మానసిక ఆరోగ్యంపై పెరిగిన దృష్టి

11 Oct, 2022 02:16 IST|Sakshi

కరోనా వ్యాప్తి తర్వాత క్రమంగా గుర్తిస్తున్న ప్రజలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో రోజువారీ ప్రాధాన్యాలు, లక్ష్యాలు మారిపోతున్నాయి. శారీరకంగా ధృఢంగా, చురుకుగా ఉండడం (ఫిజికల్‌ ఫిట్‌నెస్‌) కంటే కూడా మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించడం పెరిగింది. సగటు మనిషి జీవనంలోని పలు అంశాలపై మానసిక ఆరోగ్యం చూపే ప్రభావంపై క్రమంగా అవగాహన పెరుగుతోంది.

గత రెండున్నరేళ్ల కరోనా మహమ్మారి ప్రభావిత కాలంలో చోటుచేసుకున్న అనేక మార్పులతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వంటి వాటికి పెరిగిన ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. మానసిక ప్రశాంతత కొరవడిన వ్యక్తులపై వివిధ సమస్యలు ఏ విధంగా ప్రభావితం చూపుతున్నాయనేది క్రమంగా ప్రపంచానికి తెలిసొస్తోంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది నేర్చుకునే గుణం, పనిలో మెరుగైన ఉత్పాదకత, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెంపొందించుకోవడంపై ప్రభావం చూపుతున్నట్టు వివిధ పరిశోధనలు, అధ్యయనాల్లో గుర్తించారు.

ఈ పరిశీలనల్లో భాగంగా కోవిడ్‌ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా జాబ్‌మార్కెట్‌ ఒడిదొడుకుల్లో ఉద్యోగులు మానసికస్థితి ఒత్తిళ్లకు గురవుతున్నట్లు గుర్తించారు. 2022 జూన్‌లో డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ఏదో ఒక రూపంలో మానసికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు వెల్లడైంది. సోమవారం ‘వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌డే’ సందర్భంగా ఆయా అంశాలు, విషయాలు చర్చనీయాంశమయ్యాయి.  

మానసిక ఆరోగ్య పరిరక్షణ అనేది  ముఖ్యం..
ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యం. గత రెండున్నరేళ్ల కరోనా కాలంలో భవిష్యత్‌పై అనిశ్చితితో అధిక శాతం మంది జీవన ప్రమాణాలు దిగజారడం, తగిన ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడంతో చాలా కుటుంబాల్లో మానసిక ఒత్తిళ్లు పెరిగాయి. దాంతో మానసిక ప్రశాంత సాధనతోపాటు మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఏర్పడింది.

డబ్ల్యూహెచ్‌వో కూడా ‘మెంటల్‌ వెల్‌నెస్‌’పై దృష్టి పెట్టాలని చెబుతోంది. అయితే ప్రభుత్వాలు మన దగ్గర ఇప్పటిదాకా ‘మెంటల్‌ హెల్త్‌’పై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కోవిడ్‌ మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల ప్రభావంతో ఈ దృష్టిలో మార్పు వచ్చింది. ఇన్ని రోజులుగా పట్టించుకోని ముఖ్యమైన అంశంపై తప్పక దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శారీరకంగా ఎదురయ్యే అనేక సమస్యలకు మానసిక అనారోగ్యం కారణమవుతోంది. వాస్తవాలను అంగీకరించే స్థితికి చేరుకుంటే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యంతోనే ఉత్పాదకత పెరగడం, మెరుగైన కుటుంబ సంబంధాలతో శారీరక ఆరోగ్యం కూడా మెరుగౌతుంది. 
– సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌   

మరిన్ని వార్తలు