లాక్‌డౌన్‌: జనమంతా ఇళ్లలోనే!

13 May, 2021 01:37 IST|Sakshi

రాష్ట్రంలో తొలిరోజు లాక్‌డౌన్‌ ప్రశాంతం

ఆ నాలుగు గంటలు మాత్రం మహారద్దీ

ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య నిత్యావసరాల కోసం బయటికొచ్చిన ప్రజలు

పది గంటల తర్వాత రోడ్లు, వీధులన్నీ నిర్మానుష్యం

రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు

ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో కట్టుదిట్టంగా సాగిన పర్యవేక్షణ

వ్యాక్సిన్, వైద్య, నిత్యావసర, ఆహార సేవలు యథాతథం

క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ఎస్పీలు, సీపీలు

ప్రతీ గంటకు డీజీపీ కార్యాలయానికి సమాచారం 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తొలి రోజు బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇచ్చిన మినహాయింపు సమయంలోనే జనాలు తమకు అవసరమైనవన్నీ సమకూర్చుకున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లు, వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. చాలాచోట్ల జనం స్వచ్ఛందంగానే లాక్‌డౌన్‌ సమయంలోగా ఇళ్లకు వెళ్లిపోయారు. గతేడాది మార్చి 23 నాటి లాక్‌డౌన్‌ తరహాలో పోలీసులు మరీ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపించలేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు.. కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్‌ పోలీసు కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు స్వయంగా 

ఆయా చోట్ల పర్యటించి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. రోడ్లపై పలు చెక్‌పోస్టుల్లో స్వయంగా తనిఖీల్లోనూ ఉన్నతాధికారులు పాల్గొనడం గమనార్హం. డీజీపీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు కోసం పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్లు, ఎస్పీ, కమిషనర్, డీజీపీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయాల ద్వారా.. ఎస్‌హెచ్‌వో నుంచి డీజీపీ వరకు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించారు. జిల్లాల నుంచి డీజీపీ కార్యాలయానికి గంట గంటకూ సమాచారం అందించారు. అయితే ఉదయం 10 గంటలు దాటినా రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జనాలు గణనీయ సంఖ్యలోనే కనిపించారు.

ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకున్న ప్రయాణికులు ఇళ్లకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. విమాన ప్రయాణికులు, విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. మరోవైపు సరైన కారణం లేకుండా బయటికి వచ్చినవారికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మందులు, వైద్యం, రెండో డోసు వ్యాక్సిన్, కరోనా పరీక్షలు, కూరగాయలు, అత్యవసర వైద్యసేవల వారిని పోలీసులు తనిఖీ చేసి అనుమతించారు.

మహారాష్ట్ర వైపు తగ్గిన జనం!
లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దుల వద్ద పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. ఇటీవలి వరకు మహారాష్ట్ర నుంచి సరిహద్దుగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌ల మీదుగా పెద్ద సంఖ్యలో జనం రాష్ట్రంలోకి రాగా.. బుధవారం పెద్దగా వాహనాలు రాలేదని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోనూ లాక్‌డౌన్‌ అమల్లో ఉండటం, ఇక్కడ లాక్‌డౌన్‌ మొదలైందన్న వార్తలతో వచ్చేవారు తగ్గారని.. గర్భిణులు, ప్రమాదాల బారిన పడ్డవారు మినహా పెద్దగా ఎవరూ రాలేదని వెల్లడించారు. దీంతో చాలా చెక్‌పోస్టుల వద్ద తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహించినట్టు చెప్తున్నారు. మరోవైపు ఏపీతో సరిహద్దుల్లోని భద్రాద్రి జిల్లా భద్రాచలం, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, నల్లగొండ జిల్లా వాడపల్లి చెక్‌పోస్టు, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద, కర్ణాటక సరిహద్దులోని గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు కఠినంగానే వ్యవహరించారు. అత్యవసర వైద్యసేవల కోసం తప్ప మిగిలిన వారికి అనుమతించలేదు.

నిత్యావసరాల కోసం రద్దీ
రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ మినహాయంపు ఇవ్వడంతో చాలా మంది జనం నిత్యావసరాల కోసం బయటికి వచ్చారు. ముఖ్యంగా కూరగాయలు, కిరణా, మటన్, చికెన్‌ దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. భౌతిక దూరం పాటిస్తూ జనం సరుకులు కొనుగోలు చేశారు. అన్ని రకాల దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో ఎన్నడూ లేనట్టుగా చాలా దుకాణాలు ఉదయం ఆరేడు గంటలకే తెరవడం, గిరాకీ చేయడం కనిపించింది. పది గంటలకన్నా ముందే షాపులు మూసేసి వెళ్లిపోయారు.

టెస్ట్‌లు, టీకాలు: కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు, టీకా కేంద్రాలు యథావిధిగా పనిచేశాయి. సంబంధిత రుజువులు చూపిన వారిని పోలీసులు ఎక్కడా ఆపలేదు. ఆయా కేంద్రాలకు అనుమతించారు. 

నిత్యావసర వస్తువులు: లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా మార్కెట్లు, రైతుబజార్‌లకు రద్దీ పెరిగింది. వాస్తవానికి వీటికి కొరత లేనప్పటికీ వారానికి సరిపడా కూరగాయల కొనుగోళ్లకు జనాలు మొగ్గు చూపారు. దీంతో వ్యాపారులు ధరలు పెంచి సొమ్ముచేసుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ జనం సరుకులు కొనుగోలు చేశారు.

ఆర్టీసీ బస్సులు: లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో బస్సులు తిరిగాయి. బస్సు సర్వీసులు తగ్గించడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా 650 బస్సులు తిరిగాయి. ఇతర రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపేశారు. 

రైళ్లు: 80 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడిచాయి. రిజర్వేషన్‌ ఉన్న ప్రయాణికులను అనుమతించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లాలంటే: వారికి ప్రత్యేక పాసులు అవసరం లేదు. పోలీసులకు ప్రయాణ
టికెట్‌/ఎస్‌ఎంఎస్‌ చూపిస్తే సరిపోతుంది. 

మద్యం దుకాణాలు: ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు కూడా తెరిచినప్పటికీ చాలా తక్కువ మంది వచ్చారు. బుధవారం లిక్కర్‌ దుకాణాల యజమానులు రూ.155 కోట్ల మద్యాన్ని డిపోల నుంచి కొనుగోలు చేశారు.  

రేషన్‌ పంపిణీ: పేదలకు  నిత్యావసరాలు ఇచ్చేందుకు ఉదయం 6 గంటలకే చౌక ధరల దుకాణాలను తెరిచారు. 

బ్యాంకులు, ఏటీఎంలు: ఉదయం 8 నుంచి 12 గంటల వరకు బ్యాంకులు తెరవాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది. 20వ తేదీ వరకు ఇదే సమయపాలన కొనసాగుతుంది. ఏటీఎంలు యథావిధిగా పనిచేశాయి.

ఉపాధి హామీ:  బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 13,53,042 మంది పనులకు హాజరయ్యారు. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 1,27,427 మంది, 2వ స్థానంలో ఉన్న నల్లగొండ జిల్లాలో 1,03,510 మంది, అత్యల్పంగా 1,399 మంది మేడ్చల్‌ జిల్లాలో పాల్గొన్నారు.

వ్యవసాయం: ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 

ప్రజలు సహకరించాలి: డీజీపీ మహేందర్‌రెడ్డి
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన 10 రోజుల లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఉదయం 6 నుంచి 10 గంటల్లోగానే.. అది కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలని సూచించారు. వ్యవసాయం, పాలు, కూరగాయలు, ధాన్యం రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపారు. భవన నిర్మాణ రంగాల వారు తమ పనులు కొనసాగించవచ్చన్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించి పాసులు పొందాలని సూచించారు. అలాగే 33 శాతం ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు హాజరుకావాల్సి ఉండటంతో వారికి సైతం పాసులు జారీ చేస్తామన్నారు. విమాన, రైలు ప్రయాణికులు బయటికి వచ్చినపుడు టికెట్లు దగ్గర ఉంచుకోవాలని, పోలీసులు తనిఖీలు చేసినప్పుడు చూపించాలని తెలిపారు. 

ఈ–పాస్‌ల కోసం 15 వేల దరఖాస్తులు
ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు అత్యవసర ప్రయాణాల కోసం తప్పనిసరి చేసిన ఈ–పాస్‌లకు మొదటిరోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటికోసం మంగళ వారం నుంచే పలు జిల్లాల్లో దరఖాస్తులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 15 వేలకుపైగా దరఖాస్తులు రాగా.. 5,711 అనుమతించామని, 2,385 దరఖాస్తులను తిరస్కరించామ న్నారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయ న్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యక్రమంలో జిల్లా ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు పాసులు జారీ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు