కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద 

13 Aug, 2022 03:06 IST|Sakshi
నాగార్జున సాగర్‌  

గద్వాల రూరల్‌/దోమలపెంట: కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు జూరాలకు 2.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 38 క్రస్టుగేట్లు ఎత్తి శ్రీశైలానికి 2.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోవైపు విద్యుదుత్పత్తి ద్వారా 27,943 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 2,33,021 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.14 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,83,636 క్యూ సెక్కులు ఉండగా, 2,00,451 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 112.10 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు జూరాలతో పాటు సుంకేసుల నుంచి 1,60,338 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం 4,03,275 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పది గేట్లు 15 అడుగల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,77,650 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 58,609 క్యూసెక్కులు.. మొత్తం 4,36,259 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.6 అడుగులు, 213.4011 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మరిన్ని వార్తలు