-

Fish Prices: కొండెక్కిన చేపల ధరలు

9 Jun, 2021 05:47 IST|Sakshi
మృగశిర కార్తె సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని రాంనగర్‌ చేపల మార్కెట్‌లో చేపలు కొనేందుకు కిక్కిరిసిన జనం

రికార్డు ధర పలికిన కొరమీను

మృగశిర కార్తె సందర్భంగా ఎగబడిన జనం  

కిక్కిరిసిన చేపల మార్కెట్లు

సాక్షి, హైదరాబాద్‌: చేపల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుత సీజన్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం మృగశిర కార్తె సందర్భంగా ధర ఎంతైనా సరే కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. ఈ రోజు తప్పకుండా చేపలు తినాలనే నానుడితో ప్రజలు ఉదయం నుంచే చేపల మార్కెట్లకు పోటెత్తారు. దీంతో రాంనగర్, బేగంబజార్‌ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి.

తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే రాంనగర్‌ చేపల మార్కెట్‌లో జనం బారులు తీరారు. లాక్‌డౌన్‌ కారణంగా తక్కువ సమయం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం వరకు అన్ని మార్కెట్లలో దాదాపు చేపలు అమ్ముడు పోయాయి. కొరమీను కిలో రూ.700 నుంచి రూ.800 ఆల్‌టైమ్‌ రికార్డు ధర పలికింది. మామూలు రోజుల్లో ఇదే చేప ధర రూ.400 నుంచి 550 వరకు ఉంటుంది. అలాగే.. రవ్వ, బొచ్చ చేపలు కిలోకు ఏకంగా రూ.150 నుంచి రూ. 250 ధర పలికాయి.  


కరోనా నిబంధనలు గాలికి..  
ఎలాగైనా చేపలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి కనబరిచారేగానీ.. కరోనా నిబంధనలు అసలు పట్టించుకోలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సమయం తక్కువగా ఉండటంతో జనం గుంపులు గుంపులుగా తరలివచ్చారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. కరోనా నిబంధనలు పాటించాలన్న పోలీసుల సూచనలను ప్రజలు బేఖాతరు చేశారు.  

మరిన్ని వార్తలు