CM KCR: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్‌ సంచల వ్యాఖ్యలు

18 Jul, 2022 02:09 IST|Sakshi
భద్రాచలంలోని పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

గోదావరి పరీవాహకంలో క్లౌడ్‌ బరస్ట్‌కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది! 

ముంపు ప్రాంతాల పర్యటనలో ముఖ్యమంత్రి  కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు 

జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌లో ఈ తరహా కుట్రలు 

ఈ నెల 29 వరకు వానలు కురుస్తాయ్‌

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిందే.. 

గోదావరి తీరానికి ఇంకా ముప్పు తొలగిపోలేదు 

భవిష్యత్‌లో భయం లేకుండా కొత్త కరకట్ట డిజైన్‌ 

భద్రాచలం, ఏటూరునాగారం పరిధిలో సీఎం పర్యటన 

రెండు చోట్ల గోదావరి నదిలో చీర, సారె వేసి శాంతి పూజలు 

ముల్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు ఏరియల్‌ సర్వే 

ఏటూరు నాగారంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ వరంగల్‌:  మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వరదల వెనుక ఇతర దేశాల కుట్రలు దాగి ఉన్నాయంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశాం. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగానే అలా అకస్మాత్తు వరదలు వస్తాయి. ఇతర దేశాల వాళ్లు మన దేశం మీద క్లౌడ్‌ బరస్ట్‌ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్‌ బరస్ట్‌ కుట్రలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది’’ అని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పరిధిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా కేసీఆర్‌ ఈ మాటలు అన్నారు.

ఈ నెల 29వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని సమాచారం ఉందని.. అందువల్ల గోదావరికి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, తీర ప్రాంతాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి వరద ముంపు బాధితులకు అండగా ఉంటామని.. భవిష్యత్తులో ఏ గ్రామం కూడా వరద ముంపులో ఉండకుండా చర్యలు చేపడతామని ప్రకటించారు. నదికి ఇరువైపులా అవసరమైన చోట కరకట్టలను బలోపేతం చేయడంతోపాటు కొత్త కరకట్టలను నిర్మిస్తామన్నారు. పర్యటన సందర్భంగా కేసీఆర్‌ గోదావరి వరదను పరిశీలించి.. అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. 

ఇంకా వానలు పడతాయి..
వాతావరణ శాఖ అంచనాలు, ప్రైవేట్‌ వాతావరణ ఏజెన్సీల లెక్కల ప్రకారం ఈనెల 29 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటికే వాగులు, చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని, ఇకపై కురిసే ప్రతీ చినుకు వరదగా మారుతుందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని వానాకాలం ముగిసేదాకా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు, ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
 
తక్షణ సాయంగా రూ.10 వేలు 
ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని.. రెండు నెలల పాటు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. భద్రాచలంలో ముంపు కాలనీల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని.. వారి కోసం సింగరేణి సంస్థతో కలిసి రూ.1,000 కోట్లతో ఎత్తయిన ప్రాంతంలో కొత్త ఇళ్లతో కాలనీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ కాలనీ శంకుస్థాపనకు తానే స్వయంగా వస్తానని చెప్పారు. ఆ పర్యటనలో ఆలయం, పట్టణ అభివృద్ధి పనుల విషయాలు మాట్లాడుతాన్నారు. 

కరకట్టలు బలోపేతం చేస్తాం.. కొత్తవి కట్టిస్తాం 
భవిష్యత్‌లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు ముంపు భయం లేకుండా చర్యలు చేపడతామని.. దీనిపై ఐఐటీ ప్రొఫెసర్లు, సీడబ్ల్యూసీ ఇంజనీర్లు, రాష్ట్రానికి చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. భద్రాచలం ప్రాంతంలో గత ఐదు వందల ఏళ్ల వర్షపాతం, వరదల వివరాల ఆధారంగా కొత్త లెవల్స్‌ను నిర్ధారిస్తామని చెప్పారు. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుత కరకట్టను బలోపేతం చేయడంతోపాటు బూర్గంపాడు వైపు అవసరమైన చోట కరకట్టలు నిర్మిస్తామని వెల్లడించారు. విలీన మండలాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నిస్తామని. దీనిపై ఏపీ అధికారులతో మాట్లాడుతామని చెప్పారు. 

వరద తగ్గే వరకు పునరావాస కేంద్రాలు 
రామన్నగూడెంలో పునరావాస శిబిరాన్ని పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. వరద తగ్గే వరకూ పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని చెప్పారు. ‘‘వరదలు వచ్చినప్పుడల్లా రామన్నగూడెంలో నష్టం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ కాలనీలను పరిశీలించాను. ఈ ప్రాంతానికి వరద ముంపు రాకుండా, ఇబ్బంది లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటాం’’ అని ముంపు బాధితులకు కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.  

నెలాఖరుదాకా అలర్ట్‌గా ఉండాల్సిందే.. 
ఏటూరునాగారం ఐటీడీఏలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్‌.. నెలాఖరు వరకూ భారీ వర్షాలు కొనసాగే నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినా ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులను అభినందించారు. ప్రతిశాఖ అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని.. ఇప్పుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

వరద పరిస్థితులపై భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరదతో చాలాచోట్ల మిషన్‌ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని.. వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏటూరు నాగారం ప్రాంతంలో కరకట్టల పటిష్టత కోసం అవసరమైతే రూ.100 కోట్లు అదనంగా ఇస్తామన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు కోరినందున.. వెంటనే మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 

సీఎం ఏరియల్‌ సర్వే

రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాలి  
భారీ వర్షాలు, వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు జిల్లా కేంద్రంలో ఒక హెలికాప్టర్‌ను, భద్రాచలంలో మరొక హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఏజెన్సీ ప్రజలు ఇబ్బందిపడకుండా పాత బ్రిడ్జిలు, కాజ్‌ వేలు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. కరెంటును కూడా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. 

వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ నిధులు  
వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయం కింద ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ములుగు జిల్లాకు రూ.2.50 కోట్లు, భద్రాచలానికి రూ.2.30 కోట్లు, భూపాలపల్లి జిల్లా కు రూ.2 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.కోటీ 50 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. 

ఆదివారం భద్రాచలం బ్రిడ్జి వద్ద గోదారమ్మ శాంతించాలని మొక్కుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

ఈ వరదల వెనుక..
ముంపు ప్రాంతాల పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వరదల వెనుక ఇతర దేశాల కుట్రలు దాగి ఉన్నాయన్నారు. వరదలపై నిర్వహించిన సమీక్షలో కేసీఆర్‌ మాట్లాడుతూ ‘‘చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదను కడెం ప్రాజెక్టు దగ్గర చూశాం. ఏ ఒక్కరోజు కూడా కడెం ప్రాజెక్టు దగ్గర వరద రెండున్నర లక్షల క్యూసెక్కులు దాటలేదు. ఆ ప్రాజెక్టు గరిష్ట విడుదల సామర్థ్యం 2.90 లక్షల క్యూసెక్కులే. కానీ ఈసారి ఐదు లక్షల క్యూసెక్కులకు మించి వరద వచ్చింది. మానవ ప్రయత్నం కాదు కేవలం భగవంతుడి దయవల్లే ఆ ప్రాజెక్టు మనకు దక్కింది. ప్రాజెక్టు వద్ద వరద ఫోటోలు, వీడియోలు చూస్తుంటే.. అంతా నీళ్లుండి మధ్యలో ఓ చిన్న గీతలా డ్యాం కనిపించింది. ఇలా అకస్మాత్తుగా వచ్చే భారీ వరదలకు క్లౌడ్‌ బరస్ట్‌ కారణం. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశం మీద క్లౌడ్‌ బరస్ట్‌ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. గతంలో జమ్మూకశ్మీర్, లెహ్‌ (లడఖ్‌), ఉత్తరాఖండ్‌ దగ్గర ఈ తరహా కుట్రలు జరిపారు. ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్‌ కుట్రలు చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

ఏటూరునాగారంలోని రామన్నగూడెం వద్ద గోదావరికి సారె సమర్పిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సత్యవతి రాథోడ్, సీతక్క

క్లౌడ్‌ బరస్ట్‌ అంటే..? 
ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్నట్టుండి కొంత సమయంలోనే అతిభారీ వర్షం కురిస్తే దానిని ‘క్లౌడ్‌ బరస్ట్‌ (కుంభ వృష్టి)’ అని చెప్పవచ్చు. వాతావరణ శాఖ లెక్క ప్రకారమైతే.. ఒక ప్రాంతంలో ఒక్క గంటలోనే పది సెంటీమీటర్లకన్నా ఎక్కువ వాన కురిస్తే క్లౌడ్‌ బరస్ట్‌ అంటారు. తేమశాతం అత్యధికంగా ఉన్న మేఘాలు ఒకే చోట  కేంద్రీకృతం కావడం లేదా ఢీకొట్టడం వల్ల అప్పటికప్పుడు ఇలా కుంభ వృష్టి నమోదవుతుంది. నీరంతా ఒకేసారి పోటెత్తి.. అకస్మాత్తు వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది.  

సీఎం పర్యటన సాగిందిలా.. 
తొలుత సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం హన్మకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏటూరునాగారం, మణుగూరు మీదుగా భద్రాచలం చేరుకున్నారు. గోదావరి వంతెనపై కాన్వాయ్‌ ఆపి వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరి మాతకు పసుపు కుంకుమ, కుంకుమలతోపాటు నూతన వస్త్రాలు సమర్పించి పూజ చేశారు. తర్వాత కరకట్ట మీదికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడి నుంచి పునరావాస శిబిరాలకు చేరుకుని ముంపు బాధితులకు ధైర్యం కల్పించారు. తర్వాత భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్షించి.. హెలికాప్టర్‌లో ఏటూరునాగారంలోని రామన్నగూడెంకు బయలుదేరారు. ఈ సందర్భంగా గోదావరి వెంట ఏరియల్‌ సర్వే చేశారు. నదికి ఇరువైపులా వరదలో చిక్కుకున్న గ్రామాల పరిస్థితిని పరిశీలించారు.

రామన్నగూడెంలో హెలికాప్టర్‌ దిగాక కేసీఆర్‌ నేరుగా ఐటీడీఏ గెస్ట్‌హౌజ్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి వరద తాకిడికి గురైన రామన్నగూడెం కరకట్టను పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలంటూ గోదావరి తల్లికి సారె సమర్పించి పూజ చేశారు. తర్వాత పునరావాస శిబిరానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి ఏర్పాట్లు, భోజన వసతులపై ఆరా తీశారు. కాగా పర్యటనలో సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు