మావోయిస్టులపై ఐదు రాష్ట్రాల పోలీస్‌ శాఖల కన్ను..!

15 Nov, 2021 04:23 IST|Sakshi

బేస్‌ క్యాంపులు విస్తృతం చేస్తున్న ఐదు రాష్ట్రాల పోలీసులు

ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు 

దట్టమైన అటవీ ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్, ఇతర సాయుధ బలగాల పాగా 

మావోయిస్టులను మరింతగా నియంత్రించడమే లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌:  వరుస ఎదురుదెబ్బలతో కుదేలవుతున్న మావోయిస్టు పార్టీని మరింత నియంత్రించేందుకు ఐదు రాష్ట్రాల పోలీస్‌ శాఖలు వ్యూహాత్మక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. బేస్‌ క్యాంపులు దట్టమైన అటవీ ప్రాంతంలో ఎంత లోపలికి చేరుకుంటే మావోయిస్టుల నియంత్రణ అంత సులువుగా మారుతుందని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటి చొప్పున బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేయగా.. తాజాగా 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తూ దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి బలగాలు విస్తరించేలా పోలీస్‌ శాఖలు ఎత్తులు వేస్తున్నాయి. ఈ విధంగా ఒక్కో రాష్ట్రం నుంచి మొదలైన బేస్‌ క్యాంపుల ఏర్పాటు పొరుగు రాష్ట్రాల సరిహద్దులకు చేరుకుంది. సీఆర్‌పీఎఫ్, ఇతర సాయుధ బలగాలతో కూడిన బేస్‌ క్యాంపుల విస్తరణ దాదాపుగా పూర్తి కావస్తోందని పోలీస్‌ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. మహారాష్ట్ర– ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ సరిహద్దుల్లో ఇప్పటికే 45కు పైగా బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలి పాయి. శనివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ ఇంద్రావతి నది ఒడ్డున, మహారాష్ట్ర– ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే జరగడం బేస్‌ క్యాంపుల విస్తృతానికి ఉదాహరణగా పోలీస్‌ అధికారులు పేర్కొంటున్నారు.  

ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో..  
ప్రస్తుతం తెలంగాణలోని దుమ్ముగూడెం మండలంలోని గౌరారం, చర్ల మండలంలోని కలివేరు, తోగ్గుడెం, తిప్పాపురం, చలిమెలలో ప్రధాన బేస్‌ క్యాంపులుండగా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపునకు 8 ఔట్‌ పోస్టు బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అదే విధంగా మహారాష్ట్ర వైపు నుంచి ఛత్తీస్‌గఢ్‌– తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఏటపల్లి, కోర్చి, బామ్రా గఢ్, వడ్పా, ధనోరా, గడ్చిరోలి, వెంటాపుర్, సిరోంచా, ఐరి, చమరోచి, ఆర్మోరిల్లో బేస్‌ క్యాంపులు నడుస్తుండగా వీటికి తోడు మరో 12 ఔట్‌ పోస్టు బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో ఎటపాక వద్ద ప్రధాన బేస్‌ క్యాంపు ఉన్నట్టు తెలిసింది. ఒడిశా–ఆంధ్రప్రదేశ్‌ మధ్య 6 ప్రధాన బేస్‌ క్యాంపులతో పాటు 8 ఔట్‌ పోస్టు క్యాంపులను ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. దీనితో తెలంగాణ వైపునకు మావోయిస్టులు రాకుండా నియంత్రించడం సులభమైనట్టు రాష్ట్ర నిఘా వర్గాలు తెలిపాయి. అదే విధంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాయిపూర్‌ వరకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 18కి పైగా బేస్‌ క్యాంపులు రెండు రాష్ట్రాల సరిహద్దుల వరకు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దీని వల్ల ప్రతి వ్యక్తి కదలికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సులభమైనట్టు పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. అటు ఛత్తీస్‌గఢ్‌– ఒడిశా– ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లోనూ 26కు పైగా బేస్‌ క్యాంపులు పూర్తి స్థాయిలో పటిష్టంగా పనిచేస్తున్నట్టు తెలిసింది.  

కోవర్టు ఆపరేషన్లతో దూకుడు! 
బేస్‌ క్యాంపుల ఏర్పాటుతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలోని మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, ఆయా రాష్ట్రాల పోలీసులు పాగా వేసినట్టు తెలుస్తోంది. మూడేళ్ల ముందు వరకు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో సాగిన కూంబింగ్‌ అంతా ఒక ఎత్తు అయితే, తెలుగు రాష్ట్రాలు అవలంభించిన కోవర్టు, ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను అందిపుచ్చుకుని చేసిన ఆపరేషన్లు మరో ఎత్తు అని ఆయా రాష్ట్రాల పోలీస్‌ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. మావో యిస్టు పార్టీకి నిత్యావసరాలతో పాటు ఆయుధాలు, మందులు, డబ్బులు.. ఇతరత్రా వస్తువులను తీసుకెళ్లే కొరియర్లను ఆయా రాష్ట్రాల పోలీస్‌ శాఖలు కోవర్టుగా మార్చుకున్నట్టు మావోయిస్టు పార్టీయే అనేక సార్లు ఆరోపించింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో కొన్నిసార్లు భారీ స్థాయిలో దళ సభ్యులను కోల్పోవడంపై ప్లీనరీలో కూడా చర్చించింది. ఇలా కోవర్టు ఆపరేషన్లతో దూకుడు మీదున్న సీఆర్‌పీఎఫ్‌– పోలీస్‌ బలగాలు బేస్‌ క్యాంపుల నుంచి అన్ని రాష్ట్రాల సరిహద్దులను జల్లెడ పడుతూ భారీ స్థాయిలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా చేస్తున్నాయి. మరోవైపు సీనియర్ల మృతి, వ్యూహాత్మక నిర్ణయాల లోటు, కొంతమంది లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి తీరని నష్టం చేకూర్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

కీలక నేతల మృతి వెనుకా.. 
ఛత్తీస్‌గఢ్, ఏవోబీతో పాటు గెరిల్లా స్క్వాడ్లలో కీలకంగా వ్యవహరించే కొంతమంది నేతల మృతి వెనుక కూడా కోవర్టు ఆపరేషన్లు ఉన్నట్టు మావోయిస్టు పార్టీ అనుమానిస్తోంది. తినే ఆహారంలో విషం కలిపినట్టు కూడా అనుమానిస్తున్నట్టు తెలిసింది. చివరకు శనివారం నాటి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అగ్రనేత మిలింద్‌ గురించిన కీలక సమాచారం కూడా కోవర్టుల ద్వారానే పోలీస్‌ బలగాలను సేకరించినట్టు తెలిసింది. శనివారం గడ్చిరోలిలోని గ్యారపట్టిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మిలింద్‌ సహా 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు