తొలిరోజు కోదాడలో గడబిడ

24 May, 2022 01:13 IST|Sakshi

పదోతరగతి పరీక్ష రాసిన 99% మంది విద్యార్థులు 

సూర్యాపేట జిల్లా కోదాడలో కొంత గందరగోళం 

తెలుగుకు బదులు కాంపోజిట్‌ తెలుగు ప్రశ్నపత్రాలు 

డిక్లరేషన్‌ తీసుకుని తెలుగు పేపర్లు ఇచ్చిన అధికారులు 

వేరే స్కూళ్ల నుంచి పరీక్ష రాయడంతో సమస్య 

సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. తొలిరోజున అన్నిచోట్లా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని టెన్త్‌ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు ప్రకటించారు. ఎస్సెస్సీ పరీక్షలకు మొత్తం 5,08,143 మంది దరఖాస్తు చేసుకోగా.. సోమవారం జరిగిన మొదటి భాష పరీక్షను 5,03,041 (99 శాతం) మంది రాశారని, 5,102 మంది గైర్హాజరయ్యారని ఎస్సెస్సీ బోర్డ్‌ తెలిపింది.

ఎక్కడా ఎలాంటి మాల్‌ ప్రాక్టీసింగ్‌ కేసులు నమోదు కాలేదని ప్రకటించింది. పూర్తి నిఘా నీడలో పరీక్ష జరిగిందని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా పరీక్షలు రాశారని పేర్కొంది. అంతటా కోవిడ్‌ నిబంధనలు అమలు చేశామని తెలిపింది. వేసవి తీవ్రత తగ్గడంతో ఎక్కడా అసౌకర్యం కలగలేదని, అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించింది.

జనరల్‌ తెలుగుకు బదులు... కాంపోజిట్‌ తెలుగు
సూర్యాపేట జిల్లా కోదాడలో మాత్రం పరీక్షల్లో గందరగోళం నెలకొంది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు జనరల్‌ తెలుగు (1టి, 2టి)కు బదులు కాంపోజిట్‌ తెలుగు (3టి, 4ఎస్‌) ప్రశ్నపత్రాలు ఇచ్చారు. ఇది చూసి కంగుతిన్న విద్యార్థులు.. పరీక్షా కేంద్రం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాము చదివినది తెలుగు భాష సబ్జెక్టు అని.. వేరే పేపర్లు వచ్చాయని చెప్పారు. దీనితో అధికారులు సదరు విద్యార్థుల నుంచి డిక్లరేషన్‌ తీసుకుని వారికి జనరల్‌ తెలుగు ప్రశ్నపత్రాలను ఇచ్చారు. 

ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంతో.. 
కోదాడలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులు ఉండటంతో వారిని పట్టణంలోని మరో కార్పొరేట్‌ స్కూల్‌ తరఫున పరీక్ష రాయించినట్టు తెలిసింది. సదరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు జనరల్‌ తెలుగు సబ్జెక్టు చదవగా.. కార్పొరేట్‌ స్కూల్‌ విద్యార్థులు కాంపోజిట్‌ తెలుగు సబ్జెక్టు చదివారు. పరీక్ష ఫీజు కట్టే సమయంలో కార్పొరేట్‌ స్కూల్‌ అందరు విద్యార్థుల సబ్జెక్టును కాంపోజిట్‌ తెలుగుగా నమోదు చేసిందని.. దీనిప్రకారమే విద్యార్థులకు కాంపోజిట్‌ తెలుగు పేపర్లను ఇచ్చారని తెలిసింది. 

పరీక్ష కేంద్రంలో పాము కలకలం 
ఖమ్మం జిల్లా ముత్తగూడెం పరీక్షా కేంద్రంలోని 7వ నంబర్‌ గదిలో పాము కలకలం రేపింది. ఆ గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా పాము వచ్చి దూరింది. విద్యార్థులు భయంతో బయటికి పరుగెత్తేందుకు ప్రయత్నించగా.. ఇన్విజిలేటర్‌ వారికి సర్దిచెప్పి బెంచీలపై నిల్చోబెట్టారు. ఓ విద్యార్థి ధైర్యం చేసి కర్రతో పామును చంపడంతో అంతా ప్రశాంతంగా పరీక్ష రాశారు. 

పుట్టెడు దుఃఖంలోనూ 
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన ఇడికోజు లలిత కొండమల్లేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

లలిత తండ్రి పురుషోత్తమాచారి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. లలిత పుట్టెడు దుఃఖంలోనూ బంధువులు, స్నేహితుల సాయంతో పరీక్షకు హాజరైంది.  

మరిన్ని వార్తలు