Ex Army: దేశ సేవ చేశాం.. మమ్మల్ని పట్టించుకోండి

28 Aug, 2021 08:30 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: దేశ సేవ చేశాం.. సరిహద్దులో ప్రాణాలకు తెగించి, కాపలా కాశాం.. కానీ నేడు మా బతుకులను పట్టించుకునేవారే కరువయ్యారు.. జర మీరైనా నివేశన స్థలం కేటాయించండంటూ మాజీ సైనికులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌కు రాగా ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ నాయకులు ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ససేమిరా అనడంతో రహదారిపై జెండాలతో ఆందోళన చేపట్టారు. తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌లోని సర్వే నంబర్‌ 556లో 641 ఓపెన్‌ హౌస్‌ ప్లాట్లను కేటాయించి, 2014లో నోటిఫికేషన్‌ జారీ చేశారని, సొసైటీ నాయకులు రావుల రంగా రెడ్డి, బిస్మిల్లాఖాన్, మల్లేశం, విజయారెడ్డి, ప్రియదర్శిని, ఖాసీంలు తెలిపారు.

తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రాజ్యసభ సభ్యుడు వి.లక్ష్మీకాంతారావు కూడా లేఖ రాశారని గుర్తు చేశారు. 2007లో తాము రూ.5 వేల చొప్పున చెల్లించామని పేర్కొన్నారు. 200 చదరపు గజాలకు గాను ఒక్కో చదరపు గజానికి రూ.2 వేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారని తెలిపారు. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి, తమ సమస్య పరిష్కరించాలని కోరారు. 

చదవండి: తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..!

మరిన్ని వార్తలు