‘సాగర్‌’లో లీకేజీలు

8 Aug, 2021 02:27 IST|Sakshi
నాగార్జున సాగర్‌ డ్యామ్‌ గేట్ల నుంచి లీకవుతున్న నీరు

8 క్రస్ట్‌ గేట్ల నుంచి బయటకు పోతున్న వరదనీరు

డ్యామ్‌ గేట్ల నిర్వహణలో బయటపడ్డ లోపాలు

ఈ ఏడాది రూ. 70 లక్షలతో మరమ్మతులు చేపట్టిన 2 ప్రైవేటు సంస్థలు

రబ్బరు సీళ్లను సరిగ్గా అమర్చనందునే లీకేజీలంటున్న రిటైర్డ్‌ ఇంజినీర్లు

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గేట్ల నుంచి వరదనీరు లీకవుతోంది. క్రస్ట్‌గేట్లకు ఇటీవలే మరమ్మతు చేయించినా లీకేజీలకు బ్రేక్‌ పడలేదు. దీంతో గేట్ల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగర్‌ డ్యామ్‌కు 26 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు ఉండగా 4 గేట్లకు గతేడాది మరమ్మతు చేశారు. ఈ ఏడాది మిగిలిన 22 గేట్ల మరమ్మతులకు రూ. 70 లక్షలు కేటాయించారు. డ్యామ్‌ గేట్ల నిర్వహణ విభాగంలో సిబ్బంది కొరత ఉండటంతో అధికారులు మరమ్మతు పనులను రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. రబ్బరు సీళ్లు అమర్చడం, ఇనుప తీగలకు గ్రీజింగ్‌ చేయడం, గేర్లలో ఆయిల్‌ మార్చడం, గేట్లు ఎత్తే మోటర్ల స్టార్టర్లకు కాయిల్స్‌ బిగించడం వంటి పనులను ప్రైవేటు సంస్థలు చేపట్టాయి.

ఆ వెంటనే జలాశయానికి వరద రావడంతో వారంలోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అదనపు నీటిని దిగువకు విడుదల చేసేందుకు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను పైకి ఎత్తారు. నీటి రాక తగ్గడంతో శుక్రవారం సాయంత్రం మూసేసినా మళ్లీ శనివారం ఉదయం రెండు గేట్లను పైకెత్తి తిరిగి మధ్యాహ్నం మూసేశారు. అయితే గేట్లు మూసేసినా వాటిలోంచి నీరు ధారగా కారుతోంది. ముఖ్యంగా 6, 8, 11, 14, 15, 21, 25, 26 నంబర్‌ గేట్ల నుంచి నీరు ఎక్కువగా లీకవుతోంది. గేట్ల నుంచి నీరు లీకవడానికి రబ్బరు సీళ్లను సరిగ్గా అమర్చకపోవడమే కారణమని రిటైర్డ్‌ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. 

దారుణంగా స్పిల్‌ వే... 
స్పిల్‌ వేకు మరమ్మతులు నిర్వహించక దాదాపుగా 8 ఏళ్లు దాటింది. ఏటా డ్యామ్‌ నిర్వహణలో భాగంగా స్పిల్‌ వేకు మరమ్మతులు చేయాలి. ఈ 8 ఏళ్లలో డ్యామ్‌ క్రస్ట్‌గేట్లను ఐదుసార్లు ఎత్తగా పైనుంచి నీటి తాకిడికి స్పిల్‌వే దెబ్బతింటుంది. అందువల్ల ఏటా స్పిల్‌ వే నిర్వహణ చేపట్టాలి. ప్రస్తుతం స్పిల్‌ వే వద్ద పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పూర్తిగా కొట్టుకుపోయింది. ఇలాగే ఉంటే డ్యామ్‌ దెబ్బతినే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

లీకేజీలను తగ్గిస్తాం...
గేట్ల లీకేజీలను తగ్గించే ఏర్పాట్లు చేస్తాం. అన్నింటికీ కొత్త సీళ్లు వేయడం వల్ల నీరుకారడం సహజం. నిన్నటి వరకు వరదలు కొనసాగాయి. ఇప్పటికీ గేట్ల మీద నుంచి గాలికి నీటి తెప్పలు దుముకుతున్నాయి. జలాశయంలో కొంత నీరు తగ్గగానే వాక్‌ వే బ్రిడ్జి మీదుగా వెళ్లి బోల్ట్‌ నట్స్‌ను బిగిస్తే కొంత మేరకు లీకేజీలు తగ్గే అవకాశాలున్నాయి. నిర్వహణలో లోపాలేమీ లేకుండా చూస్తాం.
– సీఈ శ్రీకాంత్‌రావు.

మరిన్ని వార్తలు