మళ్లీ ఉగ్రరూపం దాల్చిన మూసీ నది

18 Oct, 2020 09:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఛాదర్ ఘాట్ బ్రిడ్జితో సహా పక్కకు ఉన్న బస్తీలను మూసీ ముంచేసింది. 50కి పైగా పేదల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. చదర్‌ఘాట్‌ నుండి మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌ నగర్‌ ప్రధాన రోడ్ బంద్ అయింది. ఆ పక్కనే ఉన్న బస్తీలు మొత్తం నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాయకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరూ వచ్చి తమని చూడలేదంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నిండుకుండలా హిమాయత్ సాగర్ 
హిమాయత్‌ సాగర్‌ జల కళను సంతరించుకుంది. రాత్రి కురిసిన వర్షానికి నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు 5 అడుగుల మేర 12 గేట్లను ఎత్తి వేశారు. ఇక గండి పేటకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైన గేట్లు తెరిచే అవకాశం ఉంది. 

పాతబస్తీ అతలాకుతలం
నిన్న సాయంత్రం మళ్లీ వర్షం దంచికొట్టడంతో మరోసారి పాతబస్తీ అతలాకుతలమైంది. గుర్రం చెరువు వరద నీరు పాతబస్తీని ముంచెత్తెంది. మళ్లీ కాలనీలు నీటమునగడంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు తయారైంది పరిస్థితి. హిమాయత్‌ సాగర్‌ గేట్లు తెరవడంతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

అనవసరంగా రోడ్లపైకి రాకండి : సీపీ
‘‘రాత్రి కురిసిన వర్షానికి పాత బస్తీలో చాలా ప్రదేశాల్లో వరద నీరు చేరింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులను అలర్ట్ చేశాము. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాము. పాత బస్తీలోని ఫలక్‌నామా బిడ్జ్‌పైన ఆరు అడుగుల గొయ్యి పడింది. దీంతో మొత్తం ట్రాఫిక్ డైవర్సన్ చేశాము. జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో వరద ప్రాంతాల్లో ఉన్నవారిని రెస్క్యూ చేస్తున్నాం. అనవసరంగా ఎవరూ కూడా రోడ్లపైకి వాహనాలు తీసుకొని రాకండి. ఇంకా మూడు రోజులు పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ నుండి కోరుతున్నా’’మని సీపీ అంజనీ కుమార్‌ అన్నారు.

మరిన్ని వార్తలు