ట్రాఫికింగ్‌పై ‘ధ్రువా’స్త్రం

2 Aug, 2021 02:01 IST|Sakshi

మానవ అక్రమరవాణా కట్టడికి దేశంలోనే తొలి వెబ్‌సైట్‌ ’ధ్రువ’ 

తెలంగాణ పోలీసుల మరో వినూత్న ప్రయత్నం 

బాధితులకు బాసటగా నిలిచేలా రూపకల్పన  

ఆన్‌లైన్‌ కోర్సులు, న్యాయ సహాయం, పోలీసులకు శిక్షణ 

సంపూర్ణ సహకారానికి ముందుకొచ్చిన బ్రిటిష్‌ హైకమిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్‌) ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. రాష్ట్రంలో దీన్ని నిరోధించేందుకు తెలంగాణ పోలీసులు నడుం బిగించారు. కలకలం రేపుతున్న ట్రాఫికింగ్‌ను కట్టడి చేయడానికి మరో వినూత్న ప్రయోగం చేశారు. పిల్లలు, మహిళలకు ప్రమాదకరంగా మారిన మానవ అక్రమ రవాణా నిరోధకానికి దేశంలోనే తొలి వెబ్‌సైట్‌ ధ్రువహెచ్‌టీ (http://dhruvaht.orf/) (డీహెచ్‌ఆర్‌యూవీఏహెచ్‌టీ.ఓఆర్‌జీ)ను ఇటీవల ప్రారంభించారు. విమెన్‌సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో బ్రిటిష్‌ హైకమిషన్, తరుణి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మనుషుల అక్రమ రవాణా కేసులు తరచుగా వెలుగుచూస్తున్నాయి. మహిళలు, బాలికలను ఎత్తుకెళ్లి వ్యభిచార గృహాలకు విక్రయించడం, పిల్లల చేత బలవంతంగా పనిచేయించడం, భిక్షాటన, వారి అవయవాల మార్కెటింగ్‌ తదితర మాఫియా ముఠాల ఆట కట్టించడం ఈ వెబ్‌సైట్‌ ముఖ్య ఉద్దేశం.  అలాగే దీనిపై ఆన్‌లైన్‌లో పోలీసులకు, సాధారణ పౌరులకు సైతం శిక్షణ ఇస్తారు.  

ఈ వెబ్‌సైట్‌లో ఏముంటుంది? 
‘ధ్రువ’వెబ్‌సైట్‌ ట్రాఫికింగ్‌కు సంబంధించిన సమస్త సమాచారంతో భాండాగారంలా పనిచేస్తుంది. ఈ వెబ్‌సైట్‌ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ.. త్వరలోనే పూర్తి స్థాయిలో సేవలు అందించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉంచారు.  
► హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది. ఈ సమస్య దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది? ట్రాఫికింగ్‌ను ఎలా కనిపెట్టవచ్చు? ఎలా బయటపడవచ్చో వివరిస్తుంది. 
► బాధితులు ఎవరిని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలో తెలియజేసే ఈ–మెయిల్, ఫోన్, వాట్సాప్‌ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. 
► భారత న్యాయవ్యవస్థలో ట్రాఫికింగ్‌ బాధితులకు అనుకూలంగా ఉండే చట్టాలు, తీర్పులు, వారి హక్కులు, పరిహారం తదితర వివరాలుంటాయి.  
► ఈ–లెర్నింగ్‌ అనే ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా సాధారణ పౌరులు, పోలీసులకు శిక్షణ ఇస్తారు. ఆన్‌లైన్‌ కోర్సులు నిర్వహించి అప్పటికప్పుడు సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తారు. 
► రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాకు సంబంధించి వివిధ భాషల్లో ప్రచురితమైన వ్యాసాలు ఉంటాయి. 
 
మనవద్ద సైతం.. 
అంతర్జాతీయ ట్రాఫికింగ్‌ ముఠాలు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్‌ తదితర దేశాల నుంచి పలువురు మహిళలను దొడ్డిదారిలో దేశం దాటించి దేశంలోని పలు నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల పలుమార్లు రాచకొండ పోలీసులు ఈ తరహా కేసులను పట్టుకున్నారు. 2019లోనూ నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన పిల్లలు పట్టుబడ్డారు. కిడ్నాపింగ్, బెగ్గింగ్‌ మాఫియా, ఆర్గాన్‌ మాఫియాల ఆటకట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 31 మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ విమెన్‌సేఫ్టీ వింగ్‌ పర్యవేక్షణలో పనిచేస్తాయి. 

టెక్నాలజీతో అరికడతాం
మానవ అక్రమ రవాణా కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీటిని ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు బృందాలను కూడా ఏర్పాటు చేశాం. ఆయా బృందాలకు టెక్నాలజీని జోడించి హీనమైన నేరాలకు పాల్పడేవారి ఆట కట్టిస్తాం. 
    – మహేందర్‌రెడ్డి, డీజీపీ 

సంపూర్ణ సహకారం
ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా చాలా ఘోరమైన నేరం. వీటిని అరికట్టేందుకు నడుం బిగించిన తెలంగాణ పోలీసులకు సాంకేతికంగా, సమాచారపరంగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.     
– ఆండ్రూ ఫ్లెమింగ్‌ బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ 

నిబంధనావళి.. శిక్షణ 
ట్రాఫికింగ్‌ కేసుల్లో వేగంగా ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక నిబంధనావళి రూపొందించాం. దీనిపై ప్రత్యేకంగా నియమించిన బృందాలకు శిక్షణ ఇచ్చాం. సిబ్బందికి సాంకేతిక మెళకువల కోసం నిరంతర శిక్షణ కూడా ఇస్తున్నాం.  
 – స్వాతి లక్రా,ఏడీజీ, విమెన్‌సేఫ్టీ వింగ్‌  

మరిన్ని వార్తలు