దళిత ఫైర్‌ బ్రాండ్‌ ఈశ్వరీబాయి

24 Feb, 2021 15:59 IST|Sakshi

నేడు ఈశ్వరీబాయి వర్థంతి

మూలవాసీ చైతన్యానికి నిలువెత్తు ప్రతీక ఈశ్వరీబాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను ప్రభావితం చేసిన దళిత ఫైర్‌బ్రాండ్‌. 1918 డిసెంబర్, 1న హైదరాబాదు చిలకలగూడాలోని సాధారణ దళిత కుటుంబంలో రాములమ్మ, బలరామస్వామి దంపతులకు జన్మించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలలో ప్రావీణ్యమున్న ఈశ్వరీ బాయి ఉపాధ్యాయురాలిగా ఉంటూనే, రాజకీయ, సామాజిక, పోరాటాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1942 జూన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత నిమ్న కులాల సభకు ఆమె హైదరాబాదు రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యారు. అంబేడ్కర్‌ను కలిసారు. అంబేడ్కర్‌ స్థాపించిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరి చురుకుగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్‌ శాఖకు అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 

చిలకలగూడా కార్పోరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. 1967లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969 తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 1972లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.  దాదాపు పదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకురాలి పాత్రలో సమర్థవంతంగా రాణించి, అసెంబ్లీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు.

1952 నుండి 1990 వరకు 4 దశాబ్దాలకు పైగా ప్రజా సేవారంగాలలో పనిచేస్తూ, దళి తులు వెనుకబడిన వారి కోసం అవిరళ కృషి చేసారు. రాజకీయాలలో కుల ప్రభావాన్ని తట్టుకొని నిలబడ్డ ఈశ్వరీబాయి నేటి దళిత సమాజానికి దిక్సూచి. ఈ దళిత ఫైర్‌ బ్రాండ్‌ 1991 ఫిబ్రవరి 24న కన్నుమూసారు. 

డా. యస్‌. బాబూరావు, స్వతంత్ర జర్నలిస్ట్, కావలి
మొబైల్‌ : 95730 11844 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు