77 అంశాలతో ఎజెండా.. 29న జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం 

22 Jun, 2021 09:45 IST|Sakshi

లింగోజిగూడ కార్పొరేటర్‌

ప్రమాణ స్వీకారం కూడా.. 

సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి  కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. అది ముగియగానే దానికి కొనసాగింపుగా సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఎజెండాలో చేర్చిన 77 అంశాల్లో  లింగోజిగూడ  డివిజన్‌  ఉప  ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి కార్పొరేటర్‌గా ప్రమాణం చేయాల్సి ఉంది. గత డిసెంబర్‌లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఆడివిజన్‌ నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్‌ ప్రమాణ స్వీకారం చేయకముందే మరణించడం తెలిసిందే.

ఎజెండాలోని ఇతర  అంశాల్లో ఆయా ప్రాజెక్టులకు 
అవసరమైన భూసేకరణలు, జంక్షన్లలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణ,  థీమ్‌పార్కుల అభివృద్ధి, బాక్స్‌ డ్రెయిన్ల నిర్మాణం,  బస్‌షెల్టర్లు, సబ్‌వేలు,  రహదారుల విస్తరణ, పర్యాటక, వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణకు  సిబ్బంది నియామకం, న్యాక్‌ ద్వారా ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న ఇంజినీర్ల గడువు మరో ఏడాది పొడిగింపు తదితరమైనవి ఉన్నాయి. వాస్తవానికి వీటిపై  కొత్తగా చర్చించేదంటూ ఏమీ ఉండదు కానీ, ఈసారి బీజేపీ బలం పెరగడంతో ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. చాలావరకు గతంలో స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన వాటినే జనరల్‌బాడీలో ఆమోదించాల్సి ఉన్నందున, ఎంతో కాలంగా సమావేశం జరగకపోవడంతో పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ  ఎజెండాలో చేర్చారు.  

వర్చువల్‌గానే.. 
ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయకముందు సర్వసభ్య సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్‌ లేనందున సాధారణ సమావేశానికి అవకాశం ఉంటుందేమోననే అభిప్రాయాలున్నాయి. లాక్‌డౌన్‌ తొలగించినా కోవిడ్‌ నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సి ఉంది. దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యే సమావేశాన్ని జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ హాల్‌లో భౌతికదూరంతో నిర్వహించడం సాధ్యం కాదని సంబంధిత అధికారి తెలిపారు. దీంతో వర్చువల్‌గానే సమావేశం జరగనుంది.  ప్రమాణం చేయాల్సిన కొత్త కార్పొరేటర్‌ మాత్రం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది.  

సాఫీగా జరిగేనా..? 
గత పాలకమండలి మాదిరిగానైతే సర్వసభ్య సమావేశాల్లోనూ చర్చించేదంటూ ఏమీ ఉండేదికాదు. గత పాలకమండలిలో అధికార టీఆర్‌ఎస్, దాని మిత్రపక్ష ఎంఐఎం మినహా ప్రతిపక్ష బలమంటూ లేకపోవడంతో ఏదనుకుంటే అది.. ఎంత సమయంలో ముగించాలనుకుంటే అంతే సమయంలో ముగించేవారు. ప్రస్తుతం బీజేపీ కార్పొరేటర్లు 45 మందికి పైగా ఉన్నారు. అధికార టీఆర్‌ఎస్‌తో బీజేపీ అన్ని విషయాల్లో ఢీ అంటే ఢీ అని తలపడుతుండటం తెలిసిందే. ప్రస్తుత ఎజెండాలోని అంశాలన్నీ పాత పాలకమండలి స్టాండింగ్‌కమిటీ ఆమోదించినవే అయినందున వివాదం ఎందుకులే అని మిన్నకుంటుందో.. లేక సాంకేతికంగానైనా సరే కొత్త పాలకమండలి ఆమోదించాల్సి ఉన్నందున వివాదానికి తెర తీస్తుందో సమావేశం రోజున వెల్లడికానుంది.  

చదవండి: లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు ‘తెలంగాణ’ గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు