ఎగసిపడ్డ జ్వాల.. తిరగబడ్డ వరద బిడ్డ

1 Nov, 2020 08:49 IST|Sakshi

వరద సాయం పంపిణీలో రాజకీయ జోక్యం

నిజమైన బాధితులకు అందని సాయం 

రెండో అంతస్తులో ఉన్నవారికి ఆర్థిక సహాయం 

నాలా అంచున్న ఇళ్లను విస్మరించిన వైనం 

ధర్నాలు, రాస్తారోకోలు, కార్యాలయాల ముట్టడితో ఉద్రిక్తత

వరద పరిహారం పంపిణీ పరిహాసమైంది. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని శనివారం నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది. నిండా మునిగిన వారిని వదిలేసి తమ అనుచరగణానికే డబ్బులు పంపిణీ చేశారంటూ ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులపై ఆగ్రహం పెల్లుబికింది. రెండు, మూడో అంతస్తుల్లో ఉన్నవారికి రూ.10 వేలు ఇచ్చి..నాలాల పక్కన ఉండి..నీటమునిగిన ఇళ్లలోని వారిని విస్మరించడం న్యాయమేనా అంటూ బాధితులు నిలదీశారు. సికింద్రాబాద్‌ నామాల గుండులోని డిప్యూటీ స్పీకర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అంబర్‌పేటలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. అబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టగా..ఆఫీసుకు తాళం వేయాల్సి వచ్చింది. నచ్చిన వారికి పరిహారం ఇచ్చి...అర్ధంతరంగా పంపిణీ ఎలా నిలిపివేస్తారని పాతబస్తీలో బాధితులు ఆగ్రహించారు. నగరం నలుమూలలా ఈ రకమైన నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకోవడంతో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు బిత్తరపోవాల్సి వచ్చింది.  – సాక్షి, సిటీబ్యూరో

సాక్షి, సిటీబ్యూరో : నగరంలో వరద సాయం రూ.10 వేలు అందని వేలాది మంది పేద ప్రజలు తిరగబడ్డారు. నిజమైన బాధితులకు పరిహారం ఇవ్వలేదంటూ రోడ్డెక్కారు. వీరి వేదన..ఆగ్రహ జ్వాలలకు అధికారుల తీరుతోపాటు రాజకీయ జోక్యం, స్థానిక పరిస్థితులు కారణంగా కనిపిస్తున్నాయి. బాధితులందరికీ  వరదసాయం అందించాలని భావించిన ప్రభుత్వం.. ఒక్కరే రెండుసార్లు పొందకుండా ఉండేందుకు ప్రత్యేక యాప్‌ను, అందులో ఆధార్‌ను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసింది. బాధితుల వద్దకు వెళ్లే ప్రభుత్వ యంత్రాంగం బాధితుల పేరు వంటి వివరాలతోపాటు ఆధార్‌నెంబర్, ఫొటో అప్‌లోడ్‌ చేయగానే బాధితుల ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తే సక్సెస్‌ అనే సందేశం వస్తుంది. అంటే బాధితులకు నగదు అందజేయవచ్చు. ఆటోమేటిక్‌గా సమాచారం ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా..నగదు పంచే ఉద్యోగుల వెంట ఉన్న స్థానిక నేతలు తాము ఇవ్వాలనుకునే వారికే ప్రాధాన్యత నివ్వడం.. తాము చెప్పిన ప్రాంతాలకే అధికారులను తీసుకువెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

బాధితులకు ఇళ్లవద్దే సాయం అందిస్తారు కనుక జియో కోఆర్డినేట్స్‌ ఆధారంగా అన్నీ నమోదవుతాయని, అవకతవకలకు తావుండదని అధికారులు చెబుతున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో గంపగుత్తగా ఆధార్‌ నెంబర్లు తీసుకువెళ్లి అప్‌లోడ్‌ చేయించడం వంటివి చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఫోన్‌ నెంబర్లకు వచ్చిన ఓటీపీని తీసుకున్న వారు బాధితుల్లో నగదు మొత్తం ఇవ్వకుండా çసగం మాత్రమే ఇచ్చి మిగతా సగం  నేతలు, అధికార యంత్రాంగం మిలాఖతై పంచుకున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు దక్కిందే చాలనుకుంటూ అంతటితోనే సంతృప్తి చెందగా, తమ పొరుగు వారికి అంది తమకు అందకపోవడం.. పై అంతస్తుల్లోని వారికి అంది నీళ్లలో మునిగిన గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వారికి అందకపోవడం, ఇంట్లో లేకపోయినా ఓనర్లకు అంది.. నష్టపోయిన కిరాయిదార్లకు అందకపోవడం  వంటి ఘటనలు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికేతరులకు కూడా సాయమందిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో నగరవ్యాప్తంగా బాధితులు నిరసనకు దిగారు.


 
సిబ్బంది మొత్తం బస్తీల్లోనే... 
తొలుత ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి లక్షరూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ.50 వేల సాయంతో పాటు ఇళ్లు నీళ్లలో ఉన్న బస్తీలు, కాలనీల్లోని వారికి రూ.10 వేల వంతున అందజేయాలనుకున్నారు.  అధికారులు సేకరించిన వివరాల మేరకు 1572 కాలనీలు, బస్తీలు ముంపునకు గురయ్యాయి. అక్కడ దాదాపు 3.92 లక్షల కుటుంబాలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రూ.400 కోట్లు నిధులు అందజేశారు. వాటిల్లో  శుక్రవారం వరకు రూ.342 కోట్లు పంపిణీ జరిగింది.  జీహెచ్‌ఎంసీ యంత్రాంగం మొత్తం ఈపనిలోనే  నిమగ్నమవడంతో  వాన అనంతరం జరగాల్సిన ఇతరత్రా అత్యవసర పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందునే..సాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేయమన్నారని సమాచారం.

జోనల్‌ ఆఫీసు ఎదుట ధర్నా.. 
పాతబస్తీలోని  ఉప్పుగూడ, రాజీవ్‌వగాంధీనగర్, శివాజీనగర్, సాయిబాబానగర్, క్రాంతినగర్, అరుంధతి కాలనీ, గౌలిపురా, పార్వతీనగర్, లలితాబాగ్‌లకు చెందిన వందలాది మంది మహిళలు ఉదయం 9 గంటలకే నర్కీపూల్‌బాగ్‌లోని జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. నిజమైన బాధితులకు కాకుండా..నచ్చిన వారికి పరిహారం అందించి అర్ధాంతరంగా పరిహారం ఎలా నిలిపివేస్తారంటూ ఆగ్రహించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రోడ్డెక్కిన బాధితులు 
ఖైరతాబాద్‌ నియోజక వర్గ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర డివిజన్లలోని ఏ గల్లీలో చూసినా రూ.పది వేల పంచాయితీనే కనిపించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.11 ఉదయ్‌నగర్‌ బస్తీలో సుమారు ఎనిమిది గల్లీల్లో డబ్బులు అందలేదంటూ బడుగులు రోడ్డెక్కారు. ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌ బస్తీలో సుమారు 280 మందిని సాయం కోసం ఎంపిక చేయగా 90 మందికి మాత్రమే సాయం అందింది. జూబ్లీ హిల్స్‌గురుబ్రహ్మనగర్‌ బస్తీతో పాటు వెంకటేశ్వరకాలనీ డివిజన్‌లోని దేవరకొండ బస్తీ, గౌరీశంకర్‌ నగర్‌ బస్తీ, బీఎస్‌ మక్తా తదితర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదని ఆందోళనలు కనిపించాయి.

స్తంభించిన ట్రాఫిక్‌ 
ఎల్‌బీనగర్‌ జోనల్, సర్కిల్‌ కార్యాలయాలతోపాటు ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని పలు చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. సర్కిల్‌ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించగా, చంపాపేట డివిజన్‌ పరిధిలోని కర్మన్‌ఘాట్‌ చౌరస్తాలో లింగోజిగూడ డివిజన్‌కు చెందిన తపోవన్‌ కాలనీ, శ్రీరాంనగర్‌ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. హస్తినాపురం డివిజన్‌లోని నందనవనం కాలనీలో మహిళలు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. మన్సురాబాద్‌ చౌరస్తాలో సాయం కోసం మహిళలు రోడ్డుపైన ధర్నా నిర్వహించారు.

మహిళల బైఠాయింపు 
కుత్బుల్లాపూర్‌ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్, సాయిబాబానగర్, సంజయ్‌గాంధీనగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు నర్సాపూర్‌ రాష్ట్ర రహదారిపై ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున మహిళలు భైఠాయించడంతో నర్సాపూర్‌రాష్ట్ర రహదారి ఇరువైపులా ట్రాఫిక్‌ స్తంభించింది. మహిళలు శాపనార్ధాలు పెడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ బోలక్‌పూర్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున మహిళలు నిరసన వ్యక్తం చేశారు. బోలక్‌పూర్, ముషీరాబాద్‌ రహదారిపై బైఠాయించారు. అదేవిధంగా తార్నాక డివిజన్‌లోని మాణికేశ్వరినగర్, ఇందిరానగర్‌ బి కాలనీ, వినోబానగర్‌ కమ్యూనిటీహాలు ప్రాంతాల్లో వరద బాధితులు ధర్నాకు దిగారు. ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో బాధితులతో పాటు స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటల పాటు  కార్యాలయం ఆవరణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

స్లమ్స్‌లోని పేదలకూ సాయమందాలని... 
నీట మునిగిన అన్ని ప్రాంతాల్లోని వారితోపాటు స్లమ్స్, పేదలెక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షాల వల్ల బాగా దెబ్బతిన్న వారికి కూడా సాయం అందజేయాల్సిందిగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రజాప్రతినిధులను, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించింది. స్థానికంగా అవగాహన ఉన్న వారుంటే అనర్హులకు సాయం అందకుండా చూడవచ్చని, ఇతరత్రా పలు విధాలుగా ఉపయోగపడతారని ప్రభుత్వం సూచించింది.    
– లోకేశ్‌కుమార్, కమిషనర్, జీహెచ్‌ఎంసీ  

తీవ్ర నష్టమెక్కడో తెలుసు..

  • పల్లెచెరువు, గుర్రం చెరువు, అప్పా చెరువులు తెగిపోయిన ప్రాంతాల్లోని పూల్‌బాగ్, అల్‌జుబేల్‌ కాలనీ, ఘాజి మిల్లత్‌ కాలనీ, బాలాపూర్, హఫీజ్‌బాబానగర్, గగన్‌పహాడ్‌లో నష్టం భారీగా జరిగింది.    
  • ఎల్‌బీనగర్‌ జోన్‌లోని  చెరువులు పొంగిపొర్లి నాగోల్, బండ్లగూడ, మన్సూరాబాద్, లింగోజిగూడ, సాగర్‌రింగ్‌రోడ్, చంపాపేటలు నీట మునిగాయి. మీర్‌పేట, బైరామల్‌గూడ చెరువుల నాలాల ఉధృతితో  ఉదయ్‌నగర్, మల్‌రెడ్డి రంగారెడ్డి నగర్, తపోవన్‌ కాలనీల్లో వేల ఇళ్లు నీటమునిగాయి.  
  • టోలిచోకి ప్రాంతంలోని నదీమ్‌ కాలనీ, విరాసత్‌ నగర్, బాల్‌రెడ్డి నగర్, జమాలికుంట, నీరజకాలనీ, వలీకాలనీ, అల్‌హస్నాత్‌కాలనీ తదితర  ప్రాంతాలు ముంపు వల్ల తీవ్రంగా దెబ్బతినడం తెలిసిందే.  
  • వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో  అందరికీ సాయం అందకపోవడంతో పాటు తక్కువ నష్టపోయిన ప్రాంతాల్లోని వారికి అందడం విమర్శలకు తావిచ్చింది. ఆ ప్రాంతాల్లో వారం పదిరోజుల వరకు ఇళ్లలో రోడ్లపై నీరు నిలిచింది. బోట్లతో సహాయక కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే. ఇళ్లలో వర్షపు నీరు చేరి ఒక్కో ఇంట్లో లక్షలాది రూపాయల విలువైన వస్తువులు పాడైపోయాయి. నష్టపోయిన వారికీ, పేదలకూ సాయం అందజేసేందుకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించినప్పటికీ, రాజకీయ జోక్యం కారణంగానే అభాసుపాలైందని సామాజిక  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాధితులందరికీ సాయం అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించడంతో ఈ సమస్యకు తెర పడగలదని భావిస్తున్నారు.   
>
మరిన్ని వార్తలు