అవినీతిపరులపై నజర్‌

6 Aug, 2020 11:15 IST|Sakshi
లంచం తీసుకుంటూ పట్టుబడిన అచ్చంపేట ఎక్సైజ్‌శాఖ సీఐ, జూనియర్‌ అసిస్టెంట్‌

ప్రభుత్వశాఖల్లో కొరవడిన పర్యవేక్షణ   

డబ్బులిస్తేనే ఫైళ్లకు మోక్షం  

అవినీతికి పెద్దపీట వేస్తున్న అధికారులు  

విపత్కర సమయాల్లోనూ దోపిడీ 

ఆరునెలల్లో 6కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు

గద్వాల క్రైం: ఉన్నతహోదాలోని కొందరు ఉద్యోగులు వేలల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండలేకపోతున్నారు. డబ్బులిస్తేనే ఫైల్స్‌కు మోక్షం కలుగుతుందని ఖరాకండిగా చెబుతున్నారు. అడిగినంత ఇస్తేనే పనులు పూర్తి అవుతాయని మొండికేస్తున్నారు. విసిగివేసారిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడిజిల్లాలోని మహబుబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఆరునెలల్లో ఆరుగురు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. వారి వద్ద నుంచి రూ.1,34,000నగదును సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.  

విపత్కర సమయంలో కక్కుర్తే... 
ప్రభుత్వ శాఖల్లో వైద్యం, రెవెన్యూ, కార్మిక, ఆహార నియంత్రణ శాఖలు కీలకంగా ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న అధికారులు కరోనా వైరస్‌  విపత్కర పరిస్థితుల్లో కూడా చేయి తడపనిదే పనులు చేయడం లేదు. గద్వాల జిల్లాలో అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. దీన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు నివేదికలను తయారు చేసి పెద్ద మొత్తంలో సొమ్ము కాజేసినట్లు ఆరోపణలున్నాయి. రోగులకు పౌష్టికాహారం, మందులు, ఇతర సదుపాయాలు అందలేదని ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడినట్లు సమాచారం. నడిగడ్డలో వైద్యశాఖలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.  

కొరవడిన పర్యవేక్షణ  
ఉమ్మడి జిల్లాలోని అన్ని ముఖ్యశాఖల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఏ శాఖలోనైనా పనులు కావాలంటే లంచం ఇవ్వాలని అధికారులు నిర్మోహమాటంగా అడుగుతున్నారు. వాణిజ్యం, వస్త్ర, బంగారం వ్యాపారాల్లో బిల్లులు ఇవ్వకుండానే సామాన్యు నుంచి నగదును వసూలు చేస్తున్నారు. తనిఖీలు నిర్వహించాల్సిన వాణిజ్య, ఇన్‌కాంట్యాక్స్‌ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.  

అవినీతి అధికారుల జాబితా సిద్ధం  
జిల్లాలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్‌తో పాటు వివిధశాఖల్లో విధులు నిర్వహిస్తున్న అవినీతి అధికారుల జాబితాను ఏసీబీ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. తమ పేర్లు ఏసీబీ అధికారుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో అని తెలిసిన వ్యక్తులతో సమాచారం తెలుసుకునేందుకు అవినీతి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పట్టుబడిన ఉద్యోగులు
గతనెల 23వ తేదీ జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు మంజూలకు పీజీ సీటు వచ్చింది. విధులు నుంచి రిలీవ్‌ చేయాలని జిల్లా ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ భీమ్‌నాయక్‌కు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో రూ.7వేలు లంచంగా ఇస్తే రిలీవ్‌ చేస్తానని హుకూం జారీ చేశాడు. సదరు బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. డీఎంహెచ్‌ఓకు లంచం ఇస్తుండగా ఏసీబి అధికారులు పట్టుకున్నారు.  
17.02.2020వ తేదీన గద్వాలకు చెందిన భానుప్రకాష్‌ ఫుడ్‌లైసన్స్‌ రెన్యూవల్‌ కోసం జిల్లా ఆహార కల్తీ నియంత్రణ కార్యాలయంకు వెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న మహ్మద్‌ వాజీద్‌ రూ.4వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ఏసీబీని ఆశ్రయించగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అ«ధికారులు పట్టుకున్నారు.  
24.02.2020న తిమ్మాజిపేట మండలం మారెపల్లి వెంకటయ్య 2.25ఎకరాల భూమిని కొనుగోలు చేసి మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డిప్యూటీ తహసీల్దార్‌ జయలక్ష్మి రూ.లక్ష ఇస్తేనే పని పూర్తి చేస్తానని చెప్పింది. సదరు భాదితుడు ఏసీబి అధికారులను ఆశ్రయించాడు. ఉద్యోగికి లంచం ఇస్తున్న క్రమంలో పట్టుబడింది.  
06.03.2020న దుప్పట్‌పల్లి గ్రామానికి చెందిన వెంకటప్ప 5.14ఎకరాల భూమిని విరాసత్‌ చేయించుకునేందుకు వీఆర్వో అనంత పద్మానాభంకు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.8వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు.  
16.03.2020న అచ్చంపేట జిల్లాకు చెందిన వెంకటరాంనాయక్‌కు అక్రమ మద్యం తరలిస్తూ 2018లో పట్టుబడ్డాడు. పట్టుబడిన కారును రిలీజ్‌ కోసం  ఎక్సైజ్‌ సీఐ శ్రావణ్‌కుమార్, జూనియర్‌ అసిస్టెంట్‌ దేవేందర్‌ రూ.9వేలు   లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.  
02.07.2020న నవాబుపేట, వెల్కచర్ల మండలానికి చెందిన ఇద్దరు ఉపాధిహామీ కూలీలు వివాహం ప్రోత్సాహక నగదుకు దరఖాస్తు చేసుకున్నారు. మహబుబ్‌నగర్‌ కార్మికశాఖలోని లెబర్‌ అసిస్టెంట్‌ కోటేశ్వర్‌రావు ఒక్కొక్కరి నుంచి లంచంగా రూ.3వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.  

మరిన్ని వార్తలు