పులుల కోసం ఓ వంతెన

23 May, 2022 01:53 IST|Sakshi
వన్యప్రాణులు రోడ్డు దాటేందుకు ఆసిఫాబాద్‌ జిల్లాలో ఈ తరహాలో ప్రత్యేక ఎకో బ్రిడ్జి నిర్మించనున్నారు 

తెలంగాణలో తొలి ఎకో బ్రిడ్జి  

సాక్షి, హైదరాబాద్‌: తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్‌. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్‌పూర్‌–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కాబోతోంది.

4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 150 మీటర్ల పొడవుతో ఎకో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. అంటే వన్యప్రాణులు రాకపోకలు సాగించే సమయంలో జాతీయ రహదారిని దాటేందుకు సహజ సిద్ధ వాతావరణం కల్పిస్తూ నిర్మించే వంతెన అన్నమాట.

ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల పరిరక్షణలో మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ తరహా నిర్మాణం తెలంగాణలోనే మొదటిది కానుండటం విశేషం. దీనికి మరో 2 కి.మీ. దూరంలో 200 మీటర్ల పొడవుతో అండర్‌పాస్‌నూ నిర్మిస్తున్నారు. మొదటి వంతెన వద్ద వాహనాలు దిగువ నుంచి సాగితే, జంతువు లు పైనుంచి రోడ్డును దాటుతాయి. రెండో నిర్మాణం వద్ద.. వాహనాలు ఫ్లైఓవర్‌ మీదుగా.. జంతువులు దిగువ నుంచి దాటుతాయి. 

మూడు రాష్ట్రాలను కలిపే గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే 
నాగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకు సాగే ఈ కారిడార్‌లో తెలంగాణలోని మంచిర్యాల నుంచి విజయవాడ వరకు పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెవేగా రోడ్డును నిర్మించబోతున్నారు. దీనికి కేంద్రం నుంచి ఆమోదం వచ్చినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల నాగ్‌పూర్‌–విజయవాడ మధ్య దూరం 180 కి.మీ. మేర తగ్గనుంది.

తెలంగాణ నుంచి విజయవాడకు ప్రస్తుతం హైదరాబాద్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు బిజీగా మారి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తోంది. ప్రతిపాదిత కొత్త రోడ్డు మంచిర్యాల–వరంగల్‌–ఖమ్మం–మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. హైదరాబాద్‌ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేని వాహనాలు అటుగా మళ్లి.. ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారిపై భారాన్ని తగ్గిస్తాయి. 

వైల్డ్‌లైఫ్‌ బోర్డు సిఫారసుతో.. 
ఇందులో మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్‌–మంచిర్యాల వరకు 2 వరుసల పాత రోడ్డు ఉంది. దాన్నే 4 వరుసలకు విస్తరిస్తారు. మంచిర్యాల నుంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మిస్తారు. ఆసిఫాబాద్‌ మీదుగా విస్తరించే 4 వరుసల రహదారితో వన్యప్రాణులకు ఇబ్బందిగా మారడంతో అటవీశాఖతోపాటు ప్రత్యేకంగా వైల్డ్‌లైఫ్‌ బోర్డు నుంచి క్లియరెన్సు తీసుకోవాల్సి వచ్చింది.

ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ దరఖాస్తు చేసుకోగా, గతేడాది వైల్డ్‌లైఫ్‌ కమిటీ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని సర్వే చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప అనుమతులు సాధ్యం కాదని తేల్చారు. అనంతరం వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్త బిలాల్‌ హబీబ్‌ నేతృత్వంలోని బృందం పర్యటించి మహారాష్ట్ర–ఆసిఫాబాద్‌ సరిహద్దు వద్ద 150 మీటర్ల మేర ఎకో బ్రిడ్జిని, ఆ తర్వాత 200 మీటర్ల మేర అండర్‌పాస్‌ కట్టాలని సిఫారసు చేసినట్టు అధికారులు చెప్పారు. 

నాయిస్‌ బారియర్స్‌ ఏర్పాటు 
ఎక్స్‌ప్రెస్‌ వే కావడంతో వాహనాలు 150 కి.మీ. వేగంతో దూసుకుపోతాయి. అప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంది. అది వన్యప్రాణులను బెదరగొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ప్రతిపాదిత బ్రిడ్జి, అండర్‌పాస్‌ వద్ద వాహనాల శబ్దాన్ని వెలుపలికి బాగా తగ్గించి వినిపించేలా నాయిస్‌ బారియర్స్‌ ఏర్పాటు చేయాలని కూడా వైల్డ్‌ లైఫ్‌ బోర్డు ఆదేశించింది.

దాంతోపాటు ఎకో బ్రిడ్జి మీదుగా జంతువులు దాటే ప్రాంతంలో ఎక్కడా అది ఓ కట్టడం అన్న భావన రాకుండా చూస్తారు. సాధారణ నేల, దానిపై చెట్లు ఉండేలా డిజైన్‌ చేస్తారు. అది మామూలు భూమే అనుకుని జంతువులు రోడ్డును సురక్షితంగా దాటుతాయి. 

మరిన్ని వార్తలు