తేరుకుంటున్న హైదరాబాద్‌

22 Oct, 2020 03:02 IST|Sakshi
ఎల్బీనగర్‌ సమీపంలోని కోదండరాంనగర్‌లో ఇంకా తగ్గని వరద ఉధృతి

సాక్షి, హైదరాబాద్‌/ చాంద్రాయణగుట్ట: హైదరాబాద్‌లో వరదలు కొంత తగ్గుముఖం పట్టినా.. అవి మిగిల్చిన బురద కష్టాలు లోతట్టు ప్రాంతాల్లోని బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చాలా కుటుంబాలు ఇంకా మురుగు నీటిలోనే ఉండిపోయాయి. సీజనల్‌ వ్యాధులు భయపెడుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో నగరం కాస్త తేరుకుంది. ముంపు ప్రాంతాల్లోని బాధితులు క్రమేపీ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంట్లో తడిసి ముద్దయిన విలువైన వస్తువులను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి ముందు పార్క్‌ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోగా... ఇంట్లోని టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్‌మిషన్, మంచాలు, పరుపులు, బీరువాలోని బట్టలు, విలువైన డాక్యుమెంట్లు, నగదు, బియ్యం సహా ఇతర నిత్యావసరాలన్నీ బురదలో మునిగిపోవడం చూసి బోరున విలపిస్తున్నారు. కాలనీల్లో ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి సుడిగుండాలే.

బడంగ్‌పేట్, మీర్‌పేట్, సరూర్‌నగర్, ధర్మపురికాలనీ, హరిహరపురం కాలనీ, అయ్యప్పకాలనీ, మల్లికార్జుననగర్, బంజారాకాలనీ, బేగంపేటలోని అల్లంతోటబావి, మయూరిమార్గ్, బ్రాహ్మణవాడీ, వడ్డెరబస్తీలు, పాతబస్తీ గుర్రంచెరువు కింద ఉన్న హఫీజ్‌బాబానగర్‌ ఎ, బి, సి. హెచ్‌ బ్లాక్, నసీబ్‌నగర్, ఉప్పుగూడ, శివాజీనగర్, క్రాంతినగర్, అరుంధతి కాలనీలు, పల్లె చెరువు కింద ఉన్న హాషామాబాద్, అల్‌జుబేల్‌ కాలనీలు ఇప్పటికీ ముంపులోనే ఉండిపోయాయి. గత రెండు రోజులతో పోలిస్తే వరద ఉధృతి తక్కువగా ఉంది. ఇంటి చుట్టూ పేరుకుపోయిన బురుద, జంతు కళేబరాలు, ఇతర వ్యర్థాలు తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతూ ముంపు బాధితుల ముక్కుపుటాలను అదరగొడుతున్నాయి. 

కొనసాగుతున్న సహాయక చర్యలు
మరోవైపు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం రామంతాపూర్‌ నేతాజీనగర్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ముంపునకు గురైన ఇండ్లను సందర్శించి ప్రతి ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేశారు. ఇక చంపాపేట డివిజన్‌ పరిధిలోని బైరామల్‌గూడ, హరిజన బస్తీ, బీఎన్‌రెడ్డి డివిజన్‌ పరిధిలోని సాహెబ్‌నగర్, బతుకమ్మ కుంట కాలనీ, మన్సూరాబాద్‌ డివిజన్‌లోని వీకర్స్‌ సెక్షన్, సరూర్‌నగర్‌ డివిజన్‌లోని అం బేద్కర్‌నగర్, శంకర్‌నగర్, భగత్‌సింగ్‌ నగర్, ఓల్డ్‌ సరూర్‌నగర్, బాపూనగర్‌లలో ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సహా యం అందజేశారు. నిత్యావసరాలతో కూడిన కిట్లను, దుప్పట్లను అందజేశారు. కేవలం ఇంటి యజమానులకే ఆర్థికసాయం అందజేస్తున్నారని, ముంపులో సర్వం కోల్పోయి తాత్కాలికంగా ఊరికి వెళ్లిపోయిన కిరాయిదారులను పట్టించుకోవడం లేదని బాధి తులు ఆరోపిస్తున్నారు. 

ఇంకా చీకటిలోనే కాలనీలు
హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌ పరిధిలో 12, సెంట్రల్‌ సర్కిల్‌ పరిధిలో 8, సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో 3, హబ్సిగూడ సర్కిల్‌ పరిధిలో రెండు చొప్పున మొత్తం 25 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఇప్పటికీ నీటిలోనే ఉండిపోయాయి. సౌత్‌జోన్‌లోని ఆల్‌జుబేల్‌కాలనీ, బాలాపూర్, మైసారం, ఓమర్‌కాలనీ, అఫ్జల్‌బాబా నగర్‌ , సెంట్రల్‌ జోన్‌లోని బాలాజీ భాగ్యనగర్, నదీంకాలనీ, నదీంకా లనీ నాలా, అక్బర్‌ మజీద్, సరూర్‌నగర్‌లోని శ్రీ చైతన్యకాలేజీ, అయ్యప్పకాలనీ 1, అయ్యప్పకాలనీ 2, హబ్సిగూడలోని లక్ష్మీనగర్‌ 1, మధురాబార్‌ కాలనీలు వారం రోజుల నుంచి అంధకారంలో ఉన్నాయి. 

శాంతించాలని గంగమ్మతల్లికి పూజలు
వరణుడు శాంతించాలని, వరద ఉధృతి తగ్గాలని కోరుతూ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌ అలీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు బుధవా రం పురానాపూల్‌ వద్ద మూసీనదిలో గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ... 112 ఏళ్ల అనంతరం ఆ స్థాయిలో వరదలు రావడంతో శాంతించాలని గంగమ్మతల్లికి పూజలు నిర్వహించామన్నారు. 

మరిన్ని వార్తలు