సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో అగ్నికీలలు

21 Oct, 2021 08:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్‌లోని విద్యుత్‌ ప్యానల్‌ బోర్డులో షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో కేబుళ్లకు మంటలు అంటుకుని క్షణాల్లో అయిదో అంతస్తుకు వరకూ విస్తరించాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన  సెక్యూరిటీ సిబ్బంది, అధికారులతో పాటు ఆస్పత్రి ప్రాంగణంలోని ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. 

బయటపడి.. ఊపిరి పీల్చుకుని.. 

 బుధవారం ఉదయం 7.30 గంటల సమయం. ఆస్పత్రి సెల్లార్‌లోని ఎలక్ట్రికల్‌ విభాగంలోని విద్యుత్‌ ప్యానల్‌బోర్డులో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ప్రతి అంతస్తుకు అనుసంధానం చేసిన విద్యుత్‌ తీగలు, కేబుళ్లకు మంటలు అంటుకుని నిలువుగా అయిదో అంతస్తు వరకు వ్యాపించాయి. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో చిమ్మచీకట్లు అలముకున్నాయి.
 
 దట్టమైన పొగలను గమనించిన రోగులు, సిబ్బంది భయాందోళనతో మెట్లు, ర్యాంపు మార్గాల ద్వారా బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కొంతమంది రోగులు కిందపడి స్వల్ప గాయాల పాలయ్యారు. గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్తులోని గైనకాలజీ, చిన్నపిల్లల (పీడియాట్రిక్‌) వార్డుల్లో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, పీఐసీయూ, ఎన్‌ఐసీయూల్లోని శిశువులను తీసుకుని వార్డుల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. 

 అగ్నిమాపక, పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది సుమారు 40 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. డీఎంఈ రమేష్‌రెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. చేపట్టాల్సిన చర్యలపై  సూపరింటెండెంట్‌ రాజారావు, వైద్యులతో కలిసి సమీక్షించారు. విద్యుత్‌ అంతరాయంతో వైద్యసేవల్లో జాప్యం ఏర్పడింది. పలు శస్త్రచికిత్సలను వాయిదా వేశారు.  

పురాతన కేబుళ్లతో ప్రమాదాలు..  
గాంధీఆస్పత్రి నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ కేబుళ్ల వ్యవస్థ శిధిలావస్థకు చేరుకోవడంతో తరచూ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. వైర్లు, కేబుళ్లను ఎలుకలు, పందికొక్కులు కొరికివేయడంతో విద్యుత్‌ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అగ్నిప్రమాదాల కారణంగా లక్షలాది రూపాయల విలువైన వైద్యపరికరాలు దగ్ధమవు తున్నా ఆస్పత్రి పాలనా యంత్రాంగం సరైన రీతిలో స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

అక్కరకురాని అగ్నిమాపక పరికరాలు..  
గాంధీఆస్పత్రిలో ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టం పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఆస్పత్రి ప్రారంభినప్పుడు ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పుపట్టి మూలనపడ్డాయి. ఫైర్‌ ఎంగ్విస్టర్లు పనిచేయడంలేదు. నూతన ఫైర్‌ సిస్టం ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఆస్పత్రి పాలనా యంత్రాంగం పలుమార్లు ఈ విషయమై వైద్య ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోవడం గమనార్హం. 

ఘటనపై మంత్రి తలసాని ఆరా 
గాంధీఆస్పత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీశారు. హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావుకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే గాంధీఆస్పత్రిని సందర్శిస్తానన్నారు.  

వైద్యసేవలు యథాతథం..   
నార్త్‌బ్లాక్‌లోని ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులను సౌత్‌ బ్లాక్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్నాం. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి 20 నిమిషాల్లో మంటలను అదుపు చేయించాం. వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయి.  
– రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌  

అంధకారంలోనే పరిపాలనా విభాగం, వార్డులు.. 

► అగ్ని ప్రమాదంతో గాంధీ ఆస్పత్రిలో చిమ్మచీకట్లు అలముకున్నాయి. సుమారు గంటన్నర సమయం తర్వాత కొన్ని బ్లాకుల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. నార్త్‌బ్లాక్‌ మొత్తం చీకట్లోనే ఉంది.  విద్యుత్‌ అంతరాయంతో నార్త్‌బ్లాక్‌లోని ప్లాస్టిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ ఆపరేషన్‌ థియేటర్లు మూతపడ్డాయి. 

 సూపరింటెండెంట్‌ పేషీ, ఆరోగ్యశ్రీ, మెడికల్‌ రికార్డు సెక్షన్, ఆర్‌ఎంఓ, నర్సింగ్‌ సూపరింటెండెంట్, శానిటేషన్, ఎస్టాబ్లిష్‌మెంట్, పరిపాలన, బయోమెట్రిక్‌ విభాగాల పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడనుంది.  

మరిన్ని వార్తలు