ఇంకా వరద బురదలోనే వరంగల్లు

18 Aug, 2020 01:10 IST|Sakshi

 5 రోజులుగా జల దిగ్భంధంలోనే ఓరుగల్లు

జనజీవనం అతలాకుతలం

చెరువులను తలపిస్తున్న ప్రధాన రోడ్లు

సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం

4,116 మంది సురక్షిత ప్రాంతాలకు..

గంట గంటకూ పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం

ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన

నేడు వరంగల్‌కు మంత్రి కేటీఆర్

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ మహానగరం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. ఎటు చూసిన బురదమయమైన కాలనీలు, దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, సాయం కోసం బాధితుల ఆక్రందనలు.. ఇలా ఒకటేమిటి.. అనేక సమస్యలతో జనజీవనం అతలాకుతలమైంది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు వరంగల్‌ మహానగరాన్ని ముంచెత్తిన విషయం విదితమే. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీస్‌లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలే కాకుండా ఈసారి ప్రధాన కాలనీలు కూడా ఇంకా జల దిగ్భంధం నుంచి బయట పడలేదంటే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంట గంటకూ సమీక్షిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. (7 నుంచి అసెంబ్లీ.. )

సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు
వరద నీటిలో చిక్కుకు పోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు  తరిలించేందుకు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్సు (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 4,116 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించాయి. అయితే వరద సహాయక చర్యల్లో భాగంగా పడవలను ఉపయోగించడం నగర చరిత్రలో ఇదే మొదటి సారి కాగా, హంటర్‌ రోడ్డు, సాయినగర్‌ కాలనీ, సంతోషిమాత, కాలనీ, సరస్వతీ నగర్, నయీంనగర్, ములుగు రోడ్డు, హంటర్‌ రోడ్డు, అండర్‌ రైల్వే గేటు, దేశాయిపేట, నజరత్‌ పురం, వడ్డెపల్లి కాలనీ, కేయూ 100 ఫీట్ల రోడ్డు, తదితర ప్రాంతాలు వరద తాకిడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు, చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్, వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కమిషనర్‌ పమేలా సత్పతి నగరంలో పర్యటించి పలు కాలనీలు, ముంపు ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులకు భరోసా ఇచ్చారు. 
 
కదిలిస్తే కన్నీళ్లు 
పోటెత్తిన వరద లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీరని వేదన మిగిల్చింది. సోమవారం వరుణుడు కరుణించినప్పటికి జనజీవనం గాడిన పడలేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటిలో మగ్గుతున్నారు. నిత్యావసర వస్తువులు తడిసిపోయి, విష సర్పాల నడుమ అర్ధాకలితో అలమటిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పాలక, అధికార వర్గాలు అందిస్తున్న సహాయక చర్యలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. ఇళ్ల చూట్టూ వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక అవస్థలు పడ్డారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వల్ల మురుగు కాల్వలు పొంగి పొర్లాయి. ప్రధానమైన నాలాలు ద్వారా ఆ వరద నీరు వెళ్లకపోగా నేరుగా కాలనీల్లోకి ప్రవేశించాయి. ఇంకా ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండ హంటర్‌ రోడ్డులో ఎటు చూసినా వరద నీరు నిలిచి ఉన్నాయి. 

బొందివాగు నాలా నీరు సవ్యంగా వెళ్లకపోవడంతో సమీపంలోని ఉన్న కాలనీలను వరద ముంచెత్తింది. దీంతో హంటర్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న సాయినగర్‌ కాలనీ, సంతోషిమాత కాలనీ, ఎన్టీర్‌ నగర్, గాయిత్రీ నగర్, భద్రకాళి నగర్, రామన్నపేట రోడ్డు కాలనీల్లో ఉన్న ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో జనం జలం మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హన్మకొండ ప్రాంతంలోని నయీం నగర్‌ పోచమ్మకుంట వరకు ఉన్న నాలాల ద్వారా నీళ్లు వెళ్లడం లేదు. ప్రైవేట్‌ ఖాళీ స్థలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.  
 
అప్రమత్తంగా ఉండండి  
గోదావరి, ఇంద్రావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపునకు లోనయ్యే ఇళ్ల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ములుగు మండలం బండారుపల్లి గ్రామము వద్ద రాళ్లవాగులో ఆర్టీసీ బస్సు, అందులోని ప్రయాణికులు చిక్కుకోగా..పోలీసులు వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. భూపాలపల్లి నియోజకవర్గం మోరంచ వాగులో బీహార్‌ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు చిక్కుకున్నారు. రెస్క్యూ టీంను రంగంలోకి దించగా ఒడ్డుకు చేర్చారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆపన్న హస్తం అందించారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మోదుగుగడ్డ తండాకు చెందిన ముగ్గురు రైతులు వ్యవసాయ పనులు నిమిత్తం ఆకెరువాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయి చెట్టుని పట్టుకొని సహాయం కోసం ఎదురు చూశారు. తండావాసులు వారిని ఒడ్డున చేర్చారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు.  
 
హన్మకొండలో దేశంలోనే అత్యధిక వర్షపాతం  
వరంగల్‌ అర్బన్‌ : దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన పది నగరాల్లో హన్మకొండ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. హన్మకొండలో 212 మి.మీ. వర్షపాతం నమోదు కాగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మహారాష్ట్రలోని మహబలేశ్వరంలో 155 మి.మీ., మూడో స్థానంలో మధ్యప్రదేశ్‌లోని ఉమరిలో 153 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా, వర్షం భారీగా కాకుండా ఐదు రోజుల పాటు ఓ మోస్తరు, ముసురు రూపంలో కురవడంతో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని, అలా కాకుండా భారీ వర్షం కురిస్తే జలప్రళయం ఏర్పడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    

మరిన్ని వార్తలు