Hyderabad: చారిత్రక భాగ్యనగరికి విదేశీ పర్యాటక కళ

9 Jul, 2022 14:45 IST|Sakshi

కోవిడ్‌ అనంతరం క్రమంగా పెరుగుతున్న రాకపోకలు

‘రివెంజ్‌ టూరిజం’ పట్ల పర్యాటకుల్లో ఆసక్తి

రెండేళ్లుగా నిలిచిన టూర్లు..

ప్రస్తుతం 86 శాతానికి చేరిన అంతర్జాతీయ రాకపోకలు 

సాక్షి, హైదరాబాద్‌: ‘అతిథి దేవోభవ’ అంటూ భాగ్యనగరం పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తోంది. కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. గోల్కొండ కోట, చార్మినార్‌ వంటి శతాబ్దాల నాటి చారిత్రక కట్టడాలు యథావిధిగా విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా  వివిధ దేశాల నుంచి ప్రతిరోజు 5000 మంది, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 10 వేల మందికి పైగా పర్యాటకులు హైదరాబాద్‌ను సందర్శిస్తారు. వీరిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య సాధారణ రోజుల్లో 3000 వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో  7500 వరకు ఉంటుంది. మరో 2000 నుంచి 2500 మంది విదేశీ పర్యాటకులు నగరంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. కోవిడ్‌ కారణంగా ఈ రాకపోకల్లో స్తబ్దత నెలకొంది. 

కోవిడ్‌ ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా  ఎత్తివేయడంతో కొంతకాలంగా  పర్యాటకుల తాకిడి మొదలైంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, పర్యాటకులు నగరాన్ని సందర్శిస్తున్నారు. అలాగే విదేశీ రాకపోకలు కూడా పెరిగాయి. యూరోప్‌ దేశాల నుంచి నగరానికి ఎక్కువ మంది వస్తున్నట్లు జీఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్‌ ఆంక్షలను తొలగించినప్పటికీ చాలా మంది వేచి చూసే ధోరణి వల్ల  ప్రయాణం వాయిదా వేసుకున్నారని, రెండు నెలలుగా  రాకపోకలు తిరిగి ఊపందుకున్నాయని పేర్కొన్నారు.  


ఇది ‘రివెంజ్‌ టూరిజం’... 

ఏడాదికోసారి ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి సేదతీరడం సాధారణమైన అంశం. అలాగే  పర్యాటక ప్రియులు సైతం దేశవిదేశాలను సందర్శించి తమ అభిరుచిని చాటుకుంటారు. కానీ కోవిడ్‌ కారణంగా ఈ పర్యటనలు నిలిచిపోవడంతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆంక్షలు తొలగడంతో గట్టు తెగిన ప్రవాహంలా జనం రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా అనూహ్యంగా పెరిగిన పర్యాటకుల తాకిడిని ట్రావెల్స్‌ సంస్థలు ‘రివెంజ్‌ టూరిజం’గా అభివర్ణిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలోనే భారతదేశ సందర్శన కోసం తరలి వస్తున్నారు. ఢిల్లీ, ఆగ్రా వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించిన వాళ్లు దక్షిణాదిలో హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని చార్మినార్, గోల్కొండ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, తదితర ప్రాంతాలతో పాటు  రామప్ప ఆలయాన్ని సైతం ఎక్కువ మంది సందర్శిస్తున్నారు.  


పెరిగిన ప్రయాణికుల రద్దీ.. 

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. కోవిడ్‌కు ముందు ఉన్న డిమాండ్‌తో పోల్చుకుంటే  గత మే నెలలో 93 శాతం మంది జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 86 శాతం వరకు ఉండడం గనార్హం. జూన్‌ 10వ తేదీన ఒక్క రోజే 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కోవిడ్‌ తరువాత ఇదే అత్యధికం కావడం గమనార్హం.

వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాల సంఖ్య పెరగడంతో అందుకనుగుణంగా ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. మే నెలలో 15 లక్షలకు పైగా దేశీయ ప్రయాణికులు, సుమారు 2.7 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు బయలుదేరారు. నగరం నుంచి  ఇప్పుడు లండన్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, దుబాయ్, ఖతార్, షార్జా, దోహా, కువైట్‌లకు సర్వీసులు నడుస్తున్నాయి. హాంకాంగ్‌ మినహా, అంతకుముందున్న అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇప్పుడు విమాన సర్వీసులు ఉన్నాయి.కొత్తగా అంతర్జాతీయ గమ్యస్థానాలైన చికాగో, మాల్దీవులకూ విమాన సర్వీసులను జోడించారు. (క్లిక్: నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..)

మరిన్ని వార్తలు