొత్తం ఇవ్వడం వల్ల విద్యావంతులైన యువత ప్రైవేట్‌ రంగం వైపు కాకుండా దిగువ స్థాయిలోని ఉద్యోగాల్లోనూ చేరడానికి ముందుకొచ్చారని తెలిపింది. గడిచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేయడం వల్ల, తద్వారా వచ్చిన ఆదాయంతో కూడా ఆ పీఆర్‌సీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగిందని, ఇప్పుడా పరిస్థితులు లేవని కమిషన్‌ వ్యాఖ్యానించింది.

జీవన ప్రమాణాలు పెరగకుంటే లాభమేంటి..? 
గతేడాది మార్చి నుంచి కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక రంగం కుదేలైందంటూ లక్షలాది అసంఘటిత కార్మికులు మండుటెండల్లో వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన దైన్యస్థితిని సైతం కమిషన్‌ తన నివేదికలో వివరించింది. విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు పెరగకుండా రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది.

మానవ అభివృద్ధి సూచికలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం 16వ స్థానంలో ఉందని వివరించింది. ఆదాయ వనరులు తగ్గుతుండగా, అప్పులు మాత్రం పెరుగుతున్నాయని తెలిపింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 13.76 శాతం నుంచి 11.88 శాతానికి తగ్గినట్లు వివరించింది. అలాగే కేంద్రం నుంచి వచ్చే సాయం కూడా 5.32శాతం నుంచి 2.93 శాతానికి పడిపోయినట్లు తెలిపింది.

>
మరిన్ని వార్తలు