3 ఏళ్లుగా చెరువులో చేపలు మాయం.. కారణమేమిటంటే

27 Apr, 2021 15:51 IST|Sakshi
(ఫైల్‌ ఫొటో)

శంకరపట్నం: మూడేళ్లుగా చెరువులో చేపలు మాయమవుతున్నాయి. ప్రభుత్వం వేసిన చేప పిల్లలు కొద్దిగా పెద్దవి అవుతున్నాయో లేదో.. అప్పుడే చెరువులో కనిపించకుండా పోతున్నాయి. దీంతో వాటిని నమ్ముకుని వ్యాపారం చేద్దామనుకున్న మత్య్సకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులో చేపల మాయంపై మత్య్సకారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా చేపల దొంగలను పట్టుకోవాలని కష్టపడి గస్తీ కాశారు. ఫలితంగా దొంగలు చిక్కారు. చేపలు దొంగతనం చేస్తున్న ముఠా ఎట్టకేలకు గ్రామస్తులకు చిక్కడంతో వారు పోలీసులకు అప్పగించారు. 

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చెరువులో మూడేళ్లుగా చెరువులో వేసిన చేపలు మాయమవుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన మత్స్యకారులు చెరువుపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు రాత్రిపూట నిఘా పెట్టడంతో చేపలు దొంగిలిస్తున్న ఏడుగురి కనిపించారు. వారిని వెంటపడగా నలుగురు మత్స్యకారులకు చిక్కారు. ముగ్గురు పారిపోయారు. ఆ నలుగురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారిలో కొత్తగట్టుకు చెందిన నలుగురితో పాటు రేకొండ కమలాపూర్‌కు చెందిన మరో ముగ్గురు చేపల దొంగతనానికి పాల్పడుతున్నారని మత్స్యకారుల సంఘం ప్రతినిధి ప్రభాకర్ తెలిపారు.

చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు

కొత్తగట్టు చెరువు వద్ద దొంగలకు దేహశుద్ధి చేస్తున్న మత్స్యకారులు

మరిన్ని వార్తలు