రావిచెట్టుపై రాత్రికి రాత్రే జెండా ఎగిరింది.. పెద్ద హంగామా..

15 Aug, 2021 14:38 IST|Sakshi
అనుభవాలను పంచుకుంటున్న వెంపటి మనోహర్‌

సాక్షి, భానుపురి (నల్లగొండ): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నిజాం రాజు ఇంకా ప్రత్యేక దేశంగా ఉండేందుకే మొగ్గు చూపారు. ఈ సమయంలో కొందరు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంకా నిజాం పోలీసులు, రజాకార్లదే పెత్తనం. అప్పుడు నా వయస్సు 9 ఏళ్లు. 1947 ఆగస్టు 15న గుర్తుతెలియని వ్యక్తులు రావిచెట్టు బజారు (ప్రస్తుత బొడ్రాయిబజారు)లో ఓ పెద్ద రావిచెట్టుపై రాత్రికి రాత్రే జాతీయ జెండాను ఎగురవేశారు.

పోలీసుల భయం ఎక్కువగా ఉన్న ఆ సమయంలో జెండా ఎవరూ కట్టారో తెలుసుకునేందుకు పెద్ద హంగామే జరిగింది. పోలీసులు సోదాలు చేయడం, అనుమానం ఉన్న వారిపై లాఠీలు ఝుళిపించారు. పెద్ద ఘర్షణ వాతావరణమే నెల కొంది. నిజాంరాజు లొంగిపోయిన తర్వాత కూడా జెండా పండుగకు ప్రజలు పోలీసుల భయంతో పెద్దగా వచ్చేవారు కాదు. ఆర్య సమాజ్‌కు చెందిన యామ రామచంద్రయ్య (కన్నయ్య), విశ్వమిత్ర పండిత్‌జీ లాంటి వారు ముందుండి నడిపేవారు. రామాలయం పక్కనే ఉన్న గ్రంథాలయంలో జెండా ఎగురవేసేది. రానురాను మొదటగా గాంధీపార్క్, పబ్లిక్‌ క్లబ్‌ ఇలా అన్నిచోట్ల జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. 

మరిన్ని వార్తలు