శ్రీశైలానికి భారీగా వరద 

10 Sep, 2022 02:43 IST|Sakshi

జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి ప్రవాహం  

దోమలపెంట (అచ్చంపేట)/నాగార్జునసాగర్‌: జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో జూరాల నుంచి స్పిల్‌ వే ద్వారా 1,73,946 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 26,741, సుంకేసుల నుంచి 1,83,630, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు మొత్తం 3,84,434 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

దీంతో పది క్రస్టు గేట్లు ఒక్కొక్కటి 15 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,79,630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎడమ గట్టు భూగర్భ విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,287 క్యూసెక్కులు.. మొత్తం 4,41,701 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885.0 అడుగులు, 215.8070 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వతో ఉంది. 

సాగర్‌లో 22 గేట్ల ద్వారా నీటి విడుదల 
శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 3,93,553 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్‌ నుంచి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. 22 రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా 3,48,472 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 33,040 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌  గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.10 అడుగులుంది.  

మరిన్ని వార్తలు