భళా.. భారతి!

5 Jan, 2021 09:05 IST|Sakshi

దేశంలోనే తొలి లైన్‌ వుమెన్‌గా గిరిజన యువతి

కోర్టులో కొట్లాడి మరీ విజయం సాధించిన వైనం

తొర్రూరు: పురుషులకు మాత్రమే పరిమితమైన విద్యుత్‌ లైన్‌మెన్‌ పోస్టును తొలిసారి ఓ గిరిజన యువతి చేజిక్కించుకుంది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం బోజ్యా తండా పంచాయతీ పరిధిలోని దేశ్యా తండాకు చెందిన వాంకుడోతు భారతి దేశంలోనే తొలి జూనియర్‌ లైన్‌ వుమెన్‌గా ఎంపికై రికార్డు సృష్టించింది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం లైన్‌మెన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. మహబూబాబాద్‌ జిల్లా నుంచి భారతి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించలేమని అధికారులు సెలవిచ్చారు. అయినా వెనక్కు తగ్గని భారతి హైకోర్టును ఆశ్రయించగా.. మహిళలను కూడా లైన్‌ వుమెన్‌ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీం

తో అధికారులు మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో క్లిష్టమైన స్తంభాలు ఎక్కే పరీక్షలో కూడా ప్రతిభ కనబరిచిన భారతి జూనియర్‌ లైన్‌ వుమెన్‌ ఉద్యోగానికి ఎంపికైంది. ఈమెతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన బబ్బూరి శిరీష కూడా ఉద్యోగాన్ని సాధించింది. లంబాడ సామాజిక వర్గానికి చెందిన తనకు చెట్లు ఎక్కడం, వ్యవసాయ పనులు చేయడం అలవాటేనని, ఆ ధైర్యంతోనే తాను స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు, ప్రభుత్వానికి విన్నవించుకున్నానని భారతి చెప్పారు. తాను ఉద్యోగానికి ఎంపికైనట్లు ఇప్పటికే సమాచారం అందిందని, ప్రభుత్వం నుంచి నియామక పత్రం రాగానే ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తానని తెలిపింది. కాగా, భారతి భర్త మోహన్‌ ప్రైవేటు ఉద్యోగి. వీరికి ఎనిమిదేళ్ల సాయితేజ, నాలుగేళ్ల శాన్విశ్రీ సంతానం.

మరిన్ని వార్తలు