వేలిముద్రకు రూ.150

11 Mar, 2021 03:03 IST|Sakshi

బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌కు మీసేవల్లో వసూళ్ల పర్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అథెంటికేషన్‌ తప్పనిసరి

కొన్నిచోట్ల కాలేజీల్లోనే మీసేవ నిర్వాహకుల కౌంటర్లు

ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.20 మాత్రమే 

ఏటా అథెంటికేషన్‌ ఇస్తున్న 13 లక్షల మంది విద్యార్థులు

కార్తీక్‌ మేడ్చల్‌ సమీపంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద దరఖాస్తు చేశాక.. ఆధార్‌ ఆధారిత వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో సమీపంలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి వేలిముద్రలు సమర్పించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రూ.20కి రశీదు చేతిలో పెట్టిన మీసేవ నిర్వాహకుడు రూ.150 ఇవ్వాలని స్పష్టం చేశాడు. గతేడాది ఇదే మీసేవ కేంద్రంలో రూ.50 ఇచ్చానని కార్తీక్‌ చెప్పినా లాభం లేకపోయింది. కోవిడ్‌-19 తర్వాత ఇదే రేటు అని చెప్పడంతో చేసేదేమీ లేక రూ.150 చెల్లించుకున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల్లో అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ విధానాన్ని మీసేవ కేంద్రం నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించిన తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో ఆమోదించాలంటే సదరు విద్యార్థి వేలిముద్రలను దరఖాస్తుతో అప్‌లోడ్‌ చేయాలి. ఎక్కడినుంచైనా ఆన్‌లైన్‌ దరఖాస్తును సమర్పించే అవకాశం ఉన్నప్పటికీ... వేలిముద్రలు అప్‌లోడ్‌ చేసే ఆప్షన్‌ మీసేవ కేంద్రాలకు ప్రభుత్వం ఇచ్చింది. దీనికి రూ.20 రుసుముగా నిర్ణయించింది. అయితే పలు మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికంటే కొన్నిరెట్లు అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

రూ.10 కోట్లు దాటుతున్న వసూళ్లు!
రాష్ట్రంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించి ప్రతి సంవత్సరం సగటున 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 20 చొప్పున బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ ఫీజు రూపంలో సర్కారు ఖజానాకు రూ. 2.6 కోట్లు జమవుతోంది. కానీ చాలాచోట్ల మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.50 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. సగటున రూ. 100 చార్జ్జ్‌ చేస్తున్నారనుకుంటే... ఈ లెక్కన ఏటా రూ.10 కోట్లకు పైగా విద్యార్థుల నుంచి దోచుకుంటున్నారు.

కౌంటర్లు పెట్టి మరీ దోపిడీ 
మీసేవ కేంద్రాల నిర్వాహకులతో కొన్ని కాలేజీ యాజమాన్యాలు కుమ్మక్కై కాలేజీలోనే బయో మెట్రిక్‌ అప్‌డేషన్‌ కానిచ్చేస్తున్నారు. మీసేవ కేంద్రం నిర్వాహకుడు కంప్యూటర్‌తో కాలేజీలోనే ఒకచోట సెటప్‌ ఏర్పాటు చేసి అక్కడే వేలిముద్రలు అప్‌డేట్‌ చేస్తున్నారు. అలా కాలేజీలోనే దుకాణం తెరిచి ఒ క్కో విద్యార్థికి రూ.200 చార్జ్‌ చేస్తున్నారు. ఇందులో కాలేజీ సిబ్బందికి సైతం వాటాలందుతున్నాయి. వేలిముద్రల స్వీకరణ ప్రక్రియను ఉచితంగా నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. మీసేవ కేంద్రాలకు ఆప్షన్‌ ఇచ్చే బదులుగా కాలేజీల్లోనే ప్రత్యేకంగా ఈ సెటప్‌ ఏర్పాటు చేయాలని, యాజమాన్యాలు సైతం బాధ్యతగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే దోపిడీకి ఆస్కారం ఉండదని విద్యార్థులు అంటున్నారు. అయితే మీసేవ కేంద్రాల్లో వసూళ్లపై ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.

కాలేజీలోనే వేలిముద్రలిచ్చే ఆప్షన్‌ ఉండాలి
స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బయోమెట్రిక్‌ విధానం మీసేవ కేంద్రంలో కాకుండా కాలేజీలోనే సమర్పించేలా ఆప్షన్‌ ఉండాలి. ట్యూషన్‌ ఫీజుతో పాటు ఇతరత్రా ఫీజులు తీసుకుంటున్నందున... ఉచితంగా వేలిముద్రలను అప్‌డేట్‌ చేసే బాధ్యతను కాలేజీ యాజమాన్యాలకే అప్పగించాలి. దీంతో విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి... మీసేవ కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ ఇచ్చే బాధ తప్పుతుంది.
- సాత్విక్, బీటెక్‌ ఫైనలియర్, శంషాబాద్‌

మరిన్ని వార్తలు