బయో ఆసియా విజేతలుగా ఐదు స్టార్టప్‌లు.. 

26 Feb, 2023 02:34 IST|Sakshi

రెండో రోజు కీలక అంశాలపై చర్చాగోష్టులు  

సాక్షి, హైదరాబాద్‌: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్, ఆరోగ్య రక్షణ సదస్సు బయో ఆసియా–2023లో రెండో రోజు జరిగిన చర్చా గోష్టిలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేషన్లు, పేరొందిన ఆరోగ్య రక్షణ రంగ నిపుణులు, విద్యాసంస్థల అధినేతలు, స్టార్టప్‌ల ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు.

బయో ఆసియా సదస్సులో భాగంగా రెండో రోజు ఐదు కీలక అంశాలపై చర్చా గోష్టులు జరగ్గా ఆపిల్‌ హెల్త్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సుంబుల్‌ దేశాయ్, అపోలో హాస్పిటల్స్‌ జేఎండీ సంగీతారెడ్డి మధ్య ఫైర్‌సైడ్‌ చాట్‌ జరిగింది. 50కి పైగా దేశాల నుంచి రెండువేల మందికిపైగా ప్రతినిధులు హాజరు కాగా, రెండు రోజుల్లో రెండు వేల ముఖాముఖి వాణిజ్య సమావేశాలు జరిగాయి. 

76 స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శించగా, అత్యంత వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శించిన ఐదు స్టార్టప్‌లను విజేతలుగా ప్రకటించారు. విజేతలైన ఎక్సోబోట్‌ డైనమిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, లాంబ్డాజెన్‌ థెరాప్యుటిక్స్, ప్రతిభ హెల్త్‌కాన్, రాంజా జీనోసెన్సర్, సత్య ఆర్‌ఎక్స్‌ ఫార్మా ఇన్నోవేషన్స్‌ స్టార్టప్‌ల ప్రతినిధులను మంత్రి కేటీఆర్‌ సత్కరించారు. ఈ సదస్సు ఆదివారం ముగియనుంది.   

మరిన్ని వార్తలు