ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు కరోనా

11 Aug, 2021 03:00 IST|Sakshi

గాంధీ ఆస్పత్రిలో చికిత్స.. హోంఐసోలేషన్‌ సూచించిన వైద్యులు 

ఆందోళన అవసరం లేదని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆర్‌ఎస్‌పీ  

గాంధీ ఆస్పత్రి: బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్‌ అధికారి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉన్న ఆయన మంగళవారం కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో తక్షణమే సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు హోంఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సూచన మేరకు హోంఐసోలేషన్‌లో ఉంటున్నానని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

నల్లగొండలోనే సోకిందా... 
ఐపీఎస్‌కు రాజీనామా చేసిన ప్రవీణ్‌కుమార్‌ గత పదిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈనెల 8న నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొని బీఎస్పీలో చేరారు. ఈ సభకు హాజరైన ఆయనతో పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సన్నిహితంగా మెలిగారు. నల్లగొండ సభ పూర్తయిన తర్వాతే ప్రవీణ్‌కుమార్‌ ఆరోగ్యంలో స్వల్ప మార్పులు కనిపించాయి. దీంతో నల్లగొండ సభలోనే ప్రవీణ్‌కుమార్‌కు కరోనా సోకినట్లు భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు