కలుషిత ఆహారం.. 60 మంది విద్యార్థినులకు అస్వస్థత 

6 Nov, 2022 04:42 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు  

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం అల్పాహారంగా తాలింపు అటుకులు, రవ్వతో పాయసం అందించారు. అటుకులు, పాయసంలో పురుగులు రావ డంతో వాటిని తిన్న విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతూ పాఠశాలలో కుప్పకూలారు.

దాన్ని గమనించిన మిగతా విద్యార్థినులు తినడం మానేశారు. పాఠశాల ప్రత్యేక అధికారి, వార్డెన్, వంట సిబ్బంది ఆ పదార్థాలను పడేశారు. కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థినుల్లో 25 మందిని మాత్రమే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. తహసీల్దార్‌ మురళీధర్, ఆర్‌ఐ మాధవరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డిలు పాఠశాలకు చేరుకుని మిగతావారిని పోలీసు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. డీఈవో నాంపల్లి రాజేశ్‌ ఆస్పత్రిలో విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు. బాధ్యులైన ప్రత్యేక అధికారితో పాటు నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.  

మరిన్ని వార్తలు