Bheemla Nayak: దూసుకుపోతున్న దుర్గవ్వ.. ట్రెండింగ్‌లో ‘అడవి తల్లి’

6 Dec, 2021 15:34 IST|Sakshi

సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్‌): టాలీవుడ్‌లో జానపదాల హోరు వినిపిస్తోంది. చిన్న సినిమాలకే కాకుండా.. పెద్ద సినిమాలు సైతం జానపద జపం చేస్తున్నాయి. కూలీనాలి చేసుకుంటూ అలసట తెలియకుండా జీవనశైలిని వర్ణిస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ.. దేవతలను కొలుస్తూ పాడేదే జానపదం. జనం నుంచి పుట్టిన పాటకు సమాజంలో ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం పల్లె పాటలకు మళ్లీ ఆదరణ లభిస్తుండటంతో జానపద కళాకారులు సినిమా రంగంలో రాణిస్తున్నారు.

ఈ కోవలోనే పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచిర్యాల జిల్లాకు చెందిన కుమ్మరి దుర్గవ్వ అనూహ్యంగా ఓ స్టార్‌ హీరో సినిమాలో పాటపాడే అవకాశం దక్కించుకుంది. ఆమె పాడిన ‘అడవి తల్లి’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్‌ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. గతంలోనూ ఈమె తెలుగుతోపాటు మరాఠీలోనూ అనేక పాటలు పాడింది. 


           కళాకారులతో కుమ్మరి దుర్గవ్వ  

మారుమూల గ్రామం నుంచి.. 
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ భర్త రాజయ్య చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. దుర్గవ్వకు కుమార్తె శైలజ, కుమారుడు ప్రభాకర్‌ ఉన్నారు. నిరుపేద కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. వరినాట్లు, పొలం పనులకు వెళ్లినప్పుడు దుర్గవ్వ తనకు వచ్చిన జానపద పాటలు పాడేది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న ఆమె కుమార్తె శైలజ తల్లితో పాటలు పాడిస్తూ యూట్యూబ్‌ అప్‌లోడ్‌ చేసేది.

ఇలా దుర్గవ్వ పాడిన పాటలు హిట్‌ కావడంతో మంచిర్యాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ ఆల్బమ్‌లలో పాటలు పాడించారు. ఆ పాటలు కూడా పాపులర్‌ కావడంతో మల్లిక్‌తేజ, మామిడి మౌనిక వంటి జానపద కళాకారులు దుర్గవ్వ కళను గుర్తించి అవకాశం ఇచ్చారు. సిరిసిల్ల చిన్నది.. నాయితల్లే.. అనే పాటతోపాటు ‘ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది.

మామిడి మౌనిక, సింగర్‌ మల్లిక్‌తేజ సహకారంతో టాలీవుడ్‌ స్టార్‌హీరో సినిమాలో పాడే అవకాశం వచ్చిందని దుర్గవ్వ కుమార్తె శైలజ తెలిపారు. ‘అమ్మకు సినిమాలో పాడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని’ శైలజ ‘సాక్షి’కి ప్రత్యేకంగా తెలిపారు. ప్రస్తుతం దుర్గవ్వ హైదరాబాద్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు