బీజేపీ సభ వేళ ఫ్లెక్సీల రగడ.. అర్ధరాత్రి చించిపడేశారు!

27 Aug, 2022 09:37 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. వరంగల్‌ జిల్లాలోని భద్రకాళీ ఆలయం వద్ద పాదయాత్ర ముగియనుంది. కాగా, పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

ఇక, వరంగల్‌ సభ అనంతరం జేపీ నడ్డా.. హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతారు. ఈ క్రమంలో జేపీ నడ్డా.. నటుడు నితిన్‌, టీమిండియా ఉమెన్స్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తో భేటీ కానున్నారు. వీరి భేటీ మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. మునుగోడులో సభకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్‌ షా.. నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో, వీరి మధ్య పొలిటికల్‌ మీటింగ్‌ జరిగిందంటూ రాజకీయ నేతలు విశ్లేషించారు.

అయితే, ఈ సభ కోసం బీజేపీ ‍శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. బీజేపీ నేతలు ఓరుగల్లును కాషాయ జెండాలతో నిపేంశారు. ఎటు చూసినా బీజేపీ నేతల ఫ్లెక్సీలు, కాషాయ పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో మళ్లీ ఫ్లెక్సీల రగడ మొదలైంది. కాగా, బండి సంజయ్‌ పాదయాత్ర సందర్భంగా బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంజయ్‌కు స్వాగతం పలుకుతూ భారీగా కట్‌ అవుట్స్‌, ఫ్లెక్సీలు పెట్టారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి బీజేపీ ఫ్లెక్సీలను చించేశారు. అయితే, ఫ్లెక్సీలను చించివేసింది టీఆర్‌ఎస్‌ నేతలే అంటూ బీజేపీ లీడర్స్‌ ఆరోపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: వరంగల్‌లో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

మరిన్ని వార్తలు