తుపాకీతో బెదిరించి.. ఫ్లిప్‌కార్ట్‌ సామాగ్రి దొంగతనం.. కళ్లకు గంతలు కట్టి

14 Mar, 2023 10:50 IST|Sakshi
దోపిడీ జరిగింది ఈ డీసీఎంలోనే..

సాక్షి, హైదరాబాద్‌: ఐదుగురు దొంగలు దారిదోపిడీకి పాల్పడ్డారు. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రితో వెళుతున్న డీసీఎంను అడ్డగించారు. డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన భానూర్‌–బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ప్లిప్‌ కార్డ్‌ కంపెనీ నుంచి గజ్వేల్‌కు ఓ డీసీఎం వెళుతుండగా, పటాన్‌చెరు మండల పరిధిలోని కర్ధనూర్‌ సర్వీస్‌ రోడ్డు వద్ద ఐదుగురు కారులో వచ్చి అడ్డగించారు.

డీసీఎం డ్రైవర్‌ను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు. కళ్లకు గంతలు కట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగేలోపు తుపాకీతో బెదిరించారు. ఓ గంట తర్వాత కారులోంచి దింపారు. కళ్లకు కట్టిన గంతలు విప్పుకొని చూడగా, సుల్తాన్‌పూర్‌ ఎగ్జిట్‌–4 సర్వీస్‌ రోడ్డు వద్ద ఉన్నాడు. కొద్దిదూరంలో డీసీఎం ఉంది. అక్కడకు వెళ్లి చూడగా, డీసీఎంలో ఉన్న 20 బ్యాగులు కనిపించలేదు.

సుమారు రూ.1,78,000 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయని గుర్తించాడు. వెంటనే బాధితుడు పటాన్‌చెరు పోలీసులకు తెలుపగా వారు సంఘటన స్థలానికి వెళ్లాక పోలీసులు ఇది భానూర్‌–బీడీఎల్‌ ఠాణా పరిధిలోకి వస్తుందని వారికి సమాచారం ఇచ్చారు. డ్రైవర్‌ ఎండీ సత్తార్‌  ఫిర్యాదు మేరకు బీడీఎల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు