అభివృద్ధి పేరిట.. అడవులు గుల్ల

28 Oct, 2022 00:50 IST|Sakshi

దెబ్బతింటున్న పర్యావరణం.. వాతావరణంలో మార్పులు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మానవాళి మనుగడకు ముప్పు

వచ్చే ఏడాది సాధారణం కంటే 1.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

ప్రపంచ అటవీ విస్తీర్ణంలో కేవలం 2% మేరకే మన దేశంలో అడవులు  

కచ్చితమైన కార్యాచరణ లేకపోతే ఇబ్బందులు తప్పవంటున్న నిపుణులు

అటవీ విస్తీర్ణం పెంపుదలలో దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ

శ్రీకాంత్‌రావు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి
పరిశ్రమల స్థాపన, రహదారుల నిర్మాణం, ఖనిజాల వెలికితీత కోసం అడవులను గుల్ల చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లోని సమీప భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ కోసం వ్యవసాయం మానేయడంతో పచ్చదనం తగ్గిపోతోంది. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.  తద్వారా వాతావరణంలో మార్పులు (క్లైమేట్‌ ఛేంజ్‌) చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల అకాల వర్షాలు, ఒకేచోట గంటల వ్యవ ధిలోనే కుండపోతగా సెంటీమీటర్ల కొద్దీ వర్షం పడటం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. మరోవైపు కర్బన ఉద్గారాల విడుదలకూ అడవుల నరికివేత కారణమవు తోంది. కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరిగిపోతోంది. ఒక్క భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ సమతుల్యత దెబ్బ తినడానికి ప్రధాన కారణం కాగా.. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం పర్యావరణ పరిరక్షణ కాంక్షను గాలికి వదిలేస్తున్నాయి.

దీంతో భవిష్యత్తులో మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే పెరుగు తున్న ఉష్ణోగ్రతలు 65 సంవత్సరాలు పైబడిన వారి ప్రాణాలు హరిస్తున్నట్లు ఇటీవల వెల్లడైన నివేదికలు స్పష్టం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా 2023–2024 మరింత వేడిగా ఉండబోతున్నట్లు పర్యావరణవేత్తలు హెచ్చ రిస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల సెల్సి యస్‌ అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటే పరిస్థితి ఎలా చేయి దాటిపోతోందో అర్థం చేసుకోవచ్చు. గుడ్డిలో మెల్లలా.. గడిచిన ఆరేళ్లుగా మన దేశంలో అటవీ విస్తీర్ణంలో, అడవి బయట చెట్ల పెంపకంలో కాస్త పెరుగుదల కనిపిస్తుండటం ఆశాజనక పరిణామం. 

రెండేళ్లలో 1,540 చ.కి.మీ. పెరుగుదల 
దేశంలో రెండేళ్లకోసారి అటవీ విస్తీర్ణంపై సర్వే చేస్తున్నారు. గత రెండేళ్లలో 1,540 చ.కి.మీ. మేరకు అటవీ విస్తీర్ణం పెరిగినట్లు, అడవి బయట మరో 721 చ.కి.మీ. మేరకు వృక్ష సంపద పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొక్కలు నాటడాన్ని కూడా వృక్ష సంపదగా చూపిస్తుండడం గమనార్హం. మొక్కలు త్వరగా వృక్షాలుగా ఎదగాలనే ఉద్దేశంతో వేర్లు బలహీనంగా ఉండి, చిన్నపాటి వర్షాలకే కూలిపోయే మొక్కలు నాటుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మర్రి, వేప, రావి, చింత లాంటి దీర్ఘకాలం జీవించే చెట్ల మొక్కలను తక్కువగా నాటుతున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో 21,214 చ.కి.మీ. మేర అడవులు
దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంపుదలలో ఏపీ (647 చ.కి.మీ.) తొలిస్థానంలో ఉండగా తెలంగాణ (632 చ.కి.మీ) రెండోస్థానంలో ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ కాగా అందులో 21,214 చ.కి.మీ. మేర (18.93 శాతం) అడవులు ఉన్నాయి. ఒడిశా (537 చ.కి.మీ.), కర్ణాటక (155 చ.కి.మీ.), జార్ఖండ్‌ (110 చ.కి.మీ.) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

అటవీ విస్తీర్ణంలో మధ్యప్రదేశ్‌ టాప్‌
దేశంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణత శాతం పరంగా చూస్తే.. అరుణాచల్‌ప్రదేశ్‌ (79.33%), మేఘాలయ (76%), మణిపూర్‌ (74.34%), నాగాలాండ్‌ (73.90%) ముందంజలో ఉన్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

లద్దాఖ్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం..
వాతావరణ మార్పుల కారణంగా.. మంచు కురిసే కశ్మీర్‌ ఆపైన ఉండే లద్దాఖ్‌లో రాబోయే దశాబ్దాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. 2030 స్వల్పకాలిక, 2050కి మధ్యకాలిక, 2085 దీర్ఘకాలికంగా పరిగణిస్తూ ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, బిర్లా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కలిసి ఈ సర్వే నిర్వ హించాయి. లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు అత్యధిక ఉష్ణోగ్రత పెరుగుదల నమోదయ్యే ప్రాంతాలుగా ఈ అధ్యయనంలో తేలింది. 

కచ్చితమైన కార్యాచరణ అవసరం
అభివృద్ధి పేరుతో పర్యావరణా నికి నష్టం కలుగజేస్తే వాతావరణ మార్పులు, రుతు వుల్లో మార్పులతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. భూ విస్తీర్ణంలో 30–35 శాతం అడవులు, పచ్చదనం ఉండడం అత్యంత అవసరం. కానీ ప్రస్తుతం అడవులు, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల మీదుగా కూడా రోడ్లు వేస్తున్నారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం పేరిట అయోమయ పరిస్థి తులు కల్పించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పోడు చేయాల్సిన అవసరముందా? అంత అడవి మనకు ఉందా? అన్నది ముఖ్యం. తగ్గిపోతున్న అడవులు, జీవ వైవిధ్యాన్ని మళ్లీ ఏ విధంగా, ఏ రూపంలో పునరుద్ధ రిస్తామన్నది పెద్ద సవాల్‌. అడవులు, వాతావరణ మార్పులపై అటవీశాఖ కచ్చిత మైన బాధ్యతతో కార్యాచరణను చేపట్టాల్సిన అవసరముంది.
– బీవీ సుబ్బారావు, నీటి నిపుణులు, పర్యావరణవేత్త

రాబోయే రోజుల్లో తెలంగాణపై తీవ్ర ప్రభావం
తెలంగాణలో 12, 13% కూడా దట్ట మైన అడవులు, పటిష్టమైన గ్రీన్‌కవర్‌ లేదు. పైగా వ్యవసా యం పేరుతో అటవీ భూములను  తీసుకుంటున్నాం. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న సారవంతమైన పచ్చని భూములు రియల్‌ ఎస్టేట్‌కు బలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. సముద్రమట్టానికి ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున తెలంగాణపై రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా పడబోతోంది. వడగాడ్పులు, అధిక వర్షాలు, ఎక్కువ చలి వంటి పరిస్థితులు పెరుగుతున్నాయి. వర్షాలు పడినా వేడి తగ్గడం లేదు. ఈ వాతావరణ పరిస్థితులు వివిధ రంగాల్లో ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నాయి. 
– డా.దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎక్స్‌పర్ట్, క్లైమేట్‌ ఛేంజ్‌ క్యాంపెయినర్‌

పర్యావరణ సమతుల్యత ముఖ్యం 
అటవీ విస్తీర్ణం క్షీణతతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో భయానక పరిస్థితులు ఏర్పడు తున్నాయి. తెలంగాణాలో 270 కోట్ల మొక్కలు నాటాలంటే రాష్ట్ర భూభాగంలో కనీసం 9 శాతం కావాలి. ఎక్కడ ఇచ్చారు? అటవీ ప్రాంతాలు కొట్టేస్తున్నారు. మొక్కలు నాటి వాటిని అడవు లుగా చూపిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత ముఖ్యం.
– బాబురావు, పర్యావరణవేత్త

మరిన్ని వార్తలు