గ్రామాల తరలింపు ఇంకెప్పుడు?

29 Sep, 2020 08:48 IST|Sakshi
మైసంపేట్‌ గ్రామం, స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, అధికారులు (ఫైల్‌)

సాక్షి, కడెం(ఖానాపూర్‌): పులి మనుగడ కోసం కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కోర్‌ ఏరియాలోని పలు గ్రామాలను తరలించాలని అటవీశాఖ నిర్ణయించింది. మొదటి విడతలో నిర్మల్‌ జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌ పంచాయతీ పరిధిలోని మైసంపేట్, రాంపూర్‌ గ్రామాలను పునరావాసం కింద తరలించనున్నారు. అటవీ సంరక్షణకు గ్రామస్తులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కాని సంబంధిత శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పునరావాసం ఏర్పాటు పనులు పారంభించలేదు. ప్రస్తుతం ఉన్న చోట కనీస సౌకర్యాల్లేవని.. తమను పునరావాసానికి ఎప్పుడూ తరలిస్తారని రాంపూర్, మైసంపేట్‌ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభం కాని పనులు..
రాంపూర్, మైసంపేట్‌ గ్రామాల ప్రజలకు ఇదే మండలంలోని కొత్త మద్దిపడగ సమీపంలో విద్య, వైద్యం, విద్యుత్, తదితర సౌకర్యాలతో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కట్టించనున్నారు. మరోవైపు మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్‌ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు సమీపంలో లబ్ధిదారులకు వ్యవసాయ భూమిని కేటాయించనున్నారు. గతేడాది జులై 12న ఆయా శాఖల అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పునరావాసానికి అనువైనదిగా తేల్చారు. 

ఉన్నచోట మౌలిక సౌకర్యాల్లేవు.. 
పునరావాసం కోసం ఎదురు చూస్తున్నామని.. మరోవైపు ప్రస్తుతం ఉన్న చోట కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.రాంపూర్‌ గ్రామంలో సొలార్‌ సిస్టం పని చేయక గ్రామస్తులు అంధకారంలో ఉంటున్నారు. ప్రస్తుతం వీరు ఉంటున్న గ్రామాల్లో ఉపాధి అవకాశాల్లేవు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. మరికొందరు గ్రామంలోనే కుటుంబపోషణకు తడకలు అల్లుతారు. వ్యవసాయ భూములున్నా.. సాగునీటికి ఇబ్బందులు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేనందున ఏళ్లుగా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పునరావాసం కింద వెళ్లేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 

ఇబ్బంది పడుతున్నం 
మా గ్రామాలను పునరావాసం కింద మరోచోటకు తరలిస్తామని అధికారులు తెలిపారు. అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు తప్ప పునరావాసం కల్పించడం లేదు. ప్రస్తుతం ఉన్న చోటును పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నం. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే మా ఇబ్బందులు తొలగిపోతాయి. – పెంద్రం లచ్చుపటేల్, మైసంపేట్‌

ఇంకెప్పుడు తరలిస్తారు?
మా గ్రామాలను పునరావాసం కింద ఇంకెప్పుడు తరలిస్తారో అధికారులు స్పష్టతనివ్వాలి. జాప్యం చేస్తే అడవులను నరికి పొడు వ్యవసాయం చేసుకుంటాం. మా కష్టాలు ఎవరికి కనిపించడం లేదు. త్వరగా పనులు పూర్తి చేసి.. పునరావాసం కల్పించాలి.  – దేవ్‌రావు, మైసంపేట్‌

రాష్ట్రం నుంచి నిధులు రాకనే..
టైగర్‌జోన్‌ పరిధిలోని రాంపూర్, మైసంపేట్‌ గ్రామాలను తరలించేందుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్దం చేశాం. కేంద్రం నిధులు విడుదలైనా.. రాష్ట్రానికి సంబంధించిన నిధులు విడుదలలో జాప్యం నెలకొంది. పునరవాసానికి రాష్ట్రం నిధులు విడుదలవగానే పనులు ప్రారంభిస్తాం. – సుతన్, డీఎఫ్‌వో నిర్మల్‌ 

మరిన్ని వార్తలు