భగత్‌సింగ్‌నగర్‌లో అగ్ని ప్రమాదం 

12 Mar, 2022 05:06 IST|Sakshi
ఎగిసిపడుతున్న మంటలు  

ఎగిసిపడిన మంటలు 

కాలి బూడిదైన రెండు గుడిసెలు 

సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాంనగర్‌ డివిజన్‌ బాగ్‌లింగంపల్లిలోని భగత్‌సింగ్‌నగర్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భగత్‌సింగ్‌నగర్‌లో 75కు పైగా గుడిసెలు ఉండగా అందులో చిన్నమద్దిలేటి, రాజులకు చెందిన గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంపై స్థానికులు ఫైర్‌ సిబ్బందికి, చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.  

తప్పిన పెను ప్రమాదం.. 
భగత్‌సింగ్‌నగర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల రెండు గుడిసెలు కాలిబూడిదయ్యాయి. అయితే మంటలు మిగిలిన గుడిసెలకు అంటుకుని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు. సకాలంలో ఫైర్‌ సింబ్బంది అక్కడకు చెరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పేర్కొన్నారు. భగత్‌సింగ్‌నగర్‌లో పనిచేసే వారంతా అడ్డమీది కూలీలు కావడంతో ఉదయం 9గంటల లోపే వారు పనిలోకి వెళ్లిపోతారు.

ఈ క్రమంలోనే చిన్నమద్దిలేటి భార్య వంటచేసిన అనంతరం నిప్పులను ఆర్పకుండా పనికి వెళ్లింది. దీంతో ఆ నిప్పురవ్వలతోనే గుడిసెకు మంట అంటుకొని ప్రమాదం సంభవించినట్లు పలువురు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ గ్యాస్‌ సిలిండర్‌లు పేలలేదని, ఇదే ఘటన రాత్రి సమయంలో జరిగితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని భగత్‌సింగ్‌నగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. 

బాధితులను ఆదుకుంటాం..
అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అసెంబ్లీ నుంచి నేరుగా ఘటన స్థాలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన గుడిసెవాసులకు న్యాయం చేస్తామని, నష్టపరిహారం అందేలా చూస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ భరోసా కల్పించారు. బీజేపీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, కార్పొరేటర్‌ కె.రవిచారి, టీఆర్‌ఎస్‌ నాయకులు ముఠా జైసింహా, ముచ్చకుర్తి ప్రభాకర్, దామోదర్‌రెడ్డి, బబ్లూ, ఆర్‌.వివేక్‌ తదితరులు బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు